
‘ప్రాణమున్నా...బొమ్మే’ కథనానికి స్పందన
పాలకొండ గురువుగారివీధికి చెందిన సోమరిపేట శ్రీను కుటుంబానికి రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పాలూరి సిద్దార్థ
పాలకొండ రూరల్: పాలకొండ గురువుగారివీధికి చెందిన సోమరిపేట శ్రీను కుటుంబానికి రేగిడి మండలం వావిలవలస గ్రామానికి చెందిన ప్రముఖ సామాజిక కార్యకర్త పాలూరి సిద్దార్థ అండగా నిలిచారు. ‘ప్రాణమున్నా...బొమ్మే’ శీర్షికన సాక్షిలో ప్రచురితమైన మానవీయ కథనానికి ఆయన స్పందించారు. బుధవారం శ్రీను కుటుంబాన్ని పరామర్శించారు. సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీను కుటుంబానికి దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు. శ్రీను చెల్లెలు జ్యోతి పదో తరగతి చదువుతున్నందున చదువు కోసం తక్షణ సాయంగా రూ.2 వేలు అందజేశారు. ఇకపై ఆమె చదువుకు అయ్యే ఖర్చంతా భరిస్తానని హామీ ఇచ్చారు. శ్రీను ఆపరేషన్ ఖర్చు కోసం ప్రభుత్వంతో పోరాడుతానని సిద్ధార్థ తెలిపారు. సేవా కార్యక్రమాల్లో ముందుండే సిద్ధార్థను పలువురు అభినందించారు. శ్రీనును ఆదుకునేందుకు మరికొంతమంది ముందుకు రావాలని స్థానికులు కోరుతున్నారు.