అన్ని పంచాయతీలకు ఎల్‌ఈడీ బల్బులు | LED lights to gram panchayats in short period, says grandhi bhavani prasad | Sakshi
Sakshi News home page

అన్ని పంచాయతీలకు ఎల్‌ఈడీ బల్బులు

Published Wed, Aug 26 2015 7:17 PM | Last Updated on Sun, Sep 3 2017 8:10 AM

LED lights to gram panchayats in short period, says grandhi bhavani prasad

-ఏపీఈఆర్‌సీ చైర్మన్ గ్రంధి భవానీప్రసాద్

చల్లపల్లి (కృష్ణా జిల్లా): రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు త్వరలో వీధి దీపాల ఏర్పాటు కోసం ఎల్‌ఈడీ బల్బుల పంపిణీకి చర్యలు తీసుకోనున్నట్టు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) చైర్మన్ గ్రంధి భవానీప్రసాద్ చెప్పారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో బుధవారం ఎల్‌ఈడీ బల్బుల రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే తొలిదశలో కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామని, రెండోదశలో భాగంగా త్వరలో రాష్ట్రంలోని అన్ని గ్రామపంచాయతీలకు ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తామని చెప్పారు. దీనివల్ల పెద్ద ఎత్తున విద్యుత్ ఆదా అవుతుందన్నారు. వ్యవసాయ విద్యుత్‌ను రాత్రివేళ తొలగించి పూర్తిగా పగటివేళ సరఫరా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. హుదూద్ తుపాను సందర్భంగా విశాఖపట్నంలో రికార్డు సమయంలో విద్యుత్‌ని పునరుద్ధరించడం ద్వారా ప్రపంచ స్థాయిలో గొప్ప ఘనత సాధించామన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్ ఆదా చేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామన్నారు.

ఇందులో భాగంగానే తొలి విడతలో మూడు జిల్లాల్లో 57 లక్షల ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయగా వీటివల్ల 349 మెగావాట్ల విద్యుత్‌ని ఆదా చేయగలిగామని చెప్పారు. రెండో విడతలో ఐదు జిల్లాల్లో 75.18 లక్షల ఎల్‌ఈడీ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. మూడో విడతలో మరో నాలుగు జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రులు కామినేని శ్రీనివాస్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సమర్థవంతమైన విద్యుత్ సరఫరా చేయడంతో పాటు ఆదాలో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా ఉంచేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. ఎల్‌ఈడీ బల్బుల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును ఆదా చేసుకోవాలని వినియోగదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దె అనూరాధ, మాజీ ఎమ్మెల్యే అంబటి శ్రీహరిప్రసాద్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement