'సీఎం కిరణ్ అందర్నీ నమ్మించారు'
హైదరాబాద్:అసెంబ్లీలో తీర్మానం పెడతామంటూ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అందర్నీ నమ్మించి మోసం చేశారని వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు కొణతాల రామకృష్ణ విమర్శించారు. సమైక్య తీర్మానంపై కిరణ్, చంద్రబాబులు ఒక్కమాట కూడా మాట్లాడకపోవడం బాధాకరమని అన్నారు. తెలంగాణ బిల్లుపై చర్చలో పాల్గొనకుంటే విభజనకు ఒప్పుకున్నట్లేనని ప్రచారం చేస్తున్నారని, తీర్మానం చేయడం అనేది ప్రజాస్వామ్య విధానమని కొణతాల తెలిపారు. మంత్రులు రాజీనామాలు చేయకుండా అడ్డుకున్న సీఎం కిరణ్ ఇప్పుడు ప్రజల్ని మరింత మభ్యపెట్టేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు.
చేయాల్సిన సమయంలో ఎందుకు మేధోమథనం చేయకుండా, జనవరి 23 తర్వాత మేధోమథనం చేస్తానని సీఎం కిరణ్ చెబుతుండటం వెనుక కారణమేమిటని కొణతాల నిలదీశారు. విభజన అనంతరం ఏం చేయాలన్న దానిపై చర్చిస్తారా?అని ప్రశ్నించారు. బిల్లులో క్లాజ్వైజ్ సమాచారాన్ని సభ్యులకు ఇవ్వాల్సిన అవసరం ఉందని కొణతాల తెలిపారు.