విజయనగరం రూరల్, న్యూస్‌లైన్: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు కొత్త భవనాల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరైనా ఫలితం లేకపోయింది. సకాలంలో భవన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో నిధులన్నీ వెనక్కి మళ్లిపోయాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు శిథిల భవనాలకు మరమ్మతులతో సరిపెడుతుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎక్సైజ్‌శాఖ డిప్యూటీ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ కార్యాలయాలు, ఎక్సైజ్‌స్టేషన్లు కొన్ని అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, మరికొన్ని శిథిల భవనాల్లోనే కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. విజయనగరం రూరల్, పట్టణ ఎక్సైజ్ స్టేషన్ కార్యాలయాలు శిథిలావస్థకు చేరిన భవనాల్లోనే కొనసాగుతున్నాయి. వీటితోపాటు టాస్స్‌ఫోర్స్ సూపరింటెండెంట్ కార్యాలయం భవనం ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. దీంతో సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విధులు నిర్వహిస్తున్నారు.
గతంలో కురిసిన వర్షాలకు స్టేషన్ పైకప్పు నానిపోయి కూలిపోయింది. ఆ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్టేషన్ ముందు భాగం పెంకులు ఎప్పటికప్పుడు ఊడిపోయి సిబ్బందిపై పడుతున్నాయి.
టాస్క్‌ఫోర్స్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాన్ని పాకలో కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త భవనాలు నిర్మించేందుకు 2012లో 1.6 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. పనులను 2013లో ప్రారంభించాల్సి ఉన్నా పట్టించుకోలేదు. దీంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయి. కోట్ల రూపాయల నిధులు మంజూరైనా నిర్మాణాలు చేపట్టకుండా ఇప్పుడు కార్యాలయాలకు మరమ్మతులు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.
నిధులొచ్చినా వదిలేశారు..!
Published Thu, Feb 20 2014 2:28 AM | Last Updated on Sat, Sep 2 2017 3:52 AM
Advertisement