అసెంబ్లీలో ఏం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని తెలంగాణ ప్రాంత న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు.
తేల్చిచెప్పిన తెలంగాణ ప్రాంత న్యాయ నిపుణులు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో ఏం జరిగినా తెలంగాణ ఏర్పాటుకు ఎలాంటి ఆటంకం ఏర్పడదని తెలంగాణ ప్రాంత న్యాయ నిపుణులు తేల్చిచెప్పారు. రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్ జరిగినా, జరగకపోయినా, చర్చ జరిగినా, జరగకున్నా విభజన ప్రక్రియపై ఎలాంటి ప్రభావం ఉండదని అన్నారు. శాసనసభ సంబంధిత అంశాల వల్ల రాజ్యాంగపరమైన, న్యాయపరమైన సమస్యలేమీ ఉత్పన్నం కాబోవని స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్ నేతలు మంగళవారం రాత్రి హైదరాబాద్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పి.సుదర్శన్‌రెడ్డి సహా పలువురు న్యాయ నిపుణులతో సమావేశమయ్యారు. నేతలు కె.కేశవరావు, ఈటెల రాజేందర్, కె.తారక రామారావు, టి.హరీష్‌రావు, బి.వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
రాష్ట్రపతి పంపిన టీ బిల్లులోని అంశాలపై శాసనసభలో ఓటింగ్ ఉంటుందని స్పీకర్ చేసిన ప్రకటన, ఈ నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహం, సవరణలపై అభిప్రాయాలు చెప్పడం, న్యాయపరమైన సమస్యలు, పరిష్కారాలు వంటివాటిపై రెండు గంటలకు పైగా చర్చించారు. రాష్ట్ర విభజనపై ఎలాంటి నిర్ణయాలు చేయడానికైనా పార్లమెంటుకే పూర్తిగా అధికారాలున్నాయని న్యాయ నిపుణులు తేల్చారు. శాసనసభ చేయగలిగేదేమీ లేదని అన్నారు. బిల్లులోని అంశాలపై కూడా ఓటింగ్ ఎందుకు పెడుతున్నారో చెప్పాలంటూ శాసనసభలో నిలదీస్తామని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అన్నారు. శాంతిభద్రతలపై గవర్నర్‌కు అధికారాలు, నదీజలాల పంపకానికి బోర్డు, పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానివంటి 10 అంశాలపై సవరణలను స్పీకర్ ఫార్మాట్‌లో ఆయనకు అందజేయనున్నట్టు తెలిపారు.