డోన్‌టౌన్, న్యూస్‌లైన్ : గ్రానైట్ క్వారీ నుంచి రాళ్లను తరలిస్తున్న ఓ లారీని ఆదివారం అర్ధరాత్రి జాతీయ రహదారిపై తగులబెట్టిన ఘటన డోన్‌లో కలకలం రే పింది. ఆదోని క్వారీ నుంచి కృష్ణగిరి, చనుగొండ్ల, ఇందిరాంపల్లెలో ఉన్న గ్రానైట్ క్వారీల నుంచి నిత్యం టన్నుల కొద్ది గ్రానైట్ తరలిపోతోంది. అయితే వీటి రవాణా విషయంలో ఆధిపత్యం చాటుకోవడం కోసం టీడీపీ నాయకుడు కేశన్న, తాడిపత్రికి చెందిన ట్రాన్స్‌పోర్టు యజమాని మధ్య వివాదపడుతున్నారు. ఇద్దరి మధ్య నెలకొన్న వివాదాగ్నికి ఆదివారం రాత్రి లారీ బుగ్గిగా మారింది. ఓబులాపురం మిట్ట వద్ద ఎమ్మార్పీఎస్ నాయకులు బొలెరో క్యాబ్‌లో వచ్చి లారీని అడ్డుకున్నట్లు డ్రైవర్ ప్రతాప్‌రెడ్డి తెలిపారు. సెల్‌ఫోన్‌లను లాక్కోవడంతోపాటు టైర్లలో గాలితీశారన్నారు. చితకబాదడడంతో పారిపోయినట్లు తెలిపాడు.
అనంతరం డీజిల్‌ట్యాంకును పగులగొట్టి లారీకి నిప్పు పెట్టారని ఆరోపించాడు. అయితే గ్రానైట్ తరలిస్తుంటే అడ్డుకుని చెక్ పోస్టు అధికారి వెంకటయ్య, మీడియాకు సమాచారం అందించాము తప్పితే మిగతా విషయాలు తమకు తెలియవని ఎమ్మార్పీఎస్ నాయకులు గంధం శ్రీనివాసు, మరికొందరు తెలిపారు. యాజమాన్యమే ఈ పని చేసి నింద తమపై మోపుతోందని ఆరోపించారు. లారీని ఎవరు తగులబెట్టారనే విషయంపై స్పష్టత రాలేదు. ఇందుకు సంబంధించి లారీ యజమాని సుబ్బారావు ఫిర్యాదు మేరకు టీడీపీ నాయకుడు టీ.ఈ. కేశన్నగౌడ్, ఉంగరానిగుండ్ల సర్పంచ్ రాముడు, ఎమ్మార్పీఎస్ నాయకుడు గంధం శ్రీనివాస్, క్యాబ్ డ్రైవర్ బాషా, ఈడిగె గోపాలు, సుధాకర్, ముజాఫర్, రంగన్న, మరొకరిపై కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్‌ఐ శ్రీధర్ తెలిపారు.