భక్త జనోత్సవం
సాక్షి, తిరుమల: లక్షలాది మంది భక్తజన సందోహం, గోవింద నామస్మరణ మధ్య తిరుమల వేంకటేశ్వరుడు తనకు అత్యంత ఇష్టమైన గరుడ వాహనంపై మంగళవారం నాలుగు మాడ వీధుల్లో విహరిం చారు. చిన్నపాటి తోపులాటలు మినహా వాహనసేవ అంతా ప్రశాంతంగా సాగింది. మూడు లక్షల మంది పైబడి భక్తులు ఉత్సవమూర్తిని దర్శించుకున్నట్లు తిరుమల జేఈవో కేఎస్.శ్రీనివాసరాజు తెలిపారు. గరుడ వాహన సేవను చూసి తరించడానికి మంగళవారం ఉదయం నుంచే భక్తుల రాక కనిపించింది. ఉదయం మోహినీ అవతారం ఊరేగింపులోనే నాలుగు మాడ వీధులు భక్తులతో కిక్కిరిసి పోయాయి.
మధ్యాహ్నం 2 గంటల నుంచే భక్తులు ఆలయ మాడ వీధుల్లోకి రావడానికి క్యూ కట్టారు. సాయంత్రం 6 గంటలకు శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న గ్యాలరీలు నిండిపోయాయి. దక్షిణ, పడమట, ఉత్తర మాడ వీధుల్లోని గ్యాలరీలు కూడా సాయంత్రానికే భక్తులతో కిక్కిరిసి కనిపించాయి. రాత్రి 7.50 గంటలకు వాహనంపై కొలువుదీరి ఉన్న స్వామివారి ముందున్న తెరను తొలగించి జీయ్యర్ స్వాములు, అర్చకులు, వీఐపీలకు 50 నిముషాలకుపైగా దర్శనభాగ్యం కల్పించారు. రాత్రి 8.50 గంటలకు గరుడవాహనం వాహన మండపం నుంచి బయలుదేరింది. ప్రతి భక్తుడూ ఉత్సవమూర్తిని దర్శించుకునేలా వాహనాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లారు.
కిక్కిరిసిన గ్యాలరీలు, బారికేడ్లు
నాలుగు మాడ వీధుల్లోని గ్యాలరీలు, బారికేడ్లలో జనం కిక్కిరిసి కనిపించారు. సుమారు మూడు లక్షల మందికిపైగా భక్తులు దర్శిం చుకున్నట్లు టీటీడీ ప్రకటించింది. సాయంత్రం 4 గంటల నుంచే కల్యాణకట్ట నుంచి అఖిలాండం మార్గంలోను, రాంభగీచా అతిథి గృహం నుంచి నాలుగు మాడ వీధుల్లోకి రాక పోకలు నిలిపి వేశారు. వాహన మండపం సమీపానికి, భక్తులు కూర్చునే బారికేడ్లలోకి ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి అనుమతించారు. మధ్యాహ్నమే గ్యాలరీల్లోకి వెళ్లిన భక్తులకు మరుగుదొడ్ల సౌకర్యం లేక అవస్థలు పడ్డారు. గ్యాలరీల్లో వేచిఉన్న భక్తులకు అన్నప్రసాదాలు అందజేశారు. అలిపిరి నుంచి తిరుమల వరకు అనేక సంస్థలు, వ్యక్తులు భక్తులకు అన్నదానం చేశాయి.
వాహన సేవలో వీఐపీల హడావిడి
వాహన సేవలో వీఐపీల హడావిడి, తోపులాట ఎక్కువగా కనిపించింది. ఈసారి ధర్మకర్తల మండలి లేకున్నా, ఇతర ప్రముఖులు చాలా మంది సకుటుంబ సపరివార సమేతంగా తరలిరావటంతో వాహన సేవకు ముందు వీరే అధికంగా కనిపించారు.
భక్తుల మధ్యతోపులాట
శ్రీవారి గరుడసేవలో భక్తుల మధ్య స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. గ్యాలరీలోనే ఉంటూ ప్రశాంతంగా స్వామి వారిని దర్శించుకున్న భక్తులు తిరిగి వెళ్లే సమయంలో అవస్థలు పడ్డారు. వీరికి సరైన మార్గం చూపించాల్సిన పోలీసులు అటువెళ్లమని కొందరు, మరి కొందరు ఇటువెళ్లమంటూ ఆగ్రహించటంతో ఎటువెళ్లాలో దిక్కుతోచక గందరగోళంలో పడ్డారు. దీంతో నాలుగు మాఢవీధుల్లో భక్తుల మధ్య తోపులాట జరిగింది. పలువురు భక్తులకు స్వల్పగాయాలయ్యాయి.
డీఐజీ, సీవీఎస్‌వో, ఎస్‌పీ నేతృత్వంలో భద్రత కట్టుదిట్టం
అనంతపురం రేంజ్ డీఐజీ బాలకృష్ణ, టీటీడీ సీవీఎస్‌వో జి.శ్రీనివాస్, అదనపు సీవీఎస్‌వో శివకుమార్‌రెడ్డి, తిరుపతి అర్బన్‌జిల్లా ఎస్‌పీ గోపినాథ్‌జెట్టి, ఏఎస్‌పీ ఎంవీఎస్ స్వామి బందోబస్తును పర్యవేక్షించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి మొత్తం 4,500 వేల మంది పోలీసు సిబ్బందిని ఆలయ నాలుగు మాడవీధులు, ట్రాఫిక్ మళ్లింపు ప్రాంతాల్లో మోహరించారు. జనం కదలికలపై సీసీ కెమెరాలతో నిశితంగా పరిశీలించారు. కొందరు పోలీసు సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తమవారిని మాత్రం దొడ్డిదారుల్లో అనుమతించారు. పలు చోట్ల భక్తులను మాత్రం అడ్డుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మెటల్ డిటెక్లర్ల, వ్యక్తిగత తనిఖీ అనంతరమే భక్తులను నాలుగు మాడవీధుల్లోకి అనుమతించారు.
భక్తులకు ప్రయాణ కష్టాలు..
ఆర్టీసీ బస్సులను అధికంగా ఏర్పాటు చేసినా, భక్తుల రద్దీ వల్ల తీవ్ర డిమాండ్ ఏర్పడింది. ఉన్న ఆర్టీసీ బస్సుల చాలక భక్తులు అష్టకష్టాలు పడ్డారు. అందుబాటులో ఉండే ప్రైవేట్ ట్యాక్సీలు, జీపులపైనే ఆధార పడాల్సి వచ్చింది. ప్రైవేట్ వాహనాల ప్రయాణ చార్జి ధర రూ.60గా నిర్ణయించినప్పటికీ.. రూ.150 రూ.200 వరకు వసూలు చేశారు. తిరుపతిలోని అలిపిరి తనిఖీ కేంద్రంలో వాహనాల రద్దీ పెరగటంతో ఉదయం నుంచే నామ మాత్రపు తనిఖీలు చేసి కొండకు అనుమతించారు.