
ఫైళ్ల క్లియరెన్స్‌లో సీఎం బిజీ బిజీ
సాక్షి, హైదరాబాద్: దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే నానుడికి అనుగుణంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ శుక్రవారం సాయంత్రం ఆమోద ముద్ర వేస్తుందని తెలియడంతో సీఎం ఉదయం నుంచే ఫైళ్ల క్లియరెన్స్‌లో బిజీ అయిపోయారు. సీఎం కార్యాలయ అధికారులతో పాటు కొన్ని ప్రధాన శాఖల ఉన్నతాధికారులను క్యాంపు కార్యాలయానికి పిలిపించి పెండింగ్‌లో ఉన్న పలు ముఖ్యమైన ఫైళ్లను వెంటనే ఆమోదానికి పంపాల్సిందిగా కిరణ్ ఆదేశించారు. దీంతో ఉదయం నుంచే ఆయన ఫైళ్ల క్లియరెన్స్‌లో పడ్డారు. భూముల కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లపై ఎడాపెడా సంతకాలను కానిచ్చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు ఇతర జిల్లాల్లో మిగులు భూములు, జాగీర్‌దార్ భూముల కేటాయింపునకు చెందిన పలు ఫైళ్లకు సీఎం ఆమోదం తెలిపారు. అలాగే పలు శాఖల్లో పోస్టింగ్‌లు, బదిలీలు కోరుకుంటున్న వారి ఫైళ్లను క్లియర్ చేశారు. తనకు కావాల్సిన వారికి సంబంధించి అన్ని రకాల ఫైళ్లను క్లియర్ చేయడంపైన ఆయన దృష్టి సారించారు.
రెవెన్యూ శాఖకైతే వెంటనే సంబంధిత ఫైళ్లను సర్క్యులేట్ చేయాలంటూ ఆదేశాలు జారీ అవుతున్నాయి. అలాగే పట్టణాభివృద్ధికి చెందిన ఫైళ్లతో పాటు తనకు సంబంధించిన ఎమ్మెల్యేలకు విచక్షణాధికారంతో మంజూరు చేసే ప్రత్యేక అభివృద్ధి నిధి నుంచి ఆయా పనులకు నిధులు ఇవ్వడం పైనా కిరణ్ దృష్టి సారించారు. సీఎం నెల రోజుల నుంచి సచివాలయానికి రావడం లేదు. దీంతో సచివాలయానికి సందర్శకుల తాకిడి కూడా గురువారం వరకు అంతంత మాత్రంగానే ఉంది. అయితే శుక్రవారం మాత్రం సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంది. ఇక ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయని, వీలైనంత త్వరగా పనులు చేయించేసుకోవాలనే ఆత్రుతతో సందర్శకులు, పైరవీకారులు సచివాలయంలో హడావుడి చేశారు. సీఎం కార్యాలయం చేస్తున్న హడావుడితో అధికార యంత్రాంగం కూడా ప్రభుత్వానికి ఇక రోజులు దగ్గర పడ్డాయనే భావనకు వచ్చింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమకు చెందిన ఫైళ్లను క్లియర్ చేయించుకోవడానికి క్యూకట్టారు.