
విద్యుత్ చార్జీల పెంపుపై నిలదీయడానికే..
ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలపై రూ.వెయ్యి కోట్ల మేరకు విద్యుత్ చార్జీల భారం మోపడానికి నిరసన తెలిపి.
సభకు హాజరవడంపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ వెల్లడి
హైదరాబాద్: ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి రాష్ట్ర ప్రజలపై రూ.వెయ్యి కోట్ల మేరకు విద్యుత్ చార్జీల భారం మోపడానికి నిరసన తెలిపి.. పెంచిన ఆ చార్జీలను తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికే శాసనసభకు హాజరయ్యామని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. విద్యుత్ చార్జీల పెంపుపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా మంగళవారం శాసనసభ నుంచి వాకౌట్ చేసిన అనంతరం ఆయన పార్టీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో కలసి మీడియాతో మాట్లాడారు. సభకు హాజరుకారాదని ముందు భావించినప్పటికీ ప్రజలపై చార్జీల భారాన్ని మోపడంతో ప్రభుత్వాన్ని సభద్వారా గట్టిగా నిలదీయడానికి, చార్జీల పెంపులోని డొల్లతనాన్ని ఎండగట్టడానికి వచ్చామని చెప్పారు. తగిన రీతిలో చెప్పడం ద్వారా చంద్రబాబు మనసు మార్చగలమేమోనని అసెంబ్లీలో ఎదురుచూశామని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు రావడంతో ప్రజలకు కష్టాలు పెరిగిపోయాయని బాధపడ్డామన్నారు. బీజేపీ సభ్యుడు తమ వద్దకొచ్చి చెప్పిన మీదట ఒక అవగాహనతో సభలో విద్యుత్ చార్జీలపై చర్చలో పాల్గొన్నామని తెలిపారు. తమ తరఫు నుంచి ఇద్దరికి.. అది కూడా ఒకరికి 20 నిమిషాలు, మరొకరికి 25 నిమిషాల చొప్పున సమయం కేటాయిస్తే, ఆ మేరకు వారి షరతులకు లోబడే మాట్లాడామని జగన్ చెప్పారు. కానీ అధికారపక్షం నుంచి ఎక్కువమంది మాట్లాడి కథలు వినిపించారని, విద్యుత్ చార్జీలు పెంచడం అద్భుతం అన్నట్లుగా సిగ్గులేనివిధంగా చెప్పడం చూస్తే ఇక వారి వైఖరిలో మార్పు రాదని గ్రహించి సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన వివరించారు.
ప్రజాసమస్యలపై నిలదీస్తాం
బుధవారం నుంచి అసెంబ్లీకి హాజరై తమకు ఎంత సమయమిస్తే అందులోనే ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. మరింత సమయం తీసుకునైనా కోట్లాదిమంది ప్రజలకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతామన్నారు. ఇప్పటికే విద్యుత్, రైతులు, డ్వాక్రా మహిళల రుణమాఫీ అంశాలు అయిపోయాయని, వాటిపై జరిగిన చర్చ కూడా అంతంత మాత్రమేనని ఆయన అన్నారు. తమను సభలో పూర్తిగా మాట్లాడనీయలేదన్నారు. ఇవన్నీ ప్రజలకు అవసరమైన విషయాలే కనుక సమావేశాలు పూర్తయ్యేలోపు మళ్లీ ఈ అంశాలపై నిలదీస్తామని జగన్ ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పట్టిసీమ ప్రాజెక్టు సందర్శనకు కూడా వెళతామని, కాకుంటే ఒక రోజు ఆలస్యం కావచ్చని ఆయన మరో ప్రశ్నకు జవాబుగా తెలిపారు.
చంద్రబాబువి అబద్ధాలు..
థర్మల్ విద్యుత్ కేంద్రాల ‘ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్’(పీఎల్‌ఎఫ్) విషయంలో చంద్రబాబు శాసనసభలో అన్నీ అబద్ధాలే చెప్పారని, ఆయన వాస్తవాలను దాచిపెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని జగన్ విమర్శించారు. తాను అసెంబ్లీలో ఏం మాట్లాడినా తగిన రుజువులు, అధీకృతపత్రాలు(డాక్యుమెంట్లు) దగ్గర ఉంచుకునే ప్రసంగిస్తానని జగన్ చెబుతూ.. తాను తొలి బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడేటపుడు ‘పవర్ డెవలప్‌మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్-స్టాటిస్టిక్స్ 2011-12’ పుస్తకంలోని అంశాల్నే ఉటంకించానని తెలిపారు. ఆ పుస్తకంలోని పేజీ నంబర్ 68లో పీఎల్‌ఎఫ్‌కు సంబంధించి ఉన్న అంశాలను ఆయన వివరిస్తూ.. ‘‘2003-04 సంవత్సరంలో రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలన్నింటి పీఎల్‌ఎఫ్ 86 శాతం ఉంటే 2004-05 సంవత్సరంలో అది 89.7 శాతానికి పెరిగింది. 2006-07లో 84.95 శాతం, 2007-08లో 85 శాతం, 2009-10లో 86.66 శాతం, 2010-11లో 79.46 శాతం, 2011-12లో 83.81 శాతం మేరకు పీఎల్‌ఎఫ్ ఉండింది. ఈ వాస్తవాలన్నింటినీ చంద్రబాబు దాచిపెట్టారు’’ అని జగన్ విమర్శించారు. ఎక్కడో ఓ చిన్న ఉదంతాన్ని తీసుకుని అన్ని స్టేషన్లలోనూ అదే పరిస్థితి ఉండేదని చంద్రబాబు మసిపూసి మారేడుకాయ చేస్తారని, దీన్నే వందసార్లు గోబెల్స్ ప్రచారం చేసి నిజమని నమ్మించే యత్నం చేస్తారని ఆయన విమర్శించారు.