బాధితులంతా డిశ్చార్జ్‌  | LG Polymers Victims Discharged From Hospital | Sakshi
Sakshi News home page

బాధితులంతా డిశ్చార్జ్‌ 

Published Fri, May 15 2020 5:51 AM | Last Updated on Fri, May 15 2020 5:51 AM

LG Polymers Victims Discharged From Hospital - Sakshi

సాక్షి, విశాఖపట్నం: ఎల్‌జీ పాలిమర్స్‌ కంపెనీలో వెలువడిన స్టైరీన్‌ గ్యాస్‌ ప్రభావానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులందరూ పూర్తిగా కోలుకున్నారు. బుధ, గురువారాల్లో మొత్తం 300 మందికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందించి వైద్యులు డిశ్చార్జ్‌ చేశారు.   
► కేజీహెచ్‌లో చేరిన 321 మందిలో 21 మందికి ఆరోగ్యం నయమవడంతో రెండు రోజుల క్రితమే వైద్యులు ఇంటికి పంపించారు. మిగిలిన 300 మందిలో 287 మందికి బుధవారం రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను ఇచ్చి డిశ్చార్జ్‌ చేశారు.  
► బాధితులు గ్రామాలకు వెళ్లడానికి భయపడే అవకాశాలు ఉండడంతో అధికారులు గోపాలపట్నంలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. డిశ్చార్జ్‌ అయిన వారిని ప్రత్యేక బస్సులలో అక్కడికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.  
► బుధవారం రాత్రికి 180 మంది ఆ కేంద్రాలకు వెళితే.. మిగిలిన 107 మంది వారి సొంత వాహనాలలో ఇళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన 13 మంది కూడా గురువారం రూ.లక్ష చెక్కు తీసుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అధికారులు వీరిని బస్సులో పునరావాస కేంద్రానికి తరలించారు.  
► గ్రామాల్లో ప్రస్తుతం స్టైరీన్‌ అవశేషాలు పూర్తిగా తొలగిపోవడంతో పునరావాస కేంద్రాల్లో 42 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన వారంతా ఇళ్లకు వెళ్లిపోయారు.

ఏ ఆరోగ్య సమస్య వచ్చినా చికిత్స అందిస్తాం 
ప్రమాదానికి గురైన మొత్తం బాధితులందరూ గురువారం నాటికి డిశ్చార్జ్‌ అయిపోయారు. ఎవరికైనా ఏ చిన్న పాటి ఆరోగ్య సమస్య వచ్చినా గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాల్లో చికిత్స అందిస్తారు. గతంలో డిశ్చార్జ్‌ అయిన వాళ్లు నేరుగా కేజీహెచ్‌కు వచ్చినా చికిత్స అందిస్తాం. – అర్జున, కేజీహెచ్‌ సూపరింటెండెంట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement