సాక్షి, హైదరాబాద్: లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ముందే తెలంగాణ బిల్లుపై చర్చ చేపట్టి ఆమోదించేందుకు కాంగ్రెస్, కేంద్వ్రం ముందుకు రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆ పని సోమవారమే చేయాలన్నారు. అవసరమైతే బడ్జెట్‌ను 19, 20, 21 తేదీల్లో పెట్టుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి భరత్‌సింహారెడ్డి భారీసంఖ్యలో అనుచరులతో కలిసి శనివారం కిషన్‌రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. తెలంగాణపై మాట తప్పని పార్టీ బీజేపీ మాత్రమేనని ఈ సందర్భంగా కిషన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వమే పార్లమెంట్‌లో బిల్లు పెడుతుంది, ఆ పార్టీ మంత్రులే దాన్ని అడ్డుకుంటారు, తిరిగి బీజేపీపై విమర్శలు చేస్తారంటూ దుయ్యబట్టారు.
‘బిల్లుకు బీజేపీ ఎందుకు మద్దతిస్తున్నదీ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలేమిటీ తదితరాలను చర్చ సందర్భంగా లోక్‌సభలో విపక్ష నేత సుష్మాసర్వాజ్ సభకు వివరిస్తారు. ఈ రోజు నాకు ఫోన్లో ఈ మేరకు ఆమె వెల్లడించారు’ అని తెలిపారు. సీమాంధ్ర ఎంపీలు గురువారం లోక్‌సభలో చేసిన నిర్వాకం చాలక ఇప్పుడు రైళ్లలో జనాలను ఢిల్లీ తీసుకెళ్లజూస్తున్నారని విమర్శించారు. కాగా.. లోక్‌సభ సమావేశాల సోమవారం ఎజెండాలో తెలంగాణ బిల్లుపై చర్చకు సంబంధించిన అంశం లేకపోవడంపై కాంగ్రెస్ పార్టీపై అనుమానాలు కలుగుతున్నాయని బీజేపీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, సీహెచ్ విద్యాసాగరరావు అన్నారు. సీమాంధ్ర నుంచి వేలాది మంది ఢిల్లీ వెళుతున్నారని.. వారు అక్కడ గొడవ చేస్తే దానిని సాకుగా తీసుకొని సభను ముగించే అవకాశముందని పేర్కొన్నారు.