ఉడ్‌పేటలో తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసిన కేంద్రీయ విద్యాలయం
అనకాపల్లి: అనకాపల్లిలో కేంద్రీయ విద్యాలయం ఈ ఏడాదైనా ఏర్పాటయ్యేనా అని పట్టణ ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వంలో ఎంపీ అవంతి శ్రీనివాసరావు అనకాపల్లిలో కేంద్రీ య విద్యాలయం ఏర్పాటుకు ప్రత్యేక కృషి చేశారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి రప్పిం చారు. అనకాపల్లి పరిధిలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కార్యకలాపాలు, నేవల్ బేస్, బుచ్చెయ్యపేట కొండపై ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక రక్షణ దళ ఉద్యోగుల పిల్లలకు అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటయ్యే కేంద్రీయ విద్యాలయంలో చదివేందుకు అవకాశాలు కల్పించాల ని నిర్ణయించారు. గత మూడేళ్ల నుంచి కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యింది.
తాత్కాలిక భవనాలలో ప్రారంభానికి ఆటంకం...
అనకాపల్లి కేంద్రంగా ఏర్పాటు చేయనున్న కేంద్రీయ విద్యాలయాన్ని సుందరయ్యపేట పంచాయతీ శివారు అచ్చియ్యపేటలోని సర్వే నంబర్ 511లో స్థలాన్ని కేటాయించారు. ఈ స్థలంలో రోడ్డును కూడా ఏర్పాటు చేశారు. రేపో మాపో కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అవుతుందని ఆశ పడుతున్న సమయంలో సాంకేతిక అవరోధాలు ఇబ్బందికి గురి చేశాయి. దీనికి తోడు అనకాపల్లి పట్టణంలోని ఉడ్‌పేట ఎలిమెంటరీ పాఠశాలలో రూ.10 లక్షల నిధులతో కేంద్రీయ విద్యాలయం తరగతులను తాత్కాలిక ప్రాతిపదికన ప్రారంభించాలని నిర్ణయించారు. దీనికి గాను భవనాలు, మరుగుదొడ్లు కూడా నిర్మించారు. అయితే కేంద్రీయ విద్యాలయం అధికారులు మాత్రం తాత్కాలిక ప్రాతిపదికన ఏర్పాటు చేసే భవనాల్లో తరగతులు ప్రారంభించమని ఖరాఖండీగా చెప్పేశారు.
తాత్కాలిక ప్రాతిపదికన..
ఉత్తరాదిన ఇదే తరహాలో తాత్కాలిక ప్రాతిపదికన కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభిస్తే తర్వాత శాశ్వత ప్రాతిపదికన భవనాలు నిర్మిస్తామని అక్కడి పాలకులు చెప్పి తీరా కేంద్రీయ విద్యాలయం ప్రారంభించాక స్థలం కేటాయించలేదని ఈ కారణంగా దేశం మొత్తం మీద ఎక్కడయితే శాశ్వత ప్రాతిపదికన భవనాలు కేటాయించి భవనాలు నిర్మించడంతో పాటు, వనరులు కల్పిస్తేనే తరగతులు ప్రారంభిస్తామని చెబుతున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగినా ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ఇంకా సమయం పడుతుంది. ఈ క్రమంలో కేంద్రీయ విద్యాలయం అధికారులు దృష్టి సారించి ఈ ప్రాంత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలతో పాటు మెరిట్ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించాలనే వాదన వినవస్తుంది. ఈ అంశం కేంద్రీయ విద్యాలయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారు.
డిప్యూటీ కమిషనర్ సిపారసులపైనే..
ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రీయ విద్యాలయాల డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ పర్యటించారు.ఆయన తాత్కాలిక ప్రాతిపదికన నిర్మించిన భవనాలతో పాటు, అచ్చియ్యపేటలో స్థలాన్ని పరిశీలించారు. ఆయన ఇచ్చిన సూచనలు అమలైతే తప్ప కేంద్రీయ విద్యాలయం ప్రారంభం అయ్యే అవకాశం లేదని విద్యాశాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరైనా ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రజల కోసం ఆలోచించాలి
కేంద్రం స్థానిక ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకురావాలి. గత మూడేళ్ల నుంచి కేంద్రీయ విద్యాలయం ప్రారంభిస్తామని చెబుతున్నారు. దీనికి గానూ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న భూములు ఇవ్వడంతో పాటు ఎటువంటి సాంకేతిక ఇబ్బందులు లేకుండా చూడాలి. ఎన్నికల ఫలితాల ఆలస్యంగా వచ్చే అవకాశం ఉన్నందున కేంద్రీయ విద్యాలయం అధికారులు చొరవ చూపాలి. వచ్చే ఎన్నికల ఫలితాల అనంతరం కొలువు దీరనున్న జగనన్న ఇటువంటి విద్యా సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి కచ్చితంగా ప్రారంభిస్తారు. – గుడివాడ అమర్‌నాథ్,వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, అనకాపల్లి
Comments
Please login to add a commentAdd a comment