ప్రేమ కోసం వచ్చిన ప్రియుడు.. కానీ
– రైలు కింద పడి మృతి
–పది రోజుల కిందటే గల్ఫ్ నుంచి వచ్చిన ప్రియుడు
రాజంపేట: ఒకరు పెళ్లి కాని యువకుడు. మరొకరు పెళ్లై ముగ్గురు సంతానం ఉన్న వివాహిత. వారిద్దరూ ఇష్టపడ్డారు. ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఎక్కడెక్కడో తిరిగారు. చివరికి ఆదివారం రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలోని పట్టాలపై రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు విడిచారు. మృతదేహాల వద్ద ఆధారాలను బట్టి రైల్వేపోలీసులు.. వారి వివరాలను సేకరించి, సంబంధీకులకు సమాచారం ఇచ్చారు.
సంఘటన స్థలానికి రేణిగుంట జీఆర్పీ సీఐ అశోక్‌కుమార్, మన్నూరు ఎస్‌ఐ మహేశ్‌నాయుడు, రైల్వే పోలీసులు చేరుకొని పరిశీలించారు. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని సుంకేసులు గ్రామానికి చెందిన రాజోలి నాగార్జునరెడ్డి (26), కొమ్మలూరు గ్రామానికి చెందిన పుత్తా లక్ష్మీదేవి (26) కలిసి ఇళ్లు విడిచి వెళ్లారు. తన భార్య కనిపించడం లేదని ఖాజీపేట పోలీస్‌స్టేషన్‌లో మృతురాలి భర్త కూడా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఆమెకు ముగుర్గు సంతానం ఉన్నారు. పది రోజుల కిందట ప్రియుడు గల్ఫ్ నుంచి స్వదేశానికి రావడం జరిగింది.
వీరిద్దరూ ఇంటి నుంచి బయట పడి తిరుపతి తదితర ప్రాంతాల్లో తిరిగారు. చివరికి రాజంపేట రైల్వేస్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్నారు. వీరి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్నాయి. పోస్టుమార్టం నిమిత్తం రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం తర్వాత మృతుడి దేహాన్ని సంబంధీకులకు అప్పగించారు. కాని మృతురాలి దేహాన్ని తీసుకెళ్లడానికి వారి కుటుంబ సభ్యులు ఇష్టపడలేదని తెలిసింది. ఈ సంఘటనపై రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.