ఆదోని : కర్నూలు జిల్లా ఆదోనిలో వేరుశనగ విత్తనాల లోడుతో ఉన్న లారీని దొంగలు రాత్రికి రాత్రి మాయం చేశారు. లారీ డ్రైవర్ మహబూబ్ పాషా తన లారీ(ఏపీ21ఎక్స్4226)లో రూ.12.5 లక్షల విలువైన వేరుశనగ విత్తనాలను సోమవారం రాత్రి స్థానిక మార్కెట్ యార్డ్‌లో లోడింగ్ చేసుకున్నాడు. ఈ సరుకు వ్యాపారి కె.మల్లికార్జునకు చెందినది.
గమ్యానికి తీసుకెళ్లే ముందు మహబూబ్‌పాషా లారీని ఆస్పరి రోడ్డులోని తన ఇంటి ముందు నిలిపి రాత్రికి ఇంట్లో నిద్రించాడు. మంగళవారం తెల్లవారుజామున లేచి చూసేసరికి లారీ కనిపించలేదు. దీనిపై వ్యాపారి కె.మల్లికార్జునకు సమాచారం ఇచ్చాడు. ఇద్దరూ కలసి ఆదోని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ శ్రీధర్ తెలిపారు.