కొత్తగూడెం, న్యూస్‌లైన్ : నాటుసారాను అరికట్టాలంటే దాని తయారీకి అవసరమైన నల్లబెల్లాన్ని నిషేధించాలని యోచించిన ప్రభుత్వం.. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పల్లెల్లో ఇప్పటి వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించిన నాటుసారా వ్యాపారానికి ప్రభుత్వ నిర్ణయంతో నల్లబెల్లం కొరత ఏర్పడింది. దీంతో వ్యాపారులు అక్రమ రవాణాకు తెరలేపారు. నిషేధం మాటున అధిక ధరకు విక్రయిస్తున్నారు. బెల్లం రవాణాను అరికట్టేందుకు పోలీసులు నిఘా పెంచడంతో కొత్త దారులను వెదుకుతున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా ట్రాన్స్‌పోర్ట్ లారీలలో తరలిస్తున్నారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో ఇటీవల నిర్వహించిన దాడులలో ఈ విషయం వెలుగుచూసింది.
ట్రాన్స్‌పోర్ట్ లారీల్లో రవాణ..రైస్‌మిల్లుల్లో నిల్వ..
బెల్లం అక్రమ రవాణాకు మామూలు లారీలను ఉపయోగిస్తే మధ్యలో చెక్‌పోస్టుల బెడదతో పాటు పోలీస్ నిఘా ఎక్కువవుతుండడంతో వ్యాపారులు ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను ఎంచుకుంటున్నారు. గురువారం రాత్రి కొత్తగూడెం త్రీ టౌన్ పరిధిలో ఓ ట్రాన్స్‌పోర్టు వాహనంలో 300 క్వింటాళ్ల నల్లబెల్లం తరలిస్తుండగా పోలీసులు దాడిచేసి స్వాధీనం చేసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక అక్రమ బెల్లాన్ని నిల్వ చేసేందుకు కూడా రైస్ మిల్లులను ఎంపిక చేసుకుంటున్నారు. పాల్వంచలోని ఓ రైస్‌మిల్లులో బియ్యం బ స్తాల మధ్యన 20 క్వింటాళ్ల బెల్లాన్ని ఈనెల 5న పోలీసులు పట్టుకున్న విషయం విదితమే. ఇలా రకరకాల ఎత్తుగడలతో అక్రమార్కులు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.
అక్రమాలకు ఆజ్యం పోస్తున్న ఎక్సైజ్ అధికారులు...
నల్లబెల్లం తరలింపును అడ్డుకోవడంతోపాటు నాటుసారా తయారీని అరికట్టాల్సిన ఎక్సైజ్ అధికారులే ఈ బెల్లం విక్రయానికి అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పాల్వంచ ఎక్సైజ్ శాఖ ఇన్స్‌పెక్టర్‌తోపాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్లు అక్రమ నల్లబెల్లం వ్యాపారంలో బాధ్యులుగా తేలడంతో వారిపై కేసులు నమోదుయ్యాయి. అక్రమ వ్యాపారులకు ఎక్సైజ్ అధికారుల అండదండలు ఏ మేరకు ఉన్నాయో దీన్నిబట్టి తెలుస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నల్లబెల్లం అక్రమ రవాణాను అడ్డుకోవాలని, సారా తయారీని అరికట్టాలని పలువురు కోరుతున్నారు