ఇక చార్జీల మోత
విద్యుత్ భారం రూ. 4,500 కోట్లకు పైగా
⇒ యూనిట్‌కు కనీసం 50 నుంచి 75 పైసల పెంపు!
⇒ ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ చార్జీలకు అవకాశం
⇒ రూ.7,716 కోట్ల ఆర్థిక లోటుతో ఏఆర్‌ఆర్‌లు సమర్పించిన డిస్కమ్‌లు
⇒ సబ్సిడీపై నోరు మెదపని ప్రభుత్వం
⇒ విద్యుత్ కొనుగోలుతో నష్టాలు పెరిగాయన్న డిస్కమ్‌లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రజలపై రూ.4,528 కోట్ల అదనపు విద్యుత్ చార్జీల భారం మోపేందుకు సర్కారు సిద్ధమవుతోంది. సగటున 15 శాతం చార్జీల మోత తప్పదనే సంకేతాలు ఇచ్చింది. రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు వార్షిక ఆదాయ, వ్యయ నివేదికలను (ఏఆర్‌ఆర్‌లు) మంగళవారం విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి సమర్పించాయి.
ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ విజయానంద్, రెండు విద్యుత్ పంపిణీ సంస్థల సీఎండీలు ఈఆర్‌సీ చైర్మన్ భవానీప్రసాద్‌ను కలిసి ఏఆర్‌ఆర్‌లు అందజేశారు. అంతకుముందు సీఎం చంద్రబాబును సచివాలయంలో కలిసి, విద్యుత్ సంస్థల లోటు గురించి వివరించారు. మొత్తం రూ.7,716 కోట్ల మేర ఆర్థిక లోటును డిస్కమ్‌లు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. వీటిని ఎలా భర్తీ చేస్తాయనేది మాత్రం చెప్పలేదు. ఏటా ఏఆర్‌ఆర్‌లతో పాటు, కొత్త విద్యుత్ చార్జీల ప్రతిపాదనలు సమర్పించే డిస్కమ్‌లు ఈసారి ఇందుకు భిన్నంగా వ్యహరించాయి. ఆదాయ, వ్యయ వివరాలను మాత్రమే ఈఆర్‌సీ ముందుంచాయి.
వీటిని పూడ్చుకునేందుకు ఏ కేటగిరీకి ఎంత పెంచుతారు అనే విషయాన్ని గోప్యంగా ఉంచాయి. మరో వారం రోజుల్లో దీనిపై ప్రత్యేకంగా ఈఆర్‌సీకి నివేదిక ఇవ్వాలని నిర్ణయించాయి. ప్రభుత్వం ప్రకటించే సబ్సిడీని బట్టి చార్జీల పెరుగుదల ఉండే వీలుంది. అయితే సబ్సిడీ ఎంతో సర్కారు ఇప్పటివరకు తేల్చలేదు. గత ఏడాది మాదిరి రూ. 3,188 కోట్లు ఇచ్చినా, ఇంకా రూ.4,528 కోట్ల మేర ప్రజల నుంచే వసూలు చేయక తప్పదని తెలుస్తోంది.
100 యూనిట్లలోపు వినియోగదారులకు చార్జీల నుంచి ఊరట ఇస్తామంటూ ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నా.. లోటు భర్తీకి ఆపై విద్యుత్ వాడకం దారులకు భారీగానే వాత ఖాయంగా కన్పిస్తోంది. యూనిట్‌కు కనీసం 50 నుంచి 75 పైసల మేర పెరిగే వీలుంది. వచ్చే నెల 2న జరిగే రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీనిపై స్పష్టత ఏర్పడే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీ ఇస్తే ఆ మొత్తం ఆధారంగా డిస్కమ్‌లు కొత్త విద్యుత్ టారిఫ్‌ను రూపొందిస్తాయి. ఒకవేళ సబ్సిడీ ఇవ్వని పక్షంలో మొత్తం రూ.7,716 కోట్ల లోటును డిస్కమ్‌లు ప్రజల నుంచే వసూలు చేస్తాయి. మొత్తం మీద వచ్చే ఏప్రిల్ నుంచి కొత్త విద్యుత్ చార్జీలు అమలులోకి వస్తాయి.
దక్షిణ ప్రాంత (ఎస్పీడీసీఎల్), తూర్పు ప్రాంత (ఈపీడీసీఎల్) పంపిణీ సంస్థలు 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ. 30,308 కోట్లు అవసరమని ప్రతిపాదించాయి. ప్రస్తుతం వసూలు చేస్తున్న చార్జీల ద్వారా రూ.22,592 కోట్లు వస్తాయని పేర్కొంది. ఇంకా రూ.7,716 కోట్లు అవసరమని (లోటు) స్పష్టం చేశాయి. ప్రస్తుతం యూనిట్ విద్యుత్‌కు రూ. 1.55 పైసలు నష్టం వస్తోందని డిస్కమ్‌లు తెలిపాయి. విద్యుత్ కొనుగోళ్ళ భారం ఆర్థిక లోటుకు దారి తీసినట్టు వివరించాయి. రాష్ట్రంలో 58,191 మిలియన్ యూనిట్లు (ఎంయూలు) విద్యుత్ అవసరం ఉంటే, అందుబాటులో ఉన్నది 54,884 ఎంయూలేనని, డిమాండ్, లభ్యత మధ్య 3,307 మిలియన్ యూనిట్ల అంతరం ఉందని పేర్కొంది. ఈ వ్యత్యాసాన్ని ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు.