యువతను పల్లెకు మళ్లించాలి: సీఎం కిరణ్
‘స్వాతంత్య్రానికి పూర్వం చదువుకున్నవారు ఉద్యోగాల వైపు కాకుండా వ్యవసాయం వైపే మొగ్గు చూపేవారు. ఒకరి కింద పనిచేయాల్సిన అవసరం లేని స్వతంత్రత, గౌరవం, గిట్టుబాటు వ్యవసాయంలో ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి తలకిందులైంది. పదో తరగతి చదువుకున్నవారు కూడా వేరే వృత్తుల్లో అవకాశాల కోసం పరుగులు తీస్తున్నారు కానీ వ్యవసాయం చేయాలనుకోవడం లేదు. ఈ పరిస్థితి మారాలి. ప్రపంచ వ్యవసాయ సదస్సులోని చర్చలు యువత పల్లెలకు వెళ్లి వ్యవసాయం చేసేందుకు దోహదం చేయాలి’ అని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ వ్యవసాయ సదస్సులో మంగళవారం సీఎం ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో, దేశంలో వ్యవసాయ పురోభివృద్ధికి ‘చిన్న కమతాలు’ పెద్ద సవాలుగా మారాయన్నారు. ఇదే సమయంలో సాగు ఖర్చులు బాగా పెరిగాయని చెప్పారు. ప్రభుత్వాలు కూడా రైతుకు కనీస మద్దతు ధర గురించే అలోచిస్తున్నాయి కానీ గిట్టుబాటు ధర గురించి ఆలోచించే పరిస్థితి లేదన్నారు. రైతు తన సరకును పూర్తిగా మార్కెట్ చేసుకోగల్గుతున్నాడా? గిట్టుబాటు ధర పొందుతున్నాడా? ధాన్యం నిల్వ గోదాముల సమస్య ఎలా ఉంది? ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా రైతు తన ఉత్పత్తులకు అదనపు విలువను జోడించడం ఎలా? అనే సమస్యలపై సదస్సు చర్చలు నిర్వహించి సలహాలు, సూచనలను ఇవ్వాలని కోరారు.
ప్రతినిధులకు విందు
వ్యవసాయ సదస్సులో పాల్గొనడానికి వచ్చిన ప్రతినిధులకు సీఎం మంగళవారం రాత్రి విందును ఏర్పాటు చేశారు. శిల్పారామంలో జరిగిన ఈ కార్యక్రమానికి వేదిక ప్రతినిధులతో పాటు శాసనమండలి చైర్మన్ చక్రపాణి, మంత్రులు కన్నా లక్ష్మీనారాయణ, జానారెడ్డి, టీజీ వెంకటేశ్, కాసు వెంకట కృష్ణారెడ్డి, రాంరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.
భాగస్వామ్యంతోనే అభివృద్ధి:జేమ్స్ బోల్గర్
పెరుగుతున్న జనాభా, ప్రతికూల వాతావరణ మార్పుల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతోనే వ్యవసాయంలో సవాళ్లను అధిగమించగలమని ‘వరల్డ్ అగ్రికల్చర్ ఫోరం’(డబ్ల్యుఏఎఫ్) సలహా సంఘం అధ్యక్షులు, న్యూజీలాండ్ మాజీ ప్రధాని జేమ్స్ బోల్గర్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం ‘ప్రపంచ వ్యవసాయ సదస్సు-2013’ ప్రారంభోపన్యాసం చేశారు. జన్యుమార్పిడి పంటలపై శాస్త్రీయ దృక్పథం అవసరమని, వాటిని గుడ్డిగా వ్యతిరేకించవద్దని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయమంత్రి తారిఖ్ అన్వర్ అన్నారు. కాగా కొత్త టెక్నాలజీని వినియోగించుకోకుండా వ్యవసాయ రంగంలో అభివృద్ధి సాధించలేమని ‘బేయర్’ కంపెనీ సీఈవో లియామ్ కండన్ పేర్కొన్నారు. సదస్సులో ‘ద ఛాలెంజ్ ఆఫ్ ఫీడింగ్ 10 బిలియన్ పీపుల్- వై వియ్ నీడ్ న్యూ రెవల్యూషన్ ఇన్ అగ్రికల్చర్’ అన్న అంశంపై ఆయన మాట్లాడారు. ‘గ్రీనింగ్ అగ్రికల్చర్ టు వర్డ్స్ ఎవర్‌గ్రీన్ ఎకానమీ’ అన్న అంశంపై ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డెరైక్టర్ ఆర్పీసింగ్ మాట్లాడు తూ.. దేశంలో వృద్ధిరేటు పెరుగుదలతోపాటు దారిద్య్రమూ పెరుగుతోందన్నారు. దేశంలో ఒక హెక్టారుకన్నా తక్కువ భూమి ఉన్నవారు 86 మిలియన్ల మంది ఉన్నారన్నారు. వీరి భాగస్వామ్యం తోనే వ్యవసాయంలో నూతన పోకడల అమలు సాధ్యమవుతుందన్నారు. చిన్న, సన్నకారు రైతుల్ని ఆదుకోవడానికి ప్రభుత్వాలు రూపొం దించిన విధానాలు విఫలమయ్యాయని భారత క్రిషక్ సమాజ్ చైర్మన్ అజయ్ జాకర్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితి అంచనా వేసి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
వైఎస్సార్‌సీపీ నేత నాగిరెడ్డిని అడ్డుకున్న పోలీసులు
ప్రపంచ వ్యవసాయ సదస్సులో రైతులకు భాగస్వామ్యం కల్పించనందుకు పాలకుల తీరును ప్రశ్నించిన పాపానికి వైఎస్సార్‌సీపీ వ్యవసాయ విభాగం కన్వీనర్ ఎంవీఎస్ నాగిరెడ్డిని సదస్సులో పాల్గొనేందుకు అనుమతించలేదు. సదస్సు ప్రతినిధిగా సోమవారమే ఆయన తన పేరు నమోదు చేసుకున్నప్పటికీ పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం సదస్సుకు హాజరయ్యేందుకు వెళ్లగా, కిలోమీటరు దూరంలోనే ఆపేశారు. తొలుత కారు పాస్ లేదని అభ్యంతరం చెప్పారు. కారు పాస్ తెప్పించుకున్నాక కూడా అనుమతించలేదు. దీంతో నాగిరెడ్డి సదస్సులో పాల్గొనకుండానే వెనుదిరిగారు. సోమవారం జిల్లాల నుంచి వచ్చిన రైతులకు సభ్యత్వ రుసుం లేకుండా అనుమతించాలని వ్యవసాయ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను నాగిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం నాగిరెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. మంత్రి ఆదేశాల మేరకే తన ను అడ్డుకున్నారని నాగిరెడ్డి ఆరోపించారు.
బహుళజాతి సంస్థల మేలు కోసమే: రైతు సంఘాల విమర్శ
ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న వ్యవసాయ సదస్సు వల్ల బహుళజాతి సంస్థలకే మేలు జరుగుతుందని రైతు సంఘాల ప్రతినిధులు విమర్శించారు. తమ ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకే బహుళజాతి సంస్థలు ఇలాంటి వేదికలను సృష్టించాయన్నారు. కోదండరెడ్డి (కిసాన్ కాంగ్రెస్), పశ్యపద్మ (రైతుసంఘం), ఎన్.వెంకటేశ్వర్లు (తెలుగురైతు), ఎస్.మల్లారెడ్డి (రైతుసంఘం), గొల్లమారి శౌరి (భారతీయ కిసాన్ మోర్చా), విస్సా కిరణ్‌కుమార్ (రైతు స్వరాజ్య వేదిక), రామాంజనేయులు (రైతు స్వరాజ్యవేదిక) తదితరులు ఈ సదస్సుకు వ్యతిరేకంగా రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు.