చేపా.. చేపా! ఎందుకెండలేదు?
=ప్లాట్‌ఫారాలు లేక నాణ్యత కోల్పోతున్న ఎండు చేపలు
=ఇసుక దిబ్బల్లో ఎండబెట్టి నష్టపోతున్న గంగపుత్రులు
=స్టోర్ రూం లేక ఒడ్డునే వలల మరమ్మతులు
ఈ ప్రశ్నకు జవాబు కోసం పెద్దగా శ్రమపడక్కర్లేదు. దానికి సమాధానం ఇదిగో.. సముద్రంపై ఆటుపోట్లతో వేటసాగిస్తూ అరకొరగా చేపలు దక్కించుకుంటున్న అడుగడుగునా అష్టకష్టాలే. తీరప్రాం తాల్లో మౌలిక సదుపాయాల కల్పన అల్లంత దూరంలోనే ఉంటోంది. నిద్రాహారాలు మాని, ప్రాణాలకు తెగించి వేటాడి తెచ్చుకున్న చేపలను ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాల కొరత వేధిస్తోంది. తీరం వెంబడి ఉన్న ఇసుకతిన్నెలే వీరికి ఆధారమవుతున్నాయి.
నక్కపల్లి, న్యూస్‌లైన్ : జిల్లాలో 11 మండలాల్లో 132 కిలోమీటర్ల తీరం ఉంది. 62 మత్స్యకార గ్రామాల్లోని 30 వేల మంది రోజూ వేటకు వెళతారు. వీరిలో 30శాతం మందికి వేట లేకుంటే పూట గడవదు. సుమారు లక్ష మంది వేట ఆధారంగా జీవిస్తున్నారు. మరో లక్ష మంది పరోక్షంగా అనుబంధరంగాలపై ఆధారపడి బతుకుతున్నారు. మత్స్యకారులు వేటాడి తెచ్చిన చేపలను ప్లాట్‌ఫారాలపై ఎండబెడితే నాణ్యత బాగుంటుంది. వాటికి మంచి ధర పలుకుతుంది.
ఇసుకపై ఎండబెట్టిన చేపలకంటే ప్లాట్‌ఫారాలపై ఎండిన వాటికి కిలోకు రూ.20-30ల ధర అధికంగా ఉంటుంది. తీర ప్రాంతంలో చేపలను భద్రపరచుకోవడం, ఎండబెట్టుకోవడానికి ప్లాట్‌ఫారాలు, వేలాది రూపాయలు విలువైన వలలు దాచుకోవడం, మరమ్మతులు చేసుకోవడానికి స్టోర్‌రూంలు నిర్మించాలని ఎన్నో ఏళ్లుగా మత్య్సకారులు చేస్తున్న డిమాండ్ సాగర రోదనే అవుతోంది. జిల్లాలో తీరప్రాంతం వెంబడి 11 మండలాల్లో సుమారు 1800కి పైగా మోటారు బోట్లు, తెప్పలు ఉన్నాయి.
ఈ ప్రాంతంలో ఎండుచేపలకు గిరాకీ ఉంది. చేపలను ఇసుకతిన్నెల్లో ఎండబెట్టి పూరీ, పారాదీప్, నాగార్జునసాగర్, కోల్‌కతా, శ్రీశైలం, బెంగళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. 50 బోట్లకు పైగా ఉన్న తీర ప్రాంత గ్రామంలో చేపలు ఎండబెట్టుకోవడానికి కనీసం రెండు ప్లాట్‌ఫారాలుండాలి. కానీ చాలా గ్రామాల్లో ఒకటి కూడా లేదు. పాయకరావుపేట మండలం పాల్మన్‌పేట, కొర్లయ్యపేట, వెంకటనగరం, నక్కపల్లి మండలం రాజయ్యపేట తదితర పెద్ద గ్రామాల్లో ఒక్కో ప్లాట్ ఫారం ఉంది. పెదతీనార్ల, చినతీనార్ల, రాజవరం,కేశవరం గ్రామాల్లో లేనేలేవు. ఎస్. రాయవరం మండలం రేవుపోలవరం, బంగారయ్మపాలెం, అచ్చుతాపురం మండలంలో పూడిమడక, తదితర గ్రామాల్లో 4-5 ప్లాట్‌ఫారాలు నిర్మించాలి. కానీ ఎక్కడా ఒకటికి మించి లేవు.
దీంతో జోరుగా వేటసాగే సమయంలో దొరికిన చేపలను ఇసుక తిన్నెలపైనే ఉంచాల్సి వస్తోంది.తీరప్రాంతం నుంచి మత్య్ససంపదను మార్కెటింగ్ చేసేందుకు సరైన రహదారి సదుపాయాలు లేవని వీరు వాపోతున్నారు. గ్రామాల నుంచి సముద్రపు ఒడ్డుకు పక్కా రోడ్డు లేక ఆటోలో చేపలు తరలించడానికి రవాణా చార్జీలు తడిసిమోపెడవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ీతీరప్రాంతాల్లో తగినన్ని ప్లాట్‌ఫారాలు నిర్మించాలని కోరుతున్నారు.