ఎర్రగట్టు దేవస్థానం కోనేరుపై కబ్జాదారుల కన్నుపడింది. విలువైన భూములను ఓ రియల్టర్ ఆక్రమించేస్తున్నాడు.
సాక్షి ప్రతినిధి, వరంగల్: ఎర్రగట్టు దేవస్థానం కోనేరుపై కబ్జాదారుల కన్నుపడింది. విలువైన భూములను ఓ రియల్టర్ ఆక్రమించేస్తున్నాడు. అతడికి జిల్లాకు చెందిన ఓ మంత్రి అండదండలు ఉండడంతో రెవెన్యూ, దేవాదాయ శాఖ అధికారులు మిన్నకుండిపోతున్నారు. మేడారం జాతర పనులతో తీరిక ఉండడం లేదని... జాతర అయ్యాక ఎర్రగట్టు భూముల సంగతి చూస్తామని దాటవేస్తున్నారు. హసన్‌పర్తిలోని శ్రీ ఎర్రగట్టు వెంకటేశ్వరస్వామి ఆలయానికి వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో సుమారు 34 ఎకరాల భూమి ఉంది.
హన్మకొండ శివారులోని భీమారంలో సర్వే నంబర్ 137/సీలో ఎర్రగట్టు దేవస్థానానికి 10 గుంటల భూమి ఉంది. ఈ భూమిలో కోనేరు ఉండగా... జాతర సమయంలో భక్తులు ఇక్కడ విడిది చేసేవారు. కాలక్రమేణా ఈ కోనేరు వద్ద భక్తుల రద్దీ తగ్గింది. ఇదే అదనుగా సదరు రియల్టర్ ఈ భూములపై కన్నేశాడు. రెవెన్యూ అధికారుల సహకారంతో ఆక్రమించడంతోపాటు ప్లాట్లుగా విభజించి విక్రయాలు చేయడంతో ఆలయ భూమి అన్యాక్రాంతమైంది. మార్కెట్‌లో ప్రస్తుతం ఈ భూమి విలువ రూ.1.50 కోట్లు. గజానికి రూ.12 వేల నుంచి రూ.15వేల వరకు ధర పలుకుతోంది.
పది రోజులుగా వివాదం
ఎర్రగట్టు దేవాలయానికి నెల క్రితం కొత్త పాలకవర్గం ఏర్పాటైంది. ఆలయ కోనేరును అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హోలీ రోజున మొదలయ్యే జాతరలోపు కోనేరులో పూడిక తీసి, అభివృద్ధి చేస్తామని ప్రకటించింది. కొత్త పాలకవర్గం ఇటీవల కోనేరును పరిశీలించేందుకు వెళ్లినప్పుడు అక్కడ ప్లాట్లు ఉన్నాయి. రెవెన్యూ రికార్డుల మేరకు కోనేరును, దాని చుట్టుపక్కల ఉన్న ఆలయ భూమిని పాలకవర్గం జేసీబీతో చదును చేయించింది. సర్వే చేసి హద్దులు పాతాలని రెవెన్యూ, దేవాదాయ అధికారులను కోరింది.
ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న పనులను రియల్టర్ అడ్డుకోవడంతో భూ వివాదం వెలుగులోకి వచ్చింది. కోనేరు పనులు ఎలా అడ్డుకుంటారని పాలకవర్గ సభ్యులు ప్రశ్నించగా... భూమి తనదేనని రియల్టర్ వారితో వాగ్వాదానికి దిగాడు. అరుుతే కోనేరు వద్ద ఆలయూనికి సంబంధించిన భూమి 10 గుంటలే ఉందని కొత్త రెవెన్యూ రికార్డులో ఉంది. దీనిపై ఆలయ పాలకవర్గం మండిపడింది. ఇది అధికారులు, కబ్జాదారుడి పనే అని ఆరోపిస్తోంది. ఇలా పది రోజులుగా వివాదం నడుస్తోంది. జోక్యం చేసుకుని భూమి ఎవరిదని నిర్ధారించాల్సిన రెవెన్యూ శాఖ మాత్రం చోద్యం చూస్తోంది.
మంత్రి ఒత్తిడి...
సీనియర్ మంత్రి తనకు మంచి మిత్రుడనే చెప్పుకునే రియల్టర్... పాలకవర్గం చర్యలతో ఇబ్బంది పడి ఒత్తిడి వ్యూహాన్ని అమలు చేయడం మొదలుపెట్టాడు. రియల్టర్ విజ్ఞప్తితో మంత్రి జోక్యం చేసుకుని రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు, ఆలయ పాలకవర్గంపైనా ఒత్తిడి తీసుకొచ్చినట్లు తెలిసింది. ‘ఎప్పుడో భూమి కొన్నాడు... ప్లాట్లు చేశాడు... విక్రయించాడు. ఇప్పుడు ఆలయ భూములు అంటే ఎలా..దేవస్థానానికి భూమి ఉంటే ఉండొచ్చు... అటువైపు వెళ్లకండి. ఏమైనా ఉంటే రియల్టర్ చూసుకుంటాడు.’ అని మంత్రి వారితో అన్నట్లు సమాచారం.
మంత్రి జోక్యంతో అధికారులు, దేవస్థాన పాలకవర్గం కోనేరు సంగతిని పక్కనబెట్టారు. ఎర్రగట్టు భూములతో తమకు సంబంధం లేదని, దేవాదాయ శాఖ వారే చూసుకోవాలని రెవెన్యూ అధికారులు... సర్వే చేసి హద్దులు నిర్ధారించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపైనే ఉందని దేవాదాయ శాఖ అధికారులు చెబుతుండడాన్ని బట్టి మంత్రి ఒత్తిడి ఎంత మేర పనిచేసిందో ఇట్టే గ్రహించవచ్చు. ఆలయ పాలకవర్గమే స్వయంగా పైకి తెచ్చిన కోనేరు అంశం... ఇప్పుడు వారి చర్యలతోనే మరుగునపడుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు.
మరో రూ.8 కోట్ల విలువైన భూమి ఆక్రమణ
ఎర్రగట్టు ఆలయానికి సంబంధించి హసన్‌పర్తిలోని తాటివనంలో నాలుగు ఎకరాల భూమి కూడా కబ్జాకు గురైందని పాలకవర్గం చెబుతోంది. ఈ భూమి విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. భీమారం పరిధిలోని సర్వే నంబర్ 138లో రూ. కోటి విలువైన మరో పది గుంటల ఆలయ భూమి పరిస్థితి ఇలాగే ఉంది. గోపాలపురం శివారులోని సర్వే నంబర్ 30లో ఆలయానికి రూ.2 కోట్ల విలువైన 37 గుంటల భూమి ఉంది.
భీమారానికి చెందిన ఓ వ్యక్తి గతంలో ఈ భూమిని ప్లాట్లుగా చేసి విక్రయించాడు. ఈ అంశం హైకోర్టుకు వెళ్లగా... ఈ భూమి ఎర్రగట్టు ఆలయానిదేనని కోర్టు తీర్పు ఇచ్చింది. అరుుతే ప్రస్తుతం ఇక్కడ 20 గుంటల భూమి మాత్రమే ఉంది. మిగిలిన 17 గుంటల భూమి కబ్జాకు గురైనట్లేనని తెలుస్తోంది. గోపాలపురంలోని దుప్ప తీర్థం వద్ద ఉన్న సుమారు 20 గుంటల భూమి కూడా అన్యాక్రాంతమైనట్లు పాలకవర్గం చెబుతోంది. దీని విలువ మరో రూ.3కోట్లు ఉంటుందని అంచనా.