సాక్షి, అమరావతి/కాకినాడ: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోనే పథక రచన సాగించినట్లు తెలుస్తోంది. కోడిపందేలు, గుండాటల్లో ఆరితేరడం, దూకుడు స్వభావం, ఒకటి, రెండు కొట్లాటల్లో మారణాయుధాలతో దాడులకు తెగబడిన నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నానికి ఎంపిక చేసుకున్నారు. రెండేళ్ల క్రితం స్వగ్రామం ఠానేలంకలో వివాహేతర సంబంధం విషయంలో ఘర్షణ, 2017లో బంధువుల వివాహంలో కొట్లాట, సరిహద్దు తగాదాలో ఒక ఉపాధ్యాయుడిపై కత్తితో దాడిచేసే ప్రయత్నంలో శ్రీనివాసరావు భయపడి ఊరి విడిచివెళ్లిపోవడం తదితర అంశాలపై ముమ్మిడివరం పోలీసు స్టేషన్‌లో కేసులున్నాయి.
ఇటువంటి నేరచరిత్ర కలిగిన శ్రీనివాసరావును అధికార టీడీపీ నాయకుడు హర్షవర్దన్ చౌదరికి చెందిన ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో చెఫ్‌కు సహాయకుడిగా ఎనిమిది నెలల క్రితమే ముమ్మిడివరం టీడీపీ నేతల సిఫార్సుతోనే నియమించినట్లు సమాచారం. శ్రీనివాసరావు విశాఖ ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో చేరేందుకు ఠానేలంక జన్మభూమి కమిటీ సభ్యుల సిఫార్సుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబుకు వరుసకు సోదరుడైన పృథ్వీరాజ్(చినబాబు) సహకరించాడని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. చినబాబు ద్వారా విశాఖ టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులకు పరిచయం కావడం, రామకృష్ణ, హర్షవర్దన్ చౌదరి మ«ధ్య ఉన్న సాన్నిహిత్యంతో శ్రీనివాసరావును క్యాంటీన్‌లో చేర్చుకున్నారని చెబుతున్నారు. అప్పటికే శ్రీనివాసరావుపై పలు కేసులున్నప్పటికీ తూర్పుగోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం అతడికి క్లీన్‌చిట్ (ఎన్‌ఓసీ) ఇవ్వడంలో టీడీపీ నాయకుల పాత్ర ఉందంటున్నారు.
అప్పుడే చంపేద్దామనుకున్నారు!
టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో సంక్రాంతి సంబరాలు పేరుతో ముమ్మిడివరం ఎమ్మెల్యే బుచ్చిబాబు రాష్ట్రస్థాయిలో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పందేల్లో కోళ్లకు కత్తులు కట్టడంలో నిష్ణాతుడైన శ్రీనివాసరావుకు ఎమ్మెల్యే ముఖ్యులతో ఏర్పడ్డ పరిచయాలు అటు విశాఖలోని టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ అనుచరులతో కలిసేందుకు దోహదపడ్డాయి. టీడీపీ సానుభూతిపరుడైన శ్రీనివాసరావు నేరప్రవత్తిని చూసే ఆ పార్టీ పెద్దలు జగన్ హత్య కుట్రను నడిపించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ముమ్మిడివరం నియోజకవర్గంలో జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్పయాత్ర జరిగినప్పుడు (జూలై 30– ఆగస్టు 2) హత్యకు ప్లాన్ చేశారంటున్నారు. ఇందులో భాగంగానే శ్రీనివాసరావు ముమ్మిడివరంలో రెక్కీ నిర్వహించాడని, కానీ అంత జనసమూహంలో, సెక్యూరిటీ మధ్య హత్య చేయడం సాధ్యం కాదని, అందుకే విశాఖ ఎయిర్‌పోర్టును ఎంపిక చేసుకున్నట్టు కనిపిస్తోంది.
ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని హకుం
ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాయత్నం కుట్రలో తమ బండారం బయటపడుతుందనే ఆందోళనతో టీడీపీ నేతలు ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వవద్దని ముమ్మిడివరంలోని ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ఠానేలంక వాసులకు హుకుం జారీ చేశారు. అందుకే జగన్‌పై హత్యాయత్నం జరిగిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యే బుచ్చిబాబు ఎల్లో మీడియాను వెంటబెట్టుకుని అనుచరులతో కలిసి ఠానేలంక వెళ్లి శ్రీనివాసరావు కుటుంబ సభ్యులను కలవడం, కొద్దిసేపటికే శ్రీనివాసరావు సోదరుడు సుబ్బరాజు తాము వైఎస్సార్‌సీపీ అభిమానులమని మీడియా ఎదుట చెప్పడం, ఆ తరువాత నుంచి శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీ అభిమాని అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి మంత్రుల వరకు అంతా పథకం ప్రకారం తప్పుడు ప్రచారం చేయడం తెలిసిందే.
గప్‌చుప్‌గా టీడీపీ నేతలు
జగన్‌పై హత్యాయత్నం జరిగిన రోజున నిందితుడు శ్రీనివాసరావు ఇంటి వద్ద పెద్ద ఎత్తున హడావుడి చేసిన టీడీపీ నేతలు ప్రస్తుతం గప్‌చుప్‌గా మారిపోయారు. ఘటన అనంతరం జరుగుతున్న పరిణామాలు, టీడీపీ నేతల లింకులు వెలుగుచూడటంతో ఆ ఇంటివైపే రావడం లేదు. ఇప్పుడు తమకేమీ తెలియదన్నట్టుగా, నిందితుడి కుటుంబంతో సంబంధం లేదన్నట్టుగా దూరంగా ఉంటున్నారు.
రూ.కోటితో 4 ఎకరాలు కొనేందుకు బేరం
ఎయిర్‌పోర్టు క్యాంటీన్‌లో చేరిన దగ్గర నుంచి కుట్రకు సూత్రదారులు శ్రీనివాసరావుకు విలాసవంతమైన జీవితం గడిపేందుకు నగదు సర్దుబాటు చేస్తున్నట్లు తెలిసింది. ఆ డబ్బు అందబట్టే ఈ నెల 16న ఠానేలంక వచ్చినప్పుడు ‘లంక ఆఫ్ ఠానేలంక’లో 4 ఎకరాల లంక భూమి కొనేందుకు శ్రీనివాసరావు రూ.కోటికి బేరమాడి వెళ్లాడని స్థానికులు అంటున్నారు. భూమి కొనడానికే రూ.కోటి వరకు పెడతామని చెప్పిన శ్రీనివాసరావుకు అంతకు ఇంకా ఎన్నో రెట్ల సొమ్ము అంది ఉంటుందని ఠానేలంకలో పలువురు మాట్లాడుకోవడం కనిపించింది. విశాఖ ఎయిర్‌పోర్టులోని క్యాంటీన్‌లో మొదట్లో శ్రీనివాసరావు వేతనం రూ.7 వేలే. తర్వాత అది రూ.20 వేలకు పెరిగింది. నెలకు కేవలం రూ.20 వేల వేతనం తీసుకునే వ్యక్తి విలాసవంతమైన జీవితం గడపడంతోపాటు కోటి రూపాయలతో భూమి కొనేందుకు బేరం మాట్లాడుకోవడం గమనిస్తే కుట్రదారుల నుంచి అతడికి ఏ స్థాయిలో సొమ్ము అందుతోందో అర్థం చేసుకోవచ్చు.
కాట్రేనికోనలో కత్తి కొనుగోలు
కోడిపందేలకు వాడే కత్తుల తయారీలో పేరొందిన కాట్రేనికోనలో కొన్ని నెలల క్రితం శ్రీనివాసరావు కత్తిని కొనుగోలు చేసినట్టు తెలిసింది. కొత్తగా తయారు చేసినది కాకుండా అప్పటికే వినియోగించిన కత్తిని కొనుగోలు చేయడంతో సదరు విక్రయదారులకు అనుమానం కూడా వచ్చి, ఇప్పుడెందుకని అడిగినట్టు సమాచారం. తనకు వేరే ముఖ్యమైన పని ఉందని చెప్పి కోడికత్తి కొనుగోలు చేసి విశాఖకు తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment