సాక్షి, అమరావతి: అంతర్జాతీయ స్థాయిలో రాజధాని నిర్మాణం అంటూ ప్రచారం చేసిన మాజీ సీఎం చంద్రబాబు అక్రమాల పునాదులపై పేక మేడలు కట్టినట్లు నిపుణుల కమిటీ నివేదిక స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఏపీ సీఆర్‌డీఏ) రాజధాని అమరావతిలో చేపట్టిన పనులు, కార్యకలాపాలపై నిపుణుల కమిటీ అధ్యయనంలో నివ్వెరపోయే వాస్తవాలు వెల్లడయ్యాయి. నిపుణుల కమిటీ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కన్సల్టెన్సీలు, డిజైన్ల పేరుతో ప్రజాధనం భారీ ఎత్తున దోపిడీ జరిగిందని కమిటీ నిగ్గు తేల్చింది. రాజధానిలో ఏది చూసినా అస్తవ్యస్తంగా ఉందని, అసాధారణంగా ఫీజులు పెంపు, ఒకే పనికి పలు కన్సల్టెన్సీల పేరుతో భారీగా చెల్లింపులు జరిగినట్లు స్పష్టం చేసింది.
నిపుణుల కమిటీ నివేదికలో కీలక అంశాలు...
- రాజధాని మాస్టర్ ప్రణాళికను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా ఇస్తుందని చెప్పిన గత సర్కారు అందుకు విరుద్ధంగా సుర్బానాకు రూ.11.92 కోట్లు చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుని రూ.16.64 కోట్లకు పెంచింది.
- సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిక వ్యయంతో రాజధాని నిర్మాణ ప్రణాళిక రూపొందించారు.
- బిడ్లు ఆహ్వానించకుండానే ఆర్కిటెక్ట్స్, కన్సల్టెన్సీ ఏజెన్సీలను ఇష్టానుసారంగా ఎంపిక చేశారు.
- ప్రభుత్వ భవనాల డిజైన్ల తయారీకి తొలుత జపాన్‌కు చెందిన మకీ అసోసియేట్‌ను ఎంపిక చేసి తర్వాత ఫోస్టర్ అండ్ పార్టనర్‌కు అత్యధిక ఫీజుతో అప్పగించారు.
- మాస్టర్ ప్రణాళిక, సీడ్ క్యాపిటల్, జ్యుడిషియల్ కాంప్లెక్స్, లెజిస్లేచర్ భనవాల డిజైన్లను ఏజెన్సీలకు అప్పగించడంలో ప్రామాణిక విధానాలను పాటించలేదు.
- దశలు, ముగింపు ప్రణాళికలు లేకుండా మౌలిక వసతుల ప్రాజెక్టులను ఇష్టానుసారంగా చేపట్టడంతో వ్యయం ఇప్పటికే అధికంగా ఉంది.
- ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కన్‌స్ట్రక్షన్ విధానంలో రూ.8 వేల కోట్ల విలువైన పనులను చేపట్టి అత్యధికంగా చెల్లించారు.
- ఆర్కిటెక్చరల్ డిజైన్ల పేరుతో కన్సల్టెంట్లకు రూ.270 కోట్ల ఫీజు చెల్లించారు. ఈ విధంగా చెల్లించడం డూప్లికేషన్ అవుతుంది.
- అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్ డిజైన్ల తయారీని ఫోస్టర్–పార్టనర్ కన్సారి్టయం కన్సల్టెన్సీకి తొలుత రూ.60.72 కోట్లకు అప్పగించి రూ.121.76 కోట్లకు పెంచేశారు.
- రాజధానిలో 39 ప్రాజెక్టుల విలువ రూ.25,877.67 కోట్లు కాగా డిజైన్ల కన్సల్టెన్సీ ఫీజుగా ఒక శాతం అంటే రూ.258.77 కోట్లు చెల్లించాల్సి ఉండగా ఏకంగా 2.12 శాతం మేర రూ.549.73 కోట్లను చెల్లించారు. రూ.290 కోట్లు అత్యధికంగా చెల్లించడం అసాధారణం.
ఒకే పనికి పలు కన్సల్టెన్సీల పేరుతో చెల్లింపులు
గత సర్కారు రాజధాని పేరుతో ఒకే పనికి ఫీజుల రూపంలో పలు కన్సల్టెన్సీలకు భారీగా చెల్లింపులు జరిపినట్లు నిపుణుల కమిటీ తేలి్చంది. అసెంబ్లీ, హైకోర్టు, ప్రభుత్వ కాంప్లెక్స్ ఆర్కిటెక్చరల్ సరీ్వస్ పేరుతో హఫీజ్ కాంట్రాక్టర్‌కు రూ.32.29 కోట్లకు అప్పగించారు. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు, శాఖాధిపతుల టవర్ ఆర్కిటెక్చరల్ సరీ్వసు పేరుతో ఫాస్టర్–పార్టనర్‌కు రూ.181.06 కోట్లకు అప్పగించారు. మళ్లీ సచివాలయం, హైకోర్టు భవనాల ఆర్కిటెక్చరల్ సరీ్వస్ పేరుతో ఫోస్టర్ ప్లస్ ఇండియా ప్రైవేట్ లిమిడెట్‌కు రూ.8.74 కోట్లకు అప్పగించారు. సచివాలయం, శాఖాధిపతులు, ఐటీ టవర్స్ పేరుతో జినిసిస్ ప్లానర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.48.21 కోట్లకు అప్పగించారు. తొలుత ప్రభుత్వ కాంప్లెక్స్ భవనాల పేరుతో ఫోస్టర్ పార్టనర్‌కు రూ.121.76 కోట్లకు అప్పగించగా మళ్లీ విడివిడిగా అవే పనులను పలు కన్సల్టెన్సీలకు అప్పగించడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది.
పర్యవేక్షణకు 135.99 కోట్లు
రాజధానిలో రహదారులు, వాటర్ ట్రీట్‌మెంట్, ఐకానిక్ వంతెన, వరద నియంత్రణ తదితర పది ప్రాజెక్టుల పర్యవేక్షణ పేరుతో కన్సల్టెన్సీలకు గత సర్కారు ఏకంగా రూ.135.99 కోట్ల చెల్లింపులు జరిపింది. ఎలాంటి పురోగతి లేకున్నా కన్సల్టెన్సీలకు భారీగా చెల్లించడం గమనార్హం.
నిపుణుల కమిటీ సభ్యులు
సుబ్బరాయశర్మ... రిటైర్డ్ ఈఎన్‌సీ
అబ్దుల్ బషీర్... రిటైర్డ్ ఈఎన్‌సీ
నారాయణరెడ్డి... రిటైర్డ్ ఈఎన్‌సీ
ఎఫ్‌సీఎస్ పీటర్.. రిటైర్డ్ ఈఎన్‌సీ
ఐఎస్‌ఎన్ రాజు.. రిటైర్డ్ సీఈ సీడీవో
ఆదిశేషు... రిటైర్డ్ డైరెక్టర్, జెన్‌కో
సూర్యప్రకాశ్... కన్సస్టక్షన్ ఇంజనీరు
Comments
Please login to add a commentAdd a comment