ఎల్జీ పాలీమర్స్ ఘటనలో హుటాహుటిన స్పందించిన వైఎస్సార్‌సీపీ సర్కారు
ప్రజాప్రతినిధులందరూ బాధితుల చెంతనే..
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గతంలో విశాఖ ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువు లీకేజీ ఘటనలో నాటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందించిన తీరుకు.. నేడు ఎసైన్షియా ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలిన దుర్ఘటన తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం స్పందించిన తీరుకూ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
నాడు ఎల్జీ పాలిమర్స్‌లో విషవాయువులు (స్టైరిన్ గ్యాస్) లీకైన సంఘటన 2020 మే 7వ తేదీ వేకువజామున 3.40 గంటలకు జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే తెల్లవారుజామున 5 గంటలకు కలెక్టరు, పోలీస్ కమిషనర్, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
» 6 గంటలకు అప్పటి ప్రజాప్రతినిధులు ముత్తంశెట్టి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్ తదితర నేతలు సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
» వేకువజాము నుంచే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించడంతో పాటు సీఎంగా ఉన్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి 11 గంటలకే ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకున్నారు.
» ఆ రోజుల్లో కోవిడ్ కేసులు భారీగా ఉండి.. బహిరంగంగా తిరిగేందుకు ఆందోళన చెందుతున్న పరిస్థితులున్నాయి. అయినా, కేజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించి నష్టపరిహారంగా రూ.కోటి ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
» ఆ తర్వాత బాధితులను గుర్తించి ప్రకటించిన నష్టపరిహారం అందించారు. అంతేకాక.. మూడ్రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన వారికి రూ.10 లక్షలు, చికిత్స పొంది వెంటనే డిశ్చార్జి అయిన వారికి రూ.లక్ష ప్రకటించారు. ప్రమాదం జరిగిన మరుసటి రోజే రూ.30 కోట్ల నిధులను విడుదల చేశారు.
» విషవాయువులు వ్యాపించిన నేపథ్యంలో ప్రతీ కుటుంబ సభ్యుడికి రూ.10 వేల చొప్పున ఐదు గ్రామాల ప్రజలకు అందజేశారు.
» నెలరోజులుభోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. 10 రోజుల పాటు 29 పునరావాస కేంద్రాల్లో 20 వేల మందికి వసతి కల్పించారు.
» విష వాయువుల ప్రభావంలేదని ప్రకటించినప్పటికీ ఇంకా ప్రజల్లో భయాలు నెలకొనడంతో వారిలో భరోసా నింపేందుకు వీలుగా ప్రజాప్రతినిధులైన ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, కృష్ణదాస్, ముత్తంశెట్టి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యే అదీప్‌రాజ్, తిప్పల నాగిరెడ్డి తదితరులు రాత్రి సమయాల్లో నిద్రించి ప్రజలకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు.
» ఏకంగా డీజీపీ స్థాయి అధికారి వచ్చి సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మూడునెలల పాటు హెల్త్ క్యాంపులూ నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment