
మంత్రిమండలిలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది. ఈ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదన్న నిబంధనలను తోసిరాజంటూ సోమవారం సమావేశమైన మంత్రివర్గం పలు నిర్ణయాలకు ఆమోదముద్ర వేయడం గమనార్హం. ముఖ్యంగా బీసీ కులాలకు చెందిన మూడు కార్పొరేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు, రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం రవాణా సాధికార సంస్థ ఏర్పాటు, 13 మంది హైకోర్టు జడ్జీలకు 600 చదరపు గజాల చొప్పున స్థలాలతో పాటు హైకోర్టు సిబ్బందికి స్థలాలు, అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు చెల్లింపులు, జర్నలిస్టులకు గృహనిర్మాణాలు, సీఆర్డీఏ పరిధిలో 4వ తరగతి ఉద్యోగులకు కూడా స్థలాలను కేటాయిస్తూ నిబంధనల సవరణ, వివిధ నగరాల్లో చేపట్టే గృహ నిర్మాణాలకు స్థలాలు కేటాయిస్తూ అనేక విధానపరమైన నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇవన్నీ గతంలో తీసుకున్న నిర్ణయాలేనని, వీటిని కేవలం మంత్రివర్గంలో రాటిఫికేషన్ మాత్రమే చేశామంటూ మంత్రి కాల్వ వివరణ ఇచ్చారు.
కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు..
- ఏపీ ముదిరాజ్/ముత్రాసి/తెనుగోళ్లు సహకార ఆర్థిక సంస్థలు, ఏపీ నగరాలు/నాగవంశ సహకార ఆర్థిక సంఘం, ఏపీ కల్లు, నీరా గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థలు ఏర్పాటు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటైన 13 బీసీ కార్పొరేషన్లకు మేనే జింగ్ కమిటీలకుమంత్రి మండలి ఆమోదించింది.
- రూ.10 కోట్ల మూలధనంతో ఆటో డ్రైవర్లకు, వాహనాల డ్రైవర్లకు డ్రైవింగ్‌లో అధునాతన శిక్షణకు రవాణా సాధికారిక సంస్థ ఏర్పాటు.
- రూ.పదివేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్ల చెల్లింపునకు రూ.250 కోట్ల కేటాయింపు.
- సింహాచలం భూములకు సంబంధించి అన్ని ఇబ్బందులు పరిష్కరించాలని నిర్ణయం. మంత్రి యనమల నేతృత్వంలో మంత్రుల సంఘం ఈ సమస్యను పరిష్కరించాలి.
- రాజధాని అమరావతిలో హైకోర్టు జడ్జీలు, హైకోర్టు పరిధిలో ఉన్న జిల్లా జడ్జీలు, ఇతర జ్యుడీ షియల్ అధికారులు, హైకోర్టు సిబ్బందికి మార్కె ట్ రేటు ప్రకారం ఇళ్ల స్థలాలు కేటాయించాలని మంత్రిమండలి నిర్ణయం.హైకోర్టు జడ్జీలు ఒకొ క్కరికీ 600 చదరపు గజాలు, రిజిస్ట్రార్ జనరల్, రిజిస్ట్రార్ (ఐటీ, జ్యుడిషియల్)కు 500 చదరపు గజాలు, హైకోర్టు గెజిటెడ్ సిబ్బందికి 200 చద రపు గజాలు, హైకోర్టు నాన్–గెజిటెడ్ సిబ్బందికి 175 చదరపు గజాల కేటాయింపు.
- రాజధానిలో కొన్ని ప్రత్యేక వర్గాలకు అవకాశం కల్పించేందుకు అమరావతి భూ కేటాయింపు నిబంధనలు–2017కు సవరణ.
- నెల్లూరు జిల్లా గృహాల కేటాయింపులో ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేక కేటాయింపు. ఎస్‌ఆర్‌క్యూ కోటాతో సహా కేటాయించిన 18,641 ఇళ్లను సామాజికవర్గాల వారీగా ఇవ్వాలని నిర్ణయం.
- కృష్ణాజిల్లా మైలవరం మండలం పొందుగల గ్రామంలో 78.2ఎకరాల్లో టౌన్‌షిప్ అభివృద్ధికి కేబినెట్ నిర్ణయం.
- పశ్చిమగోదావరి జిల్లా తణుకులో పేదల గృహనిర్మాణానికి 4.3 ఎకరాలు, ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామంలో 4.76 ఎకరాల ప్రభుత్వ భూమి స్థానిక సంస్థలకు బదలాయింపు.
- తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం ధవళేశ్వరంలో 1.65 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు స్థలాన్ని.. రాజమహేంద్రవరం రూరల్ మండలం మోరంపూడి గ్రామంలో 8.97 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్‌కు బదలాయింపు. ఇక్కడ అఫర్డబుల్ హౌసింగ్ స్కీమ్ కింద గృహ నిర్మాణాన్ని చేపడతారు. ఇదే జిల్లా పెద్దాపురం డివిజన్ వాలు తిమ్మాపురం గ్రామంలో 31.42 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టు నిమిత్తం పెద్దాపురం మున్సిపాల్టీకి బదలాయిస్తూ మంత్రిమండలి నిర్ణయం.
- జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రత్యేక కేటగిరిగా తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశం. బలహీన వర్గాల ఇళ్ల నిర్మాణానికి ఇచ్చినట్టే జర్నలిస్టుల ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం, సీఆర్‌డీఏ ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఇళ్లు సొంతంగా నిర్మించుకునే పరిస్థితిలో జర్నలిస్టులు లేనందువల్ల భూమిని ప్రభుత్వమే తీసుకుని వారికి ఇళ్లు కట్టించి ఇవ్వాలని ఆదేశాలు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలతో కలిపి, అవసరాన్ని బట్టి జర్నలిస్టుల వెల్ఫేర్ ఫండ్ నుంచి కూడా ఇళ్ల నిర్మాణానికి నిధులను వినియోగించుకోవాలని సూచన.
రాజధాని భూముల సంతర్పణ సరళతరం
రాజధాని కోసం రైతుల నుంచి సేకరించిన భూమిని కారుచౌకగా తనకు నచ్చిన వారికి నచ్చినట్లు కట్టబెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం దాన్ని మరింత సరళతరం చేసేలా నిబంధనలను సవరించింది. కేబినెట్ సమావేశంలో రాజధాని భూ కేటాయింపు నిబంధనలు–2017లో చేసిన సవరణలకు ఆమోదం తెలిపింది. రాజధాని ప్రాంతంలో ఆర్థిక కార్యకలాపాలు పెంచే పేరుతో, కొన్ని ప్రత్యేక వర్గాలకు సైతం రాజధానిలో అవకాశం కల్పించే ఉద్దేశంతో ఈ సవరణలు చేస్తున్నట్లు పేర్కొన్నా అవన్నీ కార్పొరేట్ కంపెనీలు, రియల్ ఎస్టేట్, వాణిజ్య సంస్థలకు కట్టబెట్టేందుకే ఈ సవరణలు చేసినట్లు స్పష్టమవుతోంది. జడ్జీలు, జ్యుడీషియల్ ఉద్యోగులు, జర్నలిస్టులు మరికొన్ని వర్గాలకు స్థలాలు కేటాయించే ముసుగులో అయిన వారికీ భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు విమర్శలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలు, హెల్త్ సెంటర్లు, మాల్స్ వంటి వాటికి భూములు కట్టబెట్టేందుకు ఈ సవరణలు చేసినట్లు తెలుస్తోంది. తాజా సవరణల ప్రకారం.. కంపెనీలు, సంస్థలు తమకు కేటాయించిన భూములను అభివృద్ధి చేసినా, చేయకపోయినా అమ్ముకునే వీలు కల్పించింది.
Comments
Please login to add a commentAdd a comment