నెల్లూరు(వేదాయపాళెం), న్యూస్‌లైన్ : ప్రేమ.. ఓ అనిర్వచనీయమైన అద్భుత కావ్యం, ప్రేమ.. ప్రేమను ప్రేమిస్తుంది. ప్రేమ.. ఓ రాగరంజిత రసానుబంధం. ప్రేమ అనే రెండక్షరాలు రెండు మనసులను దగ్గర చేస్తుంది. ప్రేమించేదే హృదయం..తపించేదే జీవితం. జీవితం అంటేనే ప్రేమైక అనుభూతి. ప్రేమే మానవ పరమావధి.
ఒక్క యువతరానికే కాక వయోవృద్ధుడిని సైతం జవసత్వాలతో నడిపించే ఒక రసానుభూతి ప్రేమ. ప్రేమలేనిదే సృష్టి లేదు, జీవితం లేదు, మనిషి లేడు. అలాంటి ప్రేమకు చలించని వారే లేరు. ప్రేమికులకు ఎంతో ఇష్టమైన ఫిబ్రవరి 14 (ప్రేమికులరోజు) రానే వచ్చేసింది. ఈ రోజే ఒకరికి ఒకరు తమ ప్రేమను వ్యక్త పరుచుకుంటారు. అప్పటికే ప్రేమలో ఉండే వారు ప్రేమలోని తియ్యదనాన్ని ఆస్వాదిస్తారు. జిల్లా వ్యాప్తంగా ప్రేమికుల దినోత్సవాన్ని శుక్రవారం జరుపుకునేందుకు యువతరం సిద్ధమైంది.
కళాశాలలు, పార్కులు, సినిమాహాల్స్ వంటివి సందడిగా మారనున్నాయి. అయితే యువత ప్రేమలో పడినా దాన్ని అందమైన జీవితంగా మార్చుకోవాలని, అలా కాక ప్రేమ అనే ముసుగులో ఒకరిని మరొకరు మోసం చేసుకోని జీవితాలను నాశనం చేసుకోవద్దని పలువురు ప్రముఖులు కోరుతున్నారు.
ఆకట్టుకుంటున్న బహుమతులు
ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని వివిధ దుకాణాల్లో ప్రియుడు ప్రేయసికి, ప్రేయసి ప్రియునికి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన బహుమతులు ఆకట్టుకుంటున్నాయి. గ్రీటింగు కార్డులు, బొ మ్మలు, కీచైన్లు, బ్రాస్‌లెట్‌లు, వాచీలు టీషర్టులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ప్రత్యేకించి టీకప్పులపై ప్రియుని ఫొటో ముద్రించి ఇచ్చేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. గ్రీటింగు కార్డులు రూ.50 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. బహుమతులను రూ.150 నుంచి రూ.5వేల వరకు అందుబాటులో ఉంచారు. ప్రేమికులకు ప్రత్యేకమైంది రోజాలు. ఎరుపు రంగులోని గులాబీ పూలు ప్రేమకు చిహ్నాలు. దీంతో గులాబీలకు ఈ రోజు డిమాండ్ ఏర్పడుతుంది. గురువారం సాయంత్రమే నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజా పూలను బండ్లపై పెట్టి విక్రయిస్తున్నారు.
సినిమాల్లో చూపించేది ప్రేమకాదు :
మాది ప్రేమ వివాహం. తిరుపతిలో చదువుకునే సమయంలోనే ఇరువురికీ పరిచయం ఏర్పడింది. 1992లో ఒకరిని ఒకరం ఇష్టపడ్డాం. ఆరేళ్లు ప్రేమించుకున్నాం. 1998లో పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు మాకు ఇద్దరు పిల్లలు శ్రీలాస్య, శ్రీమయి. మేం చాలా హాయిగా ఉన్నాం. ఎలాంటి ఒడిదుడుకులు లేవు. నేటి యువతపై పూర్తిగా సినిమా ప్రభావం పడింది. సినిమాల్లో చూపించేదే ప్రేమగా భావించి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఒకర్ని ఒకరు ఇష్టపడాలంటే వారు రెండు విషయాల్లో పరిజ్ఞానులై ఉండాలి. ఆలోచించే వయసు, తమ కాళ్లపై తాము నిలబడగలిగి సంపాదించుకోవాలి. అలాగే ఇరువురి అభిరుచులు కూడా కలవాలి. అప్పుడు పెళ్లి చేసుకోవాలి. ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా పెళ్లి అయిన తర్వాత ఒక రోజు ఇరువురిలో ఎవరోకరు బాధపడక తప్పదు.
