చిట్టి తల్లికి పెద్ద కష్టం | Little girl genetic disease in Eluru | Sakshi
Sakshi News home page

చిట్టి తల్లికి పెద్ద కష్టం

Published Sun, Jan 4 2015 1:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:10 PM

చిట్టి తల్లికి పెద్ద కష్టం

చిట్టి తల్లికి పెద్ద కష్టం

 ఏలూరు (ఆర్‌ఆర్ పేట) : ఆ చిట్టి గుండెకు పెద్ద కష్టం వచ్చిపడింది. రెక్కాడితే గాని డొక్కాడని ఆ కుటుంబాన్ని పాతాళంలోకి నెట్టేస్తోంది. జన్యు సంబంధిత వ్యాధితో ఓ చిన్నారి విలవిలలాడుతుంటే.. వైద్యం చేయించేందుకు ఆర్థిక స్థోమత లేక తల్లిదండ్రులు అల్లాడుతున్నారు. ఏలూరు 2వ డివిజన్‌లోని ఎమ్మార్సీ గోడౌన్స్ వెనుక కాలువ గట్టుపై నివశిస్తున్న బి.ప్రసాద్ తాపీ పని చేస్తుంటాడు. భార్య దివ్య. వారికి పది నెలల క్రితం కెజియా అనే అమ్మాయి పుట్టింది. నాలుగు నెలల వరకూ అందరి పిల్లల్లానే ఎదిగిన కెజియా 5వ నెలలో విరోచనాల బారిన పడింది. నగరంలోని చిన్నపిల్లల ప్రత్యేక వైద్య నిపుణులు పరీక్షించి మందులిచ్చినా నయం కాలేదు.
 
 దీంతో తల్లిదండ్రులు కార్పొరేట్ ఆసుపత్రిని ఆశ్రయించారు. అక్కడ అన్ని రకాల పరీక్షలు చేసిన వైద్యులు కెజియా జన్యు సంబంధిత వ్యాధికి గురైందని గుర్తించారు. హైదరాబాద్ నిమ్స్‌కు తీసుకువెళ్లమని సూచించారు. గంపెడాశతో నిమ్స్‌కు తీసుకువెళ్లిన తల్లిదండ్రులకు వ్యాధి విషయం తెలిసింది. మ్యుకోపోలిసచ్చారిడోసిస్ (ఎంపీఎస్) అనే జన్యు సంబంధ వ్యాధితో చిన్నారి బాధపడుతోందని నిమ్స్ వైద్యులు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా ఎముకల్లో ఎదుగుదల నిలిచిపోతుందని, మంచి రక్తం వెళ్లాల్సిన నాళాల్లోకి చెడు రక్తం ప్రవేశించి ఆరోగ్యం క్షీణింపజేస్తోందని, వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతోందని డాక్టర్లు చెప్పారు. ఎంజైమ్ రీప్లేస్‌మెంట్ థెరపీ (ఈఆర్‌టీ)తో వ్యాధిని నయం చేయవచ్చని ఇందుకు సుమారు రూ.24 లక్షలు ఖర్చవుతుందన్నారు.
 
 దీంతో తల్లిదండ్రుల గుండెల్లో రాయిపడినంత పనైంది. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నదంతా కూడబెట్టి పాప వైద్యానికి వారు శ్రమిస్తున్నారు. ఇంజెక్షన్ల కోసం వారానికి రూ.60 వేల ఖర్చవుతోందని.. ఇక తమకు వైద్యం చేయించే స్థోమత లేదని ప్రసాద్ కన్నీరుపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సాయం కోసం స్థానిక ఎమ్మెల్యే ద్వారా దరఖాస్తు చేసి మూడు నెలలు కావస్తున్నా ప్రయోజనం లేదని చెప్పారు. కూలి పనులకు వెళితే గాని పూడగడవని పరిస్థితిలో ఉన్నామని.. చిన్నారి వైద్యం కోసం దాతలు ముందుకు రావాలని అభ్యర్థిస్తున్నారు. దయగల దాతలు సెల్ 92472 61461లో సంప్రదించాలని ప్రసాద్, దివ్య కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement