
శనక్కాయలంటూ చైన్ లాక్కెళ్లాడు..
అనంతపురం క్రైం : శనక్కాయలు కావాలా.. అమ్మయ్యా.. అంటూ ఓ ఆగంతకుడు ఇంటి వాకిలి వద్దకు వచ్చాడు. ఏమీ వద్దప్పా అంటూ మహిళ మరో గదిలోకి వెళ్లింది. ఆమెను అనుసరిస్తూ లోపలికి వెళ్లిన ఆగంతకుడు ఆమెను చితకబాది మెడలోని ఏడుతులాల బంగారు తాళిబొట్ల గొలుసు ఎత్తుకెళ్లాడు. బాధితురాలి తలకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యులు సుమారు 25 కుట్లు వేశారు. ప్రస్తుతం పెద్దాస్పత్రిలో కోలుకుంటోంది. నగరంలో మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
బాధితురాలి కథనం మేరకు.. ఓలేటి లక్ష్మినారాయణ, ఓలేటి లక్ష్మిదేవి (50) దంపతులు పెన్నార్ భవనం ఎదురుగా మీసేవా కేంద్రం పక్కన నివాసం ఉంటున్నారు. కలెక్టరేట్ ఎదుట భవాని హోటల్ నిర్వహిస్తున్నారు. రోజువారి క్రమంలో భాగంగా మంగళవారం ఉదయం 6.15 గంటలకు లక్ష్మీనారాయణ సరుకులు సర్దుకుని హోటల్‌కు వెళ్లాడు. మరో పదిహేను నిముషాల్లో లక్ష్మిదేవి కూడా వెళ్లాల్సి ఉండటంతో ఆమె తల దువ్వుకుంటోంది. ఇంతలో ఓ ఆగంతకుడు ఇంటి వాకిలి వద్దకు వచ్చాడు.
లోపలికి తొంగిచూస్తూ...‘శనక్కాయలు కావాలా.. అమ్మయ్యా.. అంటూ పిలిచాడు. వద్దునాయనా.. అంటూ లక్ష్మిదేవి మరో గదిలోకి వెళ్లింది. ఇంతలో మెల్లగా లోపలికి ప్రవేశించిన ఆగంతకుడు గుర్తు పట్టకుండా మొహానికి ముసుగు వేసుకున్నాడు. లోపల వాకిలికి గడియ పెట్టాడు. ఆమె వద్దకు వెళ్లి మెడలోని ఏడు తులాల రెండు పొరవల బంగారం తాళిబొట్టు చైనును లాక్కునే యత్నం చేశాడు. ఆమె ప్రతిఘటించడంతో బలమైన వస్తువుతో తలపై దాడి చేశాడు. పెనుగులాటులో ఇల్లంతా రక్తపు మరకలు అయ్యాయి.
చైను లాగేసుకుని ఆగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. పోతూపోతూ ఇంటి బయట వాకిలి వేసి గడియపెట్టి వెళ్లిపోయాడు. కాసేపటికి షాక్ నుంచి తేరుకున్న లక్ష్మిదేవి మొబైల్ నుంచి పక్కింటి వారికి ఫోన్ చేసింది. వారువచ్చి బయట గడియ తీసి లోపలికి వెళ్లిచూడగా లక్ష్మిదేవి రక్తపుమడుగులో ఉంది. వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తలపై బలమైన గాయూలు ఉండటంతో 25 కుట్లు వేశారు. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ గోరంట్లమాధవ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, బాధితురాలికి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు.