నల్లగొండ, న్యూస్‌లైన్: స్థానిక సంస్థల సమరానికి రంగం సిద్ధమైంది. గురువారం జెడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లు ప్రకటించగా, శనివారం ఎంపీపీ స్థానాలకు సంబంధించిన రిజర్వేషన్ల జాబితాను కలెక్టర్ టి. చిరంజీవులు, జిల్లా పరిషత్ సీఈఓ దామోదర్‌రెడ్డి అధికారికంగా విడుదల చేశారు. మొత్తం 59 ఎంపీపీ స్థానాలకుగాను జనరల్ 31, మహిళలకు 28 స్థానాలు కేటాయించారు. వీటిలో ఎస్టీలు-7, ఎస్సీలు-10, బీసీలు-23, జనరల్-19 స్థానాలను రిజర్వు చేశారు. కాగా రిజర్వేష న్ల తంతు పూర్తికావడంతో ప్రస్తుతం ఓటర్ల జాబితాను రూపొందించే పనిలో యంత్రాంగం తలమునకలైంది.
గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితాను ఆధారంగా చేసుకుని స్థానిక ఓటర్ల జాబితాను తయారు చేస్తున్నారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల వారీగా వేర్వేరుగా ఓటర్ల జాబి తాను సిద్ధం చేస్తున్నట్లు సీఈఓ తెలిపారు. సోమవారం ఈ జాబితాను మండలాల్లో ప్రచురిస్తామని ఆయన పేర్కొన్నారు. అదే రోజున ఎన్నికల కమిషన్ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ జారీ చేయనుంది. ఏప్రిల్ 6న పోలింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్, సీఈఓ శనివారం వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఆదివారం ఓటరు నమోదు కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఓటుహక్కు నమోదు చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఓటరు జాబితాలో నమోదు కాని వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
గిరిజనులకే జెడ్పీ పీఠం..
జిల్లా పరిషత్ చైర్మన్ స్థానాన్ని ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. తొలిసారిగా గిరిజనులకు జెడ్పీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం లభించింది. 1958లో జిల్లా పరిషత్ పాలన ప్రారంభంకాగా తొలిసారిగా జీఎస్ రెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి 2000 సంవత్సరం వరకు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే జెడ్పీ స్థానం రిజర్వు అయ్యింది. 2001లో బీసీ మహిళలకు కేటాయించగా వేమవరపు ప్రసన్న చైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఆమె అకాల మరణం తర్వాత కీతా లక్ష్మమ్మను చైర్మన్‌గా ఎన్నుకున్నారు. మళ్లీ 2006లో జరిగిన ఎన్నికల్లో జెడ్పీ స్థానం జనరల్‌కు రిజర్వు కావడంతో కసిరెడ్డి నారాయణరెడ్డి చైర్మన్‌గా ఎన్నికయ్యారు.
మొత్తం జెడ్పీ పరిపాలనలో బీసీలకు ఒకసారి అవకాశం రాగా, తొలిసారిగా ఎస్టీలకు కేటాయించారు. కాగా 59 జెడ్పీటీసీ స్థానాల్లో ఎస్టీలకు 7 కేటాయించగా వాటిల్లో మహిళలకు 4, జనరల్‌కు 3 స్థానాలు రిజర్వు చేశారు. జనరల్ స్థానాలు చిలుకూరు, చింతపల్లి, నూతనకల్ మండలాలు కాగా, మహిళలకు కోదాడ, నేరేడుచర్ల, సూర్యాపేట, తుంగతుర్తి మండలాలు కేటాయించారు. ఈ మండలాల్లో గెలుపొందిన జెడ్పీటీసీ అభ్యర్థులనే చైర్మన్ స్థానం వరించనుంది.
ఎంపీపీ స్థానాలకు
హోరాహోరీ పోరు..
17 చోట్ల ఎంపీపీ స్థానాలకు అభ్యర్థుల మధ్య పోటీ రసవత్తరంగా మారనుంది.
ప్రధానంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన స్థానాలు, జనరల్ మహిళలకు కేటాయించిన స్థానాల్లో ఈ పోటీ తీవ్రంగా ఉండబోతుంది.
బొమ్మలరామారం, చందంపేట, చింతపల్లి, గరిడేపల్లి, హుజూర్‌నగర్, కనగల్, కేతేపల్లి, మఠంపల్లి, మోతె, మునుగోడు, నిడమనూ రు, నూతనకల్, పెన్‌పహాడ్, శాలి గౌరారం, తుంగతుర్తి, తుర్కపల్లి, వలిగొండ ఎంపీపీ స్థానాలకు హోరాహోరీ పోరు జరగనుంది.
అదేలాగంటే ఉదాహరణకు మోతె ఎంపీపీ స్థానం ఎస్టీ జనరల్‌కు కేటాయించారు. ఈ మండలంలో రాఘవాపురం ఎంపీటీసీ స్థానం మాత్రమే ఎస్టీ జనరల్‌కు రిజర్వు చేశారు. ఎస్టీ కోటాలో మహిళలకు కూడా రెండు స్థానాలు కేటాయిం చడంతో ఈ మండలంలో ఎంపీపీ స్థానం కోసం త్రిముఖ పోటీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి.
అదేవిధంగా శాలిగౌరారం ఎంపీపీ స్థానం జనరల్ మహిళలకు కేటాయించారు. ఈ మండలంలో మన్నెమద్దె ఎంపీటీసీ స్థానం జనరల్ మహిళలకు రిజర్వు అయ్యింది. దీంతో మిగతా కేటగిరీలకు చెందిన అభ్యర్థులు సైతం ఎంపీపీ స్థానం కోసం పోటీ అవకాశం ఉంది.
ఇలాంటి సమస్యలే మిగతా 15 చోట్ల ఉత్పన్నమయ్యే సూచనలు ఉన్నాయి.
దీని వల్ల ఎంపీపీ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా మారనుంది.
పరిషత్‌ల్లోనూ పోరు
Published Sun, Mar 9 2014 3:58 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement