సీఎం రేసులో కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి?
విభజన అంశం రోజుకో ట్విస్ట్ తిరుగుతున్న దశలో ఇప్పుడు కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్‌రెడ్డి కీలక వార్తల్లో చోటు సంపాదించారు. ఆయనను సీఎం పదవి వరించనుందనే ప్రచారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆశల మోసులు.. పెదవి విరుపులు కలగలిపి జిల్లాలో అందరి నోటా ఇదే చర్చ. అన్నకు ప్రమోషనంటూ అభిమానుల్లో ఒకటే హడావుడి.
సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి మరోసారి ‘కోట’ల కుటుంబాన్ని వరిస్తోందనే ఆశలు జిల్లా ప్రజలను ఊరిస్తోంది. మరోవైపు సీఎం పదవి ఖరారైందని, ప్రమాణ స్వీకారం తేదీని ప్రకటించటమే తరువాయని ఆయన వర్గీయులు తెగ ప్రచారం చేస్తున్నారు. జిల్లా పెద్దాయన కోట్ల విజయభాస్కరరెడ్డి మరణం తరువాత ఆయన కుమారుడు జయసూర్యప్రకాష్‌రెడ్డి రాజకీయ వారసుడుగా ఎదిగారు. ఎంపీగా గెలుపొందిన ప్రతిసారీ కేంద్రంలో ఆయనకు బెర్త్ ఖాయమని ప్రచారం సాగేది. పలుమార్లు ఇలా పదవి దోబూచులాడినప్పటికీ ఎట్టకేలకు యూపీఏ ప్రభుత్వం తన విభజన ఎత్తుగడలో భాగంగా సూర్యప్రకాష్‌రెడ్డికి కేంద్ర రైల్వే సహాయ మంత్రి పోస్టును కట్టబెట్టిన సంగతి విదితమే.
అది చేపట్టిన నాటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉధృతంగా సాగుతుండటం, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు పెద్దగా రాకపోవటం ఆయనను నిరుత్సాహానికి గురిచేసేది. అయినా ఎక్కడా అధిష్టానాన్ని ధిక్కరించకుండా కోట్ల వ్యూహాత్మకంగానే వ్యవహరించేవారు. సమైక్య ఉద్యమ హోరు నేపథ్యంలో ఇటీవల తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించినప్పటికీ ఆ తరువాత అధినేతలు వారించటంతో వెనక్కుతగ్గారు. దీంతో అధిష్టానం దృష్టిలో కోట్ల విధేయునిగా మార్కులు కొట్టేశారు. దీంతో మంత్రి కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానానికి సదభిప్రాయం కలిగిందని ఆయన సన్నిహితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ‘కోట్ల’ కూడా తన వంతు ప్రయత్నంలో భాగంగా రాష్ట్ర విభజన జరిగిన పక్షంలో పరిష్కరించాలంటూ అధిష్టానం ముందు మూడు డిమాండ్లు పెట్టినట్లు సన్నిహితుల కథనం. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ఆయన వాటిని బహిర్గత పరచడం లేదని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరు సీఎం రేసులో ఉండడం కొత్త చర్చకు తావిస్తోంది.
9న అధినేత్రిని కలవనున్న మంత్రి ?
కేంద్ర రైల్వే సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్‌రెడ్డికి సీఎం పదవి వరిస్తుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో 9న ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీని కలవనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ రోజు కేవలం మంత్రి కోట్ల ఒక్కరికే సోనియా అప్పాయింట్ మెంట్ ఇచ్చారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఆ రోజు సీఎం పదవిని కట్టబెట్టే విషయంపై స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశం ఉందని భోగట్టా. ఈ అంశం గతంలో ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ పార్టీ కోర్‌కమిటీ సమావేశంలో తెరపైకి వచ్చినట్లు తెలిసింది.
ఆ తరువాత హైదరాబాద్‌లో రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలతో జరిగిన రహస్య సమావేశంలోనూ సీఎం ప్రతిపాదన ప్రస్తావన జరిగిందని విశ్వసనీయ వర్గాల కథనం. అయితే సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తే తప్ప ఇంకొకరికి అయ్యే అవకాశం రాదని రాజకీయవర్గాలు అంచనా చేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సీఎం మార్పు ఉండకపోవచ్చనే అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఎన్నికలకు కేవలం కొద్దిమాసాలు మాత్రమే ఉన్న ఈ తరుణంలో పెద్ద పదవిని తీసుకుని లేని సమస్యలను నెత్తికెత్తుకోవటం ఎందుకనే అభిప్రాయం కోట్ల వర్గీయులే మరి కొందరు అంటున్నారు. మొత్తానికి ఈ అంశం జిల్లాలోనూ, అయన ఇంట్లోను హాట్ టాపిక్‌గా మారిపోయింది.
మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం ముఖ్యమంత్రి మార్పు లేదని శుక్రవారం ఢిల్లీలో స్పష్టం చేశారు. సీఎం మార్పు ఊహాగానాలేనని కొట్టిపారేశారు. అయితే కాంగ్రెస్ లో అవునంటే....కాదనిలే....కాదంటే అవుననిలే అనే నానుడి ఉన్న నేపథ్యంలో ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లు అన్నకు సీఎం పదవి వరిస్తుందేమో?