
కొత్తపార్టీ కోసమే కిరణ్నాటకం
రాష్ట్రంలో కిరణ్నాటకం అద్భుతంగా రక్తి కట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నా రు. దీనికి సోనియాగాంధీ నిర్మాతగా, దిగ్విజయ్ దర్శకత్వంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధానపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి విమర్శ
కామారెడ్డి, న్యూస్‌లైన్: రాష్ట్రం లో కిరణ్నాటకం అద్భుతంగా రక్తి కట్టిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి అన్నా రు. దీనికి సోనియాగాంధీ నిర్మాతగా, దిగ్విజయ్ దర్శకత్వంలో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రధానపాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. శనివారం నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీమాంధ్రలో కొత్త పార్టీని పెట్టించి సీట్లు గెలుచుకునేందుకే కాంగ్రెస్ అధిష్టానం ఆడిస్తున్న నాటకమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ మునిగిపోతున్న పడవ అని, దాన్ని కాపాడుకునేందుకు ఈ నాటకాలకు తెరలేపిందని చెప్పారు.
నాలుగున్నర దశాబ్దాల తెలంగాణ ప్రజల పోరాటం, 1200 మంది బలిదానాల ఫలితంగా వచ్చిన తెలంగాణను అడ్డుకునేందుకు కుట్రలు జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లు తీర్మానం పెట్టి ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అలాగే సీమాంధ్ర ప్రజల సమస్యలకు కూడా పరిష్కారం చూపుతామన్నారు. తెలంగాణాలోనూ బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్య వస్తుందంటున్న సీఎం ఇప్పుడు 24 గంటల కరెంటు ఇస్తున్నారా అని ప్రశ్నించారు.