బాలుడిని అపహరించి.. | Kidnappers murder in child hood | Sakshi
Sakshi News home page

బాలుడిని అపహరించి..

Published Mon, Apr 18 2016 11:40 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 PM

బాలుడిని అపహరించి..

బాలుడిని అపహరించి..

బాలుడిని అపహరించి.. ఆపై హతమార్చిన అగంతకులు
కర్చిఫ్‌తో గొంతు బిగించి  కర్కశంగా చంపిన వైనం
కన్నీరు మున్నీరుగా  విలపిస్తున్న తల్లిదండ్రులు 
దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు

కిడ్నాపర్ల కర్కశత్వానికి బాలుడు బలయ్యాడు. అడిగిన సొమ్ము ఇవ్వలేదన్న కక్షతో అతి కిరాతకంగా చంపేశారు.. గొంతుకు కర్చీఫ్ చుట్టి, కాళ్లుచేతులు కట్టేసి.. రాయిని తాడుతో ఒంటికి కట్టి బావిలో పడేశారు. నేడో రేపో తమ బిడ్డ తిరిగొస్తాడని ఎదురుచూస్తున్న తల్లిదండ్రులు బాలుడి మృతివార్తతో గుండెలవిసేలా విలపిస్తున్నారు..

పట్నంబజారు(గుంటూరు) : గుంటూరు ఏటీ అగ్రహారం జోరో లైనుకు చెందిన నన్నం జయకుమారి కుమారుడు యదిద్యరాజు (డుంబు) (12) ఇదే ప్రాంతంలోని సెంట్రల్ పబ్లిక్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 14వ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ఇంటి నుంచి ట్యూషన్‌కు బయలుదేరి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చే సమయం కావస్తున్నా.. రాకపోవడంతో కంగారుపడుతున్న తల్లి జయకుమారికి రాత్రి 10 గంటల సమయంలో ఆగంతకులు ఫోన్ చేశారు. మీ బిడ్డ మా వద్దే ఉన్నాడని, రూ.15 లక్షలు ఇస్తే కానీ వదలమని, విషయాన్ని పోలీసులకు తెలియజేస్తే కడతేరుస్తామని బెదిరింపులకు దిగారు.

మళ్లీ ఆగంతకులు ఫోన్ చేయడంతో తమ వద్ద అంత డబ్బుల్లేవని, రూ.రెండు లక్షలే ఉన్నాయని వారికి తెలిపారు. కిడ్నాప్ జరిగిన మరుసటి రోజు 15వ  తేదీన డుంబు తల్లి జయకుమారి నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఫోన్ కాల్ ఆధారంగా విచారణ ప్రారంభించారు. దానిలో భాగంగానే  పేరేచర్ల, మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో మూడు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా యదిద్యరాజు ఆచూకీ తెలియలేదు.

 రూ.రెండు లక్షలు చెల్లించేందుకు వెళ్లాడుగానీ..

కిడ్నాపర్ల కోరిక మేరకు రూ.రెండు లక్షలు చెల్లించేందుకు శుక్ర, శనివారాల్లో మృతుడి మేనమామ రాజు వెళ్లాడు. మాచర్ల రెలైక్కి, తుమ్మల చెరువు రైల్వేస్టేషన్‌లో ఆగంతకులు చెప్పిన ప్రకారం డబ్బు సంచిని పడేశాడు. మొదటి రోజు  వెళ్లినప్పుడు డబ్బుల సంచి పడేయలేదని, రెండో రోజు శనివారం వారు కుడి పక్కకు చెబితే, పొరపాటున కంగారులో ఎడమ చేతి పక్కకు పడేసినట్లు రాజు చెప్పాడు. దీంతో డబ్బులు ఇవ్వలేదని, పోలీసులను తీసుకువచ్చారని ఆగంతకులు ఇంతటి దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు.

 రెండు రోజుల కిందటే దారుణం..

ఫిరంగిపురం మండలం తాళ్లూరు గ్రామంలో రోడ్డు పక్క ఉన్న పొలంలోని బావిలో యదిద్యరాజును దారుణంగా కాళ్లు, చేతులు కట్టి పడేశారు. శరీరమంతా భారీగా ఉబ్బిపోయి ఉండడంతో రెండు రోజుల కిందటే పడేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అనంతరం అక్కడ నుంచి మృతదేహాన్ని గుంటూరు మార్చురీకి తరలించారు. సంఘటన స్థలాన్ని వెస్ట్ డీఎస్పీ కేజీవీ సరిత, నగరంపాలెం పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో హైమారావు సందర్శించారు. యదిద్యరాజు మృతదేహాన్ని చూసిన తల్లి జయకుమారి కన్నీరుమున్నీరుగా విలపించిన తీరు ప్రతి ఒక్కరిని కంట తడి పెట్టించింది.

తెలిసిన వారి పనేనా..?

 రోడ్డుపై బాలుడిని ఎత్తుకుని వెళితే... కనీసం గొడవ జరగడం, లేదా కేకలు వేయడం వంటి సంఘటనలైనా జరిగి ఉండాలి. ఇటువంటి ఏమీ లేకుండా బాలుడిని తీసుకుని వెళ్లారంటే ఇది కచ్చితంగా ఎవరో తెలిసిన వారి పనే అయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. యదిద్యరాజు కుటుంబంతో అంతటి పగ ఎవరికి ఉందనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దీనికితోడు ఆస్తి తగాదాలు కూడా ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తోందని పోలీసులు అంటున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement