
చూడ్డానికి సైకిల్.. వాడ్డానికి బైక్..
చూడగానే తెలిసిపోతోందిగా ఇదో సైకిల్. పేరు డెన్నీ.. దీని స్పెషాలిటీ ఏమిటంటే.. పేరుకు సైకిలే అయినా.. ఇందులో ఉన్నవన్నీ బైక్ ఫీచర్సే. ఈ సైకిల్‌కు తాళం వేయాలి.. లేదంటే పోతుంది అన్న బెంగ లేదు. ఎందుకంటే.. చతురస్రాకారంలో ఉండే దీని హ్యాండిల్ బార్‌నే లాక్ కింద వాడుకోవచ్చు. సునాయాసంగా తొక్కేందుకు వీలుగా ఆటోమేటిక్ గేర్ షిఫ్టర్‌తోపాటు ఎత్తై ప్రదేశాలకు అలుపు లేకుండా వెళ్లేందుకు.. ఇందులో ఎలక్ట్రిక్ మోటారు సదుపాయమూ ఉంది.
ఇక డెన్నీకున్న ఎల్‌ఈడీ లైట్లు రాత్రి వేళల్లో రోడ్లను కాంతివంతం చేస్తాయి. అంతేకాదు.. వీటిని మనం ఆన్ చేయాల్సిన పనిలేదు. చీకటి పడగానే.. అవే వెలుగుతాయి. దీంతోపాటు బైక్ తరహాలో ఈ సైకిల్ వెనకున్న లైటు బ్రేక్ వేసినప్పుడు వెలుగుతుంది. కుడి లేదా ఎడమ వైపునకు తిరిగినప్పుడు ఆ వైపున ఉండే ఇండికేటర్లు బైక్ తరహాలో బ్లింక్ అవుతూ.. సిగ్నల్ ఇస్తాయి. ఈ సైకిల్‌ను అమెరికాకు చెందిన టీగ్, సైజ్‌మోర్ సంస్థలు తయారుచేశాయి. వచ్చే ఏడాది మార్కెట్లోకి రానుంది. ధర ఇంకా ప్రకటించలేదు.