- డాక్టర్ శ్రీనివాసతేజ,
సైక్రియార్టిస్ట్, గౌరి,
అధ్యాపకురాలు
వందరెట్లు ప్రేమ పెరిగింది :
బెంగళూరులో నృత్య కళాకారిణిగా గుర్తింపు తెచ్చుకుంది నవ్య. నెల్లూరులోనూ డ్యాన్స్‌లో తనకంటూ ఓ పేరును సాధించాడు రమణ. 2004లో అనుకోకుండా ఒక రోజు బెంగళూరులో ఓ డ్యాన్స్ ప్రోగ్రామ్‌లో ఇరువురి గ్రూపులు పోటీపడ్డారు. అప్పుడు ఇరువురికీ పరిచయం ఏ ర్పడింది. కొన్ని రోజులు గడిచాక ఓ రోజు ఒకరి మనసులో భావాలు మ రొకరు పంచుకున్నారు. మూడేళ్ల పా టు వీరి ప్రేమ సాగింది.
2007లో వివాహం చేసుకుని ప్రస్తుతం తమ తల్లిదండ్రులతో కలిసి నగరంలోని బ్యాంక్ కాలనీలో ని వాసం ఉంటున్నారు. ఇద్దరూ డ్యాన్సర్లు కావడంతో వేదాయపాళెంలో స్టెప్‌అప్ డ్యాన్స్ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేసి యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ‘ప్రస్తు తం ప్రేమ అనేది నిర్లక్ష్యంగా మారుతోంది, ప్రేమిస్తే పెళ్లి చేసుకుని హాయిగా జీవించాలి, మేము ప్రేమించుకునేటప్పటికంటే ప్రస్తుతం ఒకరిపై మరొకరికి ప్రేమ పెరిగింది’ అని చెబుతున్నారు వారు.
- రమణ, నవ్య
కష్టాలను ఇష్టాలుగా
ప్రేమించేదే ప్రేమ :
జీవితంలో కష్టాలు, ఇష్టాలు రెండూ ఉంటాయి. కష్టాలను కూడా ఇష్టాలుగా ప్రే మించేదే నిజమైన ప్రేమ. అవి నేను ఎంబీబీఎస్ చదివే రోజులు. నా వయసు 22 ఏళ్లు. మాది అల్లూరు దగ్గర సింగపేట. మూలాపేటలోని నా స్నేహితుడి నివాసానికి అప్పుడప్పుడూ వస్తూఉండేవాడిని. ఈ క్రమంలో 1979 డిసెంబర్ 31వ తేదీన నా స్నేహితుని నివాసం వద్ద పద్మావతిని చూశా.
అప్పుడు తన వయసు 16. చూడగానే తననే పెళ్లి చేసుకోవాలనిపించింది. ఎలాగో కష్టపడి నువ్వంటే ఇష్టం అని చెప్పా. తను ఒప్పుకుంది. తన వయసు, నా చదువు దీంతో ఐదేళ్లపాటు ప్రేమించుకునేందుకు కాలం కలిసి వచ్చింది. ఈ సమయంలోనే కుటుంబ సభ్యుల మధ్య కూడా మంచి బంధం ఏర్పడింది. మా ప్రేమకు గమ్యం పెళ్లికి దారితీసింది. 1984లో మేము ఇరువురం పెళ్లి చేసుకున్నాం.’ ఇప్పుడు మాకు ఇంటర్మీడియట్ చదివే కుమారుడు ఉన్నాడు. ప్రేమకు వయసుతో పనిలేదు. ప్రేమపెళ్లిళ్లు ప్రేమికులకు ఆదర్శంగా నిలవాలి.
- డాక్టర్ ఈదూరు సుధాకర్, పద్మావతి
ప్రేమ..ఓ మధురానుభూతి
Published Fri, Feb 14 2014 3:36 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement