సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రధాన ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై హత్యాయత్నం కుట్ర విశాఖ ఎయిర్‌పోర్ట్‌లోని ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ కేంద్రంగానే జరిగిందని కేంద్ర బలగాలు విశ్వసిస్తున్నాయి. జగన్ అభిమానినని చెప్పుకుంటున్న నిందితుడు ఆ రోజే ఎందుకు తెగబడ్డాడనే విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. రాష్ట్ర పోలీసులు ఆ దిశగా ఇంతవరకు లోతుగా దర్యాప్తు చేయనప్పటికీ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) వర్గాలు మాత్రం కుట్రదారులు ఎంతో వ్యూహాత్మకంగా ఎయిర్‌పోర్ట్‌ను ఎంచుకున్నట్టు భావిస్తున్నాయి. రక్షణ శాఖ అధీనంలోని తూర్పు నావికాదళం పర్యవేక్షణలో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో రాష్ట్ర ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరగడాన్ని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు ఈ కోణంలోనే చూస్తూ అంతర్గత దర్యాప్తు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది.
అభిమాని అయితే ఇన్నాళ్లూ ఎందుకు కలవలేదు?
తాను వైఎస్ జగన్ వీరాభిమానినని, ఆయనంటే చాలా ఇష్టమని, ఇదే విషయం లేఖలో స్పష్టంగా రాశానని చెప్పుకొస్తున్న నిందితుడు శ్రీనివాసరావు ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్ పక్కనే ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో ఎనిమిది నెలలుగా పని చేస్తున్నాడని పోలీసులు చెబుతున్నారు. మరి మూడు నెలల కాలంలో జగన్ అన్ని సార్లు ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తే ఏ సందర్భంలోనూ ఆయనతో ఫొటో కోసం గానీ, ఆటో గ్రాఫ్ కోసం గానీ, కనీసం చూసేందుకు గానీ వచ్చిన దాఖలాల్లేవు. ఇతరుల ద్వారా అయినా జగన్ దగ్గరికి వచ్చేందుకు ప్రయత్నించేవాడు కదా? సరిగ్గా హత్యాయత్నానికి తెగబడిన 25వ తేదీనే తొలిసారి సెల్ఫీ పేరిట రావడం గమనార్హం. అంతకు ముందు వైఎస్ జగన్‌కు పార్టీ నేత ఇంటి నుంచి కాఫీ వస్తుంటే.. అలా తీసుకురావడానికి వీల్లేదంటూ, శ్రీనివాసరావు పనిచేస్తున్న ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్ నుంచే సర్వ్ చేయించడం చూస్తుంటే పక్కాగా వ్యూహం ప్రకారం రెస్టారెంట్ కేంద్రంగానే కుట్ర జరిగినట్టు స్పష్టమవుతోందని సీఐఎస్‌ఎఫ్ అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
లేఖ విషయంలోనూ విచారణ
నిందితుడు శ్రీనివాసరావు వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న వాటిలో 11 పేజీల లేఖ ఉందని చెబుతున్న వాదనలపైనా సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. సహజంగా కత్తితో గానీ, పిస్తోలుతో గానీ దుండగుడు పోలీసులకు పట్టుబడితే వెంటనే అతన్ని పట్టుకుని ఇంకా అతని వద్ద ఏయే వస్తువులు ఉన్నాయో క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. నాప్‌కిన్ మొదలు చిన్న కాగితం ముక్క ఉన్నా వదలకుండా వెంటనే స్వాధీనం చేసుకుంటారు. అలాంటిది శ్రీనివాసరావు విషయంలో పోలీసులు పూటకొకటి దొరికిందని చెప్పుకొస్తున్న నేపథ్యంపై కూడా సీఐఎస్‌ఎఫ్ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. లేఖ విషయంలో సీఐఎస్‌ఎఫ్ అధికారి ఘటన జరిగిన రోజు హడావుడిగా సంతకం చేశారని తెలుస్తోంది. సదరు అధికారిని మీరు సరిగ్గా పరిశీలించే సంతకం చేశారా? 11 పేజీలు ఉన్నాయా? అని సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారి ప్రశ్నించినట్టు విశ్వసనీయ సమాచారం. శ్రీనివాసరావు వద్ద నుంచి కేవలం మడతపెట్టిన ఓ చిన్న కాగితం ముక్క మాత్రమే చూశానని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ అధికారి సీఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో అన్ని పేజీల లేఖ ఉందంటూ తమ విభాగానికే చెందిన అధికారి ఎలా సంతకం చేశారని ఉన్నతాధికారులు విచారిస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఎయిర్‌పోర్టే ఎందుకంటే..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు నుంచి దాదాపు వారంలో రెండుసార్లు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర ముగింపు దశ మొదలు.. విశాఖ జిల్లాలో యాత్ర కొనసాగినప్పుడు, ప్రస్తుతం విజయనగరంలో యాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో దాదాపు ప్రతి వారం హైదరాబాద్ వెళ్లి వచ్చారు. గురువారం విశాఖ నుంచి హైదరాబాద్‌కు వెళ్లి, శుక్రవారం తిరిగి వస్తారు. సుమారుగా మూడు నెలల కాలంలో 20 సార్లకు పైగా ఆయన ఈ ఎయిర్‌పోర్ట్ ద్వారా వెళ్లి వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు విమానాశ్రయంలో ఎక్కడా ఆగకుండా నేరుగా పాద్రయాత్ర జరిగే ప్రాంతంలోని శిబిరం వద్దకు చేరుకుంటారు.
హైదరాబాద్ వెళ్లేటప్పుడు మాత్రం కొంచెం సమయం ఉంటుంది (చెక్ ఇన్ కోసం కనీస నిర్ణీత సమయంలోగా వెళ్లాలి) కాబట్టి ఎయిర్‌పోర్ట్‌లోని వీవీఐపీ లాంజ్‌లో వేచి ఉంటారు. బోర్డింగ్ తర్వాత విమానం వద్దకు వెళ్తారు. జననేత ఎయిర్‌పోర్టుకెళ్లిన సందర్భాల్లో అక్కడి ఉద్యోగులు, ప్రయాణీకులు, అభిమానులు.. ఎవరు సెల్ఫీ అడిగినా కాదనకుండా వారితో ఫొటో దిగుతుంటారు. ఈ దృష్ట్యా జగన్‌పై హత్యకు కుట్ర పన్నిన వారు ఎయిర్‌పోర్ట్‌నే ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment