సమైక్య ముసుగులో విభజన వీరుడిని తానేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు.
* రాష్ట్రపతికి సమైక్య వినతిపత్రం ఇవ్వకుండా లాక్కున్న వైనం
సాక్షి, అనంతపురం: సమైక్య ముసుగులో విభజన వీరుడిని తానేనని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మరోసారి చాటుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి వినతిపత్రం సమర్పించేందుకు యత్నించిన ప్రాథమిక విద్యాశాఖ మంత్రి సాకే శైలజానాథ్‌ను అడ్డుకున్నారు. సాక్షాత్తూ ప్రణబ్ ముఖర్జీ, వందలాదిమంది అధికారులు, వేలాదిమంది విద్యార్థులు చూస్తుండగా వినతిపత్రాన్ని లాక్కున్నారు.
ఈ సంఘటనకు నీలం సంజీవరెడ్డి శత జయంతి ముగింపు వేడుకలు వేదికయ్యాయి. వివరాల్లోకి వెళితే.. మాజీ రాష్ట్రపతి నీలం శత జయంతి ముగింపు వేడుకలు సోమవారం అనంతపురంలో నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొన్నారు. మంత్రి శైలజానాథ్ ప్రారంభోపన్యాసం చేశారు. రాష్ట్రాన్ని క్లిష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించాలని.. సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తున్నానని సభాముఖంగా ప్రకటించారు.
రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లారు. కానీ రాష్ట్రపతి పక్కనే కూర్చున్న కిరణ్.. శైలజానాథ్ చేతుల్లో ఉన్న వినతిపత్రాన్ని విసురుగా లాక్కున్నారు. ఇప్పుడు వినతిపత్రం ఇవ్వొద్దంటూ మంత్రిపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. కిరణ్ ఒత్తిడి మేరకు శైలజానాథ్ వెనక్కి తగ్గి, తన స్థానంలో కూర్చుండిపోయారు.
ఆ తర్వాత ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ముగింపు ఉపన్యాసం చేస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ ప్రణబ్‌ను డిమాండ్ చేశారు. తెలుగుజాతి ఐక్యతను కాపాడాల్సిన ధర్మం రాష్ట్రపతిపై ఉందన్నారు. ప్రణబ్ వేదిక దిగుతున్న సమయంలో మంత్రిని వెంట తీసుకుని వెళ్లారు. వినతిపత్రాన్ని రాష్ట్రపతికి సమర్పించారు. ఆ సమయంలో సీఎం కిరణ్ అక్కడే ఉన్నా మిన్నకుండిపోవడం గమనార్హం.
సమైక్యవాదులను నిర్బంధించిన పోలీసులు
రాష్ట్రపతి పర్యటనను సమైక్యవాదులు అడ్డుకుంటారనే భావనతో వైఎస్సార్‌సీపీ, విద్యార్థి, ప్రజాసంఘాల నేతలను సోమవారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.