ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు | lover murdered his girlfriend in mantralayam | Sakshi
Sakshi News home page

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు

Published Sat, Feb 22 2014 9:56 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు - Sakshi

ప్రేమన్నాడు.. పెళ్లన్నాడు.. చంపేశాడు

మంత్రాలయం : ప్రేమతో వంచించాడు.. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు.. పెద్దలు సైతం పెళ్లి పత్రికలు వేయించారు. ఐదు రోజులు గడిస్తే పెళ్లి పీటలెక్కాల్సిన యువతిని కసితీరా చంపేసి ప్రేమపెళ్లిని మసి చేశాడు. తాళి కట్టాల్సిన చేతులతో యువతిని కడతేర్చిన ఈ విషాద ఘటన కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం చిలకలడోణ గ్రామంలో చోటుచేసుకుంది.

పోలీసులు, బంధువుల సమాచారం మేరకు వివరాలివి.. చిలకలడోణ గ్రామానికి చెందిన యాకోబు, హైమావతి  రెండో కుమార్తె మార్తమ్మ (18), అదే గ్రామానికి చెందిన పౌలు, జయమ్మ మూడో కుమారుడు యోహాను ప్రేమించుకున్నారు. అయితే, వివాహం చేసుకునేందుకు యోహానుకు ఇష్టంలేదు. విషయం తెలిసిన పెద్దలు బలవంతంగా యోహానును ఒప్పించారు. ఈనెల 26న వివాహం చేసేందుకు పెళ్లి పత్రికలు సైతం ముద్రించారు. దీంతో యోహాను గురువారం రాత్రి మార్తమ్మను కడతేర్చేందుకు వ్యూహం పన్నాడు. 8 గంటల సమయంలో యువతికి ఫోన్‌చేసి రమ్మని చెప్పాడు.

యువతిని మాటలతో మభ్యపెట్టి తుంగభద్ర దిగువ కాలువ మీదుగా బాపురం గ్రామ మార్గాన 2 కి.మీ దూరం తీసుకెళ్లాడు. యువతి కాళ్లను విద్యుత్ తీగలతో కట్టేశాడు. కసితీరా చంపేసి కాలువ చాంబర్‌లో పడేసి పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. మరోవైపు రాత్రి 8 గంటలకు వెళ్లిన కూతురు తిరిగి రాకపోవడంతో యోహాను దగ్గరకి వెళ్లి ఉంటుందేమోనని తల్లి హైమావతి భావించింది. అయితే, రాత్రి 10.30 గంటల సమయంలో ఓ పెళ్లి మెరవణిలో యోహాను ఈలలు వేస్తూ చిందులేస్తూ కనిపించాడు. అక్కడేమైనా ఉందేమోనని తల్లి వెళ్లి చూడగా కుమార్తె ఆచూకీ లేకపోవడంతో ఊరంతా వెతికారు. ఉదయం చాంబర్‌లో కాలిపడి ఉన్న మహిళా మృతదేహాన్ని ఓ పశువుల కాపరి చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చాడు.

కూతురు కాలిన మంటల్లో శవమై కనిపించడంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. యువతిని చంపేందుకు వినియోగించిన కటింగ్ ప్లేయర్, పెనుగులాడిన ప్రదేశాలను పోలీసులు పరిశీలించారు. తల్లి ఫిర్యాదు మేరకు నిందితుడు యోహానును అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా, యోహాన్‌పై పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గతంలో ముంబైకి వలస వెళ్లి అక్కడో యువతిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడని, అక్కడి వారు దేహశుద్ధి చేశారని గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే, బెంగళూరులో కూడా ఇలాంటి సంఘటనే ఎదురైనట్లు తెలుపుతున్నారు. యువతిని ఒక్కడే మట్టుబెట్టాడా.. వేరొకరి సాