ఏపీ విద్యుత్‌ను వదులుకుందాం! | Let's give up AP power! | Sakshi
Sakshi News home page

ఏపీ విద్యుత్‌ను వదులుకుందాం!

Published Mon, May 22 2017 1:52 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM

ఏపీ విద్యుత్‌ను వదులుకుందాం! - Sakshi

ఏపీ విద్యుత్‌ను వదులుకుందాం!

► మరో 2,000 మెగావాట్ల విద్యుత్‌ ఒప్పందాలు కూడా..
► భారంగా మారిన పీపీఏలను వదులుకోవాలని సర్కార్‌ నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌:
భారంగా మారిన ప్రైవేటు విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను వదులుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. దాదాపు రెండున్నరేళ్లుగా స్వల్ప కాలిక ఒప్పందాల ద్వారా కొనుగోలు చేస్తున్న సుమారు 2 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఈ నెలాఖరుతో వదులుకోనుంది. ఈనెల 26తో ముగిసిపోనున్న ఈ ఒప్పందాల కాలపరిమి తిని పొడిగించకూడదని నిర్ణ యం తీసుకుంది. ఏపీ జెన్‌కో నుంచి అధిక ధరతో కొనుగోలు చేస్తున్న 2 వేల మెగావాట్ల థర్మల్‌ విద్యుత్‌ను సైతం వదులుకోవాలని, తెలంగాణ జెన్‌కో నుంచి ఏపీకి విక్రయిస్తున్న తక్కువ ధర విద్యుత్‌ను నిలుపుదల చేయాలని యోచిస్తోంది. భూపాలపల్లిలో జెన్‌కో నిర్మించిన 600 మెగావాట్ల కేటీపీపీ థర్మల్‌ ప్లాంట్‌తోపాటు 1,200 మెగావాట్ల సింగరేణి థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్లు అందుబాటులోకి రావడం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోళ్లు ప్రారంభం కావడంతో ప్రస్తుతం రాష్ట్రంలో భారీగా విద్యుత్‌ మిగిలి పోతోంది. విద్యుత్‌ కొనుగోలు చేయక పోయినా విద్యుత్‌ ఒప్పందాల్లోని నిబంధనల ప్రకారం విద్యుదుత్పత్తి కంపెనీలకు పెనాల్టీలు/స్థిర చార్జీల రూపంలో రూ.వందల కోట్లను చెల్లించక తప్పడం లేదు. దీంతో డిస్కంలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది.

విద్యుత్‌ పంపకాలకు మంగళం
విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర జెన్‌కో విద్యుత్‌ కేంద్రాల్లో తెలంగాణకు 56.89 శాతం, ఏపీకి 43.11 శాతం విద్యుత్‌ వాటాలున్నాయి. ఇరురాష్ట్రాల మధ్య జరుగుతున్న పరస్పర విద్యుత్‌ పంపకాల ద్వారా తెలంగాణకు అదనంగా 450 మెగావాట్ల విద్యుత్‌ వస్తోంది. అయితే ఏపీ నుంచి తెలంగాణకు సరఫరా అవుతున్న విద్యుత్‌ ధర సగటున యూనిట్‌కు రూ.4.06 నుంచి రూ.10.77 వరకు ఉండగా, అదే తెలంగాణ నుంచి ఏపీకి సరఫరా అవుతున్న విద్యుత్‌ ధర కేవలం రూ.3.14 నుంచి రూ.5.19 మాత్రమే ఉంది. దీంతో ఏపీ విద్యుత్‌ రాష్ట్రానికి భారంగా మారింది.

మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌
ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోళ్లు ప్రారంభం కాగా, వచ్చే సెప్టెంబర్‌ నుంచి మరో 1,000 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసేందుకు త్వరలో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలంగాణ ట్రాన్స్‌కో వర్గాలు తెలిపాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement