కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు | kiran kumar reddy chandrababu naidu` match fixing` | Sakshi
Sakshi News home page

కిరణ్, చంద్రబాబు కుమ్మక్కు

Published Thu, Oct 31 2013 2:02 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు కుమ్మక్కై తందానా అంటే తందానా అంటూ

సత్తెనపల్లి, న్యూస్‌లైన్ :ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత ఎన్.చంద్రబాబునాయుడు కుమ్మక్కై తందానా అంటే తందానా అంటూ రాష్ట్ర ప్రజలతో చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర కన్వీనర్ రహమాన్ ధ్వజమెత్తారు. సత్తెనపల్లి ఆటోనగర్‌లో దివంగత మాజీ ఎంపీ లాల్‌జాన్‌బాషా అనుచరుడు సయ్యద్ మీర్ హుస్సేన్ (చినబాబు) పార్టీలో చేరిక సందర్భంగా బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రహమాన్ మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కోసం మైనార్టీలమంతా ప్రాణాలైనా అర్పిస్తామని, నాలుగు శాతం రిజర్వేషన్ సోనియాగాంధీ, చంద్రబాబులు తెచ్చి ఇవ్వలేదని, అది రాజశేఖరరెడ్డి వల్ల మాత్రమే అయ్యిందన్నారు.
 
 ఎన్నికలు ఎప్పుడు జరిగినా జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావడం తథ్యమన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బడుగు, బలహీనవర్గాలు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి అందించిన సువర్ణపాలన కోరుకుంటున్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. సమైక్య శంఖారావం సభతో టీడీపీ శ్రేణులు కుప్పకూలిపోయాయన్నారు. పార్టీ రాష్ట్ర అధికారప్రతినిధి అంబటి రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రం చీలిపోతే దానికి ప్రధాన బాధ్యుడు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డియేనన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి అసమర్థత వల్ల సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే సత్తెనపల్లిలో ఆటోనగర్ ఏర్పాటు చేయిస్తానని అంబటి హామీ ఇచ్చారు. 
 
 గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ షౌకత్ మాట్లాడుతూ వైఎస్ హయాంలో ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారన్నారు. దాని వల్లే ఉన్నత విద్య అభ్యసించే అవకాశం వచ్చిందన్నారు. తొలుత ఆటోనగర్ ప్రెసిడెంట్ సయ్యద్ మీర్ హుస్సేన్ (చినబాబు)ను పార్టీలోకి ఆహ్వానించి రహమాన్, మర్రి, అంబటి, షౌకత్‌లు పార్టీ కండువాలు కప్పారు. ఆయనతోపాటు 200 మంది అనుచరులు వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా రహమాన్, మర్రి, అంబటిలను మైనార్టీ నాయకులు గజమాలతో సత్కరించారు. అంతకుముందు నందిగామ అడ్డరోడ్డు నుంచి సత్తెనపల్లి టౌన్ వరకు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించి పట్టణంలో దివంగత మహానేత వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
 
 సమావేశంలో మైనార్టీ విభాగం జిల్లా కన్వీనర్ సయ్యద్ మహబూబ్, కొత్తా చినపరెడ్డి, మామిడి రాము, పార్టీ నాయకులు కళ్ళం వీరభాస్కరరెడ్డి, ఎస్.ఎం.యూనస్, తుమ్మల వెంకటేశ్వరరావు, మదీనా మస్తాన్‌వలి  మాట్లాడారు.సమావేశానికి వైఎస్సార్ సీపీ పట్టణ కన్వీనర్ గార్లపాటి ప్రభాకర్ అధ్యక్షత వహించారు. పార్టీ మండల కన్వీనర్లు మదమంచి రాంబాబు (సత్తెనపల్లి రూరల్), రెండెద్దుల వెంకటేశ్వరరెడ్డి (ముప్పాళ్ళ), తోట   ప్రభాకర్ (రాజుపాలెం), పట్టణ ఎస్సీ విభాగం కన్వీనర్ చుక్కా మోషె, మండల బీసీ విభాగం కన్వీనర్ చల్లా శ్రీను, హైదరాబాద్ సుభాని, వల్లెం నరసింహారావు, నన్నె, మీరావలి, జానీబాబు, మైనార్టీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి షాన్వాజ్‌ఖాన్, బిలాల్‌కరీం, దుగ్గి భద్రయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement