
పోలీసులపై తిరగబడిన టిడిపి కార్యకర్తలు
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే వేదిక వద్ద తెలుగుతమ్ముళ్లుపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. గుంటూరు-విజయవాడ మధ్య ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా ఖాళీ స్థలంలో ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. వేదిక వద్ద వీఐపీ గ్యాలరీల్లోకి చొచ్చుకు వచ్చిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు కట్టడి చేశారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తలు, పోలీసుల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది.
పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దీనికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు పోలీసులపై తిరుగబడ్డారు. కుర్చీలు తీసుకొని విసిరివేశారు. వాటిని విరగగొట్టారు. దీంతో వేదిక వద్ద కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.