నువ్వా.. నేనా..
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లా కాంగ్రెస్‌లో సరి కొత్త వర్గపోరుకు తెరలేచింది. జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష పదవి వేదికగా రెవెన్యూ మంత్రి ఎన్. రఘువీరారెడ్డి, ప్రాథమిక విద్యా శాఖ మంత్రి సాకే శైలజానాథ్ అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. పదవీ కాలం ముగియకున్నా రషీద్ అహ్మద్‌ను ఆ పదవి నుంచి తొలగించడంపైనా.. తన వర్గీయుడైన బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి పదవి కట్టబెట్టడంలో శైలజానాథ్ వ్యవహరించిన తీరుపై మంత్రి రఘువీరా, అనంత వెంకట్రామిరెడ్డి మండిపడుతున్నారు. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ రఘువీరా వర్గం కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి మధ్య విభేదాలు పొడచూపాయి. ఇద్దరూ ఎడమొహం పెడమొహం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లాలో రఘువీరా వర్గానికి చెక్ పెట్టడం కోసం సీఎం కిరణ్ ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజానాథ్‌ను దగ్గరకు తీశారు. శైలజానాథ్ మాటకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 2011 జనవరి 18న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమితులైన రషీద్ అహ్మద్ ఆ పదవిలో రెండేళ్లపాటు కొనసాగేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2013 జనవరి 18 నాటికి రషీద్ అహ్మద్ పదవీకాలం ముగిసింది. అప్పట్లో తన పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించాలన్న రషీద్ అహ్మద్ అభ్యర్థనను ప్రభుత్వం మన్నించింది.
రషీద్ అహ్మద్ పదవీకాలం 2014 జనవరి 18తో ముగియనుంది. కానీ.. మంత్రి శైలజానాథ్ ఇవేవీ పట్టించుకోలేదు. తన శాఖ పరిధిలోని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని అనుచరుడైన కాంట్రాక్టర్ బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి కట్టబెట్టాలని సీఎం కిరణ్‌పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం.. బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డిని గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమిస్తూ డిసెంబర్ 20న ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై మంత్రి రఘువీరా, ఎంపీ అనంత.. సీఎం కిరణ్ వద్ద తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రషీద్ అహ్మద్ పదవీకాలం ముగియకున్నా ఎందుకు తొలగించారంటూ సీఎంను నిలదీశారు. ఇది పసిగట్టిన మంత్రి శైలజానాథ్ డిసెంబర్ 21నే తన నివాసంలోనే బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డితో రహస్యంగా ప్రమాణ స్వీకారం చేయించేశారు. ఈ వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. సీఎం తమ మాటలు లెక్క చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాలని రషీద్ అహ్మద్‌కు రఘువీరా, అనంత సూచించారు.
జిల్లాలో కొత్తచెరువు వద్ద నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో చోటుచేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 26 మంది సజీవ దహనమైన రోజే.. అనంతపురంలో ఘనంగా బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ప్రమాణ స్వీకారోత్సవ సభ నిర్వహించారు. రఘువీరా సూచన మేరకు రషీద్ అహ్మద్ హైకోర్టును ఆశ్రయించారు. పదవీ కాలం ముగిసే వరకూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో రషీద్ అహ్మద్ కొనసాగేలా చూడాలని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం బాధ్యతలు స్వీకరిస్తానని రషీద్ అహ్మద్ ‘సాక్షి’కి తెలిపారు.
బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిని కట్టబెట్టడంలో క్విడ్‌ప్రోకో జరిగిందని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. అనంతపురం మున్సిపాల్టీ పరిధిలో వివాదంలో ఉన్న సర్వే నెంబరు 342లోని 25.50 సెంట్ల భూమిని మంత్రి శైలజానాథ్‌కు బొమ్మలాటపల్లి నర్సింహారెడ్డి ముట్టజెప్పిన తర్వాతనే.. ఆయనను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా నియమించారని రఘువీరా వర్గం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో క్విడ్‌ప్రోకో జరిగిందంటూ కాంగ్రెస్ అధిష్టానానికి రఘువీరా వర్గం ఫిర్యాదు చేయడం కొసమెరుపు.