ఢిల్లీకి కిరణ్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడి శనివారం ఢిల్లీ వెళ్లారు. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన పిలుపుతో కారైక్కాల్ పర్యటను అర్ధాంతరంగా రద్దు చేసుకుని మరీ ఢిల్లీకి విమానం ఎక్కేశారు. అక్కడ హోంమంత్రితో భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ బేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాల పేర్కొంటున్నాయి. పుదుచ్చేరిలో సాగుతున్న అధికార ఆధిపత్య సమరం రసవత్తరంగా మారింది.
లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి, సీఎం నారాయణస్వామిల మధ్య సాగుతున్న వార్ రచ్చకెక్కడంతో పంచాయతీ ఢిల్లీకి చేరింది. సీఎం నారాయణస్వామి నేతృత్వంలో అఖిలపక్షం రాష్ట్రపతి, ప్రధాని, హోం మంత్రుల అనుమతి కోసం ఎదురుచూస్తోంది. అపాయింట్‌మెంట్ కోసం ఓ వైపు ఎదురు చూస్తూనే మరోవైపు ఇప్పటికే ఫిర్యాదుల రూపంలో ఢిల్లీకి అన్ని వివరాలను చేర వేశారు. తనకు వ్యతిరేకంగా సాగుతున్న పరిణామాలను నిశితంగా కిరణ్‌బేడి పరిశీలిస్తూ, వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధమేనని స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో ఆగమేఘాలపై కిరణ్ బయలుదేరి వెళ్లారు.
ఢిల్లీకి కిరణ్: పుదుచ్చేరి పరిధిలోని కారైక్కాల్‌లో పలు కార్యక్రమాలు, అభివద్ధి పనుల్లో పాల్గొనేందుకు కిరణ్ బేడి ముందస్తుగా నిర్ణయించారు. మూడు రోజుల పర్యటనగా కార్యచరణ సిద్ధమైంది. శుక్రవారం పర్యటన నిమిత్తం కారైక్కాల్‌కు వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపుతో అన్ని కార్యక్రమాల్ని రద్దు చేసుకుని రాజ్ భవన్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం ఆరున్నర గంటలకు రోడ్డు మార్గంలో చెన్నైకు చేరుకున్నారు.
ఎనిమిదిన్నర గంటలకు మీనంబాక్కం విమానాశ్రయం నుంచి విమానంలో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. పుదుచ్చేరి ప్రభుత్వం సాగిస్తున్న వ్యవహరాలు, అందుకు తాను ఆక్షేపణ తెలియజే యడానికి గల కారణాలు, తదితర అంశాలను నివేదిక రూపంలో ముందస్తుగా ఆమె సిద్ధం చేసుకున్నట్టు సమాచారం. అన్ని వివరాలతో కూడిన నివేదికను ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు నిర్ణయించారు.
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో ఆమె భేటీ కానున్నారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. తనను ఇరకాటంలో పెట్టే విధంగా పుదుచ్చేరి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ పెద్దల దష్టికి తీసుకెళ్లి, తన పంతా న్ని నెగ్గించుకునే పనిలో పడ్డట్టు సమాచారం.