మాజీ ఎంపీ, హర్షకుమార్ మెడ భాగంలో అయిన గాయం
సాక్షి, అమరావతి, రాజమహేంద్రవరం, ఏలూరు : మనిషి మెడలో కెరోటిడ్ అర్టిరీ (ధమని) అనే మెదడుకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళం ఉంటుంది. దీన్ని కట్ చేస్తే ఎవరికైనా సరే నిమిషాల్లో ప్రాణం పోతుంది. ఒకసారి ఈ నరం కట్ అయితే దీన్ని అతికించడం అసాధ్యమే. ఎందుకంటే రెండు నుంచి నాలుగు నిమిషాల్లో ప్రాణం పోతుందని న్యూరో సర్జన్లు చెబుతున్నారు. ఇదే రీతిలో పదునైన చిన్నపాటి కత్తితో ఈ నరాన్ని కట్ చేయడం ద్వారా వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహనరెడ్డిని హత్య చేయాలని ప్రయత్నించడం.. అది గురితప్పి భుజానికి గాయం కావడం తెలిసిందే. విశాఖపట్నం ఎయిర్‌పోర్టులో గురువారం జనుపల్లి శ్రీనివాసరావు చేసిన హత్యాయత్నంలో కత్తి పోటు జగన్‌మోహనరెడ్డి మెడపై పడి ఉంటే చాలా ప్రమాదకరంగా పరిణమించేదని డాక్టర్లు చెబుతున్నారు.
ఒక ప్రణాళికా బద్దంగా ప్రతిపక్ష నేతను అడ్డు తప్పించే కుట్రతోనే ఈ హత్యాయత్నం జరిగినట్లు స్పష్టంగా కనపడుతోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రతి మనిషికి కుడివైపు ఒకటి, ఎడమవైపు ఒకటి ఈ కెరోటిడ్ అర్టరీ రక్తనాళాలు ఉంటాయి. ఈ రక్తనాళం రెండు బ్రాంచులుగా ఉంటుంది. ఒకటి శుద్ధి చేసిన రక్తాన్ని గుండె నుంచి మెదడుకు తీసుకువెళ్తుంది. మరోటి మెడ, ముఖానికి రక్తం సరఫరా చేస్తుంది. ఈ కెరోటిడ్ ఆర్టరీ పల్స్‌ను మనం మెడపై రెండువేళ్లు పెట్టి నొక్కిపట్టుకుంటే స్పష్టంగా తెలుస్తుంది. ఇది నేరుగా మెదడుకు రక్తాన్ని సరఫరా చేస్తుంది కాబట్టి దీనికి చిన్న గాయం అయినా భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఈ రక్త నాళం తెగితే 15 నుంచి 20 సెకన్లలోనే అపస్మారక స్థితికి చేరుకుంటారని, రెండు నుంచి 4నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. ఈ రక్తనాళం తెగినప్పుడు రక్తం పైపు నుంచి వెదజల్లినట్లు వస్తుందని, తెగిన నరం ముడుచుకు పోవడంతో దీన్ని గుర్తించి అతికించే ప్రయత్నం జరిగేలోగా ప్రాణం పోతుందని చెబుతున్నారు.
కెరోటిడ్ ఆర్టిరీ తెగితే జరిగేదిదీ..
- ఈ రక్తనాళం తెగిపోవడం వల్ల మెదడు నుంచి సంకేతాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది.
- బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ.
- హార్ట్ రేటు పడిపోయి స్ట్రోక్ వచ్చే అవకాశం.
- పల్మనరీ ఎంబాలిజం అంటే శ్వాసకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం.
- ఇది ప్రధాన రక్తనాళం కాబట్టి కొద్ది లోతు తెగినా ఎక్కువగా రక్తస్రావం జరుగుతుంది.
- దీనివల్ల మనిషి వెంటనే నీరసపడిపోతాడు.
- మిగతా రక్తనాళాలపై కూడా ప్రభావం ఉంటుంది. తద్వారా ఇతర అవయవాల పనితీరు శ్రుతి తప్పుతుంది.
- చికిత్సకు చాలా సమయం తక్కువ.
ఈ నరం తెగిన వారు సురక్షితంగా బయట పడటం చాలా అరుదు.
చచ్చి బతికాను..
శరీరంలో మెడ భాగంలోని నరాలు మహాసున్నితం. అక్కడ కత్తితో కోయడం వల్ల తీవ్ర రక్తస్రావం తప్పదు. అక్కడ ఉండే రక్తనాళాలు తెగాయంటే (కెరోటిడ్ ఆర్టిరీ, జుగ్లర్ వెయిన్) నిమిషాల వ్యవధిలో మనిషి కుప్పకూలిపోతాడు. ప్రత్యర్థులను కచ్చితంగా మట్టుబెట్టాలనే లక్ష్యంతోనే ఈ తరహా దాడులు చేస్తారు. సరిగ్గా ఇదే తరహాలో 1996లో నాపై హత్యాయత్నం జరిగింది. ఆ దాడిలో హంతకులు చిన్నపాటి పదునైన కత్తితో నా మెడ భాగంలో కోయబోయారు. అయితే ప్రమాదాన్ని పసిగట్టి పక్కకు తిరగడంతో కత్తి గురి తప్పి, మెడ భాగం నుంచి దవడ కింది భాగం వరకూ కత్తిగాటు అయింది. 3 రోజులపాటు కోమాలో ఉన్నాను. పాదరసం పూసిన కత్తితో హంతకులు నన్ను 28 పోట్లు పొడిచారు. వాటి ఫలితంగా ఇన్ఫెక్షన్ సోకి నాలుగు పక్కటెముకలు తొలగించాల్సి వచ్చింది. 1996 నుంచి 2008 వరకు 16 ఆపరేషన్లు చేశారు. పాదరసం పూసిన కత్తిగాట్లు కావడంతో ఇప్పటికీ నేను అప్పుడప్పుడు అనారోగ్యానికి గురవుతున్నాను. నాపై హత్యాయత్నం చేసినవాడి లక్ష్యం మెడ భాగంలోని కెరోటిడ్ రక్తనాళాన్ని కట్ చేయడమే. అది మిస్ కావడంతో తీవ్ర గాయాలతో చచ్చి బతికాను.
– జీవీ హర్షకుమార్, మాజీ ఎంపీ
జగన్ పసిగట్టకపోయి ఉంటే..
విశాఖ విమానాశ్రయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై గురువారం హత్యాయత్నానికి పాల్పడ్డ జనిపెల్ల శ్రీనివాసరావు అసలు లక్ష్యం ప్రాణాలు తీయడమేనన్న వాదనలు బలపడుతున్నాయి. కోడిపందేల కత్తితో అతడు దాడి చేసే సమయంలో జగన్ పసిగట్టి పక్కకు వాలడంతో మెడకు నాలుగు అంగుళాలు కింద భుజంపై ఆ గాటు పడింది. దీంతో జననేతకు ప్రాణాపాయం తప్పింది. అదే జగన్ పక్కకు వాలకపోయి ఉంటే ఏం జరిగిఉండేదో ఊహించడానికే భయం వేస్తోందని పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇంతటి ప్రమాదకరమైన కుట్రతో వైఎస్ జగన్‌పై హత్యాయత్నం జరిగితే ముఖ్యమంత్రి, టీడీపీ నేతలు తేలిగ్గా తీసిపారేస్తుండటం పట్ల జనం విస్తుపోతున్నారు.
వెటకారం కాదు.. ఇదీ వాస్తవం
ఎల్లో మీడియా వెటకారం చేస్తున్నట్లు కోడి పందేలకు వాడే కత్తి మొండి కత్తి కాదు. దీన్ని విమానాలకు ఉపయోగించే రేకుతో తయారు చేస్తారని కోడి పందేల నిర్వాహకులు చెబుతున్నారు. నూజివీడు పరిసర ప్రాంతాల్లో కొంత మంది ఈ రేకును తీసుకువచ్చి ఇనుప పిడితో వెల్డింగ్ చేసి తయారు చేస్తారు. పందేలలో కొందరు ఈ కత్తికి ఉమ్మెత్త పువ్వు రసాన్ని కత్తికి పూస్తారు. ఈ కత్తి కట్టిన కోడి కాలు పైకి ఎత్తినప్పుడు ఎదుటి కోడికి మత్తు వచ్చి ఓడిపోతుంది. మరికొన్ని సందర్భాలలో కత్తికి పాదరసం పూసినపుడు కోడి చనిపోవడంతో పాటు ఆ గాయం ఉన్నచోట పచ్చగా మారిపోతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కత్తికి విషం ఉండవచ్చన్న అనుమానంతో వైఎస్ జగన్‌కు గాయం అయిన చోట కొంత భాగాన్ని తీసి పరీక్షకు పంపించినట్లు వైద్యులు చెబుతున్నారు.
బతికే అవకాశం చాలా తక్కువ
ఇలాంటి పదునైన ఆయుధాలతో మెడపై గాయం చేస్తే బాధితుడికి తీవ్రంగా నష్టం జరుగుతుంది. ఇది చాలా సున్నితమైన రక్తనాళం. అందులో మనిషిలోని ప్రధాన అవయవాలకు రక్తం అందించే నాళం కాబట్టి దీనిపై ఎలాంటి గాయమైనా మెదడు, గుండెపై క్షణాల్లో ప్రభావం పడుతుంది. తక్షణ చికిత్స కోసం కూడా అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ప్రాణాపాయం ఉండే అవకాశం ఎక్కువ.
–డా.నాంచారయ్య, ప్రొఫెసర్ (జనరల్ సర్జరీ), సిద్ధార్థ ప్రభుత్వ వైద్య కళాశాల, విజయవాడ
Comments
Please login to add a commentAdd a comment