జిల్లాలో ప్రతి ఇంట ఎల్‌ఈడీ దీపాలు కాంతులీననున్నాయి. ప్రపంచ బ్యాంక్ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగాన్ని
విజయనగరం మున్సిపాలిటీ: జిల్లాలో ప్రతి ఇంట ఎల్‌ఈడీ దీపాలు కాంతులీననున్నాయి. ప్రపంచ బ్యాంక్ సహకారంతో కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ వినియోగాన్ని తగ్గించడంలో భాగంగా ఎల్‌ఈడీ దీపాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు విద్యుత్ శాఖ నేతృత్వంలో ప్రతి ఇంటికీ రెండు ఎల్‌ఈడీ దీపాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు ఏపీఈపీడీసీఎల్ వియనగరం ఆపరేషన్ సర్కిల్ అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకున్న ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) సంస్థ ఆధ్వర్యంలో ఈ బల్బులను పంపిణీ చేయనున్నారు.
గృహావసర విద్యుత్‌సర్వీసులకే ఎల్‌ఈడీ దీపాలు
ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో ఉన్న గృహావసర విద్యుత్ సర్వీసులు 5 లక్షల 8వేల 530 సర్వీసులకు మాత్రమే రాయితీపై ఎల్‌ఈడీ దీపాలు పంపిణీ చేయనున్నారు. ఇందుకు గాను ప్రతి సర్వీసుకు సంబంధించిన వినియోగదారుడు తమ ఆధార్, విద్యుత్ బిల్లుతో పాటు రెండు పాత విద్యుత్ దీపాలను అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. గ్రామ స్థాయిలో పంపిణీ కార్యక్రమం చేపట్టినపుడు 7 వాట్‌ల ఎల్‌ఈడీలు బల్బులను ఒక్కొక్కరికి రెండేసి చొప్పున రూ.20కే అందజేస్తారు. ఎల్‌ఈడీ దీపాల వినియోగం ద్వారా ప్రస్తుతం వినియోగిస్తున్న విద్యుత్‌తో పోల్చుకుంటే 1/3వ వంతు విద్యుత్‌ను ఆదా చేయవచ్చని విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ జి.చిరంజీవిరావు తెలిపారు.