టీడీపీ జిల్లా అధ్యక్షుడిని అడ్డుకుంటున్న విద్యార్థి, ప్రజా సంఘాల నాయకులు
సాక్షి, కర్నూలు : రాజధాని విషయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రీ కృష్ణ కమిటీ నివేదికలను తుంగలో తొక్కి రాయలసీమకు తీరని ద్రోహం చేశారని పలు విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు ధ్వజమెత్తారు. కర్నూలును రాజధానిగా ప్రకటించి, రాయలసీమలో హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లును అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థి, ప్రజా సంఘాల నేతలు, పోలీసుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కార్యక్రమంలో ఆర్‌యూ జేఏసీ నాయకుడు శ్రీరాములు, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ,మైనారిటీ విద్యార్థి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కే రామకృష్ణ, ట్రైబల్ స్టూడెంట్స్ ఫెడ రేషన్ జిల్లా అధ్యక్షుడు ఆర్ చంద్రప్ప, బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి వీ. భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వారు మాట్లాడుతు శ్రీభాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధాని, రాయలసీమలో హైకోర్టు ఏర్పాటుపై టీడీపీ నేతలు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారన్నారు. ఇటీవల టీడీపీ జిల్లా అధ్యక్షుడు రాజధాని మారిస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాజధాని, హైకోర్టుకు సంబంధించి రాయలసీమ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలు టీడీపీ నేతలకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఆయా సంఘాల నాయకులు వీవీ నాయుడు, బీ రంగమునినాయుడు, రాజునాయుడు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment