
రాజీనామాపై కిరణ్ ఇంకా తర్జనభర్జన
* నేడు సీఎం నిర్ణయం
* ఏకాంతంగా టీవీ చూస్తూ రోజంతా ఇంట్లోనే కిరణ్
* సీఎంగా ‘సుప్రీం’ను ఆశ్రయించాలని యోచన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తరువాత కూడా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామాపై తర్జనభర్జన పడుతూనే ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు రాజీనామా చేయవచ్చని సోమవారం నుంచే లీకులు ఇప్పించినా.. మళ్లీ బుధవారానికి వాయిదా వేశారు. బుధవారం ఉదయం సీఎం కిరణ్ రాష్ట్ర గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లే ఖను అందిస్తారని సీఎం సన్నిహిత మంత్రి పితాని సత్యనారాయణ మీడియాకు తెలిపారు. మంగళవారం నాడంతా సీఎం కిరణ్ తన నివాసానికే పరిమితమయ్యారు.
క్యాంపు కార్యాలయానికి ముఖం కూడా చూపించలేదు. తెలంగాణ బిల్లుపై పార్లమెంటులో నెలకొన్న పరిణామాలపై ఆయన రోజంతా టీవీ చూస్తూ గడిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుపై చర్చ, బిల్లు ఆమోదం పొందిన తీరుపై వచ్చిన కథనాలను వీక్షించారు. మంత్రులు పితాని సత్యనారాయణ, పార్థసారథి, విప్‌లు జగ్గారెడ్డి, రెడ్డపరెడ్డి, మరో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం కిరణ్‌ను కలవటానికి వచ్చారు. క్యాంపు కార్యాలయానికి సీఎం వస్తారేమోనని వారు చాలాసేపు నిరీక్షించినా ఆయన రాకపోవటంతో చివరకు వారే వెనుకనున్న కిరణ్ నివాసానికి వెళ్లారు. సీఎం కిందకు వచ్చి పది నిమిషాల పాటు వారితో మాట్లాడారు. పార్లమెంటులో బిల్లుపై చర్చ, తదనంతర పరిణామాలు, తన రాజీనామా గురించి కిరణ్ వారితో చర్చించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బిల్లు ఆగుతుందేమోనని ఎదురుచూశామని, ఇప్పుడు ఆమోదం పొందింది కనుక రాజీనామా చేయటమే మంచిదన్న అభిప్రాయం కొందరు వ్యక్తంచేసినట్లు తెలిసింది.
సీఎంగా ఉండి న్యాయపోరాటం చేస్తా..!
అయితే.. ఈ సందర్భంగా న్యాయపరమైన అంశాలను సీఎం ప్రస్తావనకు తీసుకువచ్చారు. బిల్లు తప్పుల తడకగా ఉందని, అసెంబ్లీ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో పెట్టటమే రాజ్యాంగ విరుద్ధం కనుక దానిపై న్యాయపోరాటం చేయాల్సిన అవసరముందని చెప్పారు. హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఇప్పటివరకు రాష్ట్ర విభజనపై వేసిన కేసులను అపరిపక్వమని కొట్టివేశాయని.. పార్లమెంటులో బిల్లు పాసయ్యాక కోర్టులు దాన్ని విచారించే అవకాశమున్నందున ఇప్పుడు న్యాయపోరాటం చేయడానికి సరైన సమయమని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంటు ఆమోదించటంపై సీఎంగా తానే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే ఎలా ఉంటుందంటూ మంతనాలు జరిపారు. సీఎంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాలంటే రాజీనామా చేయకుండా పదవిలో కొనసాగితేనే అది సాధ్యమన్న అభిప్రాయానికి కిరణ్ వచ్చారు. రాజీనామా చేస్తే విభజన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎదుర్కొనేందుకు ఆస్కారం ఉండకపోవచ్చన్న భావనకు వచ్చారు. ఒకవేళ న్యాయపరమైన పోరాటానికి సీఎంగా ఆస్కారం ఉండదనుకుంటే ఇపుడే రాజీనామా చేయటం మంచిదని కొందరు మంత్రులు సీఎంకు సూచించారు.
కేసు వేస్తే.. అది తేలాకే రాజీనామా!
కానీ.. తనతో పాటు మూకుమ్మడిగా రాజీనామా చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ కనిపించకపోవటంతో సీఎం కిరణ్ రాజీనామాను బుధవారానికి వాయిదా వేశారు. మంత్రులు ఎమ్మెల్యేలతో మాట్లాడి బుధవారం నాటికి సాధ్యమైనంత ఎక్కువమందిని తనతోపాటు రాజీనామాకు వచ్చేలా చూడాలని తనను కలసిన మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. బుధవారం మీడియా సమావేశం, ఆ తరువాత 11.50 నిమిషాలకు గవర్నర్‌ను కలసి రాజీనామా లేఖను అందించాలని నిర్ణయించారు. అనంతరం పితాని సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ బుధవారం సీఎం తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందిస్తారని వివరించారు. ఇదిలావుంటే.. రాష్ట్ర విభజనపై సీఎం న్యాయపోరాటం చేయాలని నిర్ణయిస్తే కనుక బుధవారం రాజీనామా ఉండకపోవచ్చని, సుప్రీంకోర్టులో కేసు తేలాకనే ఆయన పద వి నుంచి వైదొలగవచ్చని కిరణ్ సన్నిహితవర్గాలు వివరించాయి.
నేటితో సీఎం పేషీ ఖాళీ!
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పేషీ బుధవారంతో ఖాళీ కానుంది. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడంతో బుధవారం ఉదయం ఆయన తన పదవికి రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు సీఎం ముఖ్య కార్యదర్శిగా ఉన్న అజయ్ కల్లంను ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగాను, సీఎం కార్యదర్శిగా ఉన్న శంషేర్‌సింగ్ రావత్‌ను జెన్‌కో ఎండీగాను బదిలీ చేస్తూ ప్రభుత్వప్రధాన కార్యదర్శి మహంతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోపక్క, మంగళవారం కూడా సీఎం పలు ఫైళ్లపై సంతకాలు చేశారు.
‘4వ ఎమ్మెల్సీ’పై గవర్నర్‌కు వివరణ
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ నియామకాలకు సంబంధించి ముఖ్యమంత్రి కిరణ్ మంగళవారం గవర్నర్‌కు వివరణ పంపిస్తూ నాలుగో అభ్యర్థి నియామకం పూర్తి చేయాలని కోరారు. ఎమ్మెల్సీలుగా కంతేటి సత్యనారాయణరాజు, నంది ఎల్లయ్య, రత్నాబాయి, రఘురామిరెడ్డిలను నియమించాలని విన్నవించారు. అయితే తొలి మూడు పేర్లను మాత్రమే గవర్నర్ ఆమోదించగా, కిరణ్‌కు సన్నిహితుడైన రఘురామిరెడ్డి నియామకాన్ని గవర్నర్ తిరస్కరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నాలుగో అభ్యర్థి పేరునూ ఖరారు చేయాలని సీఎం కోరారు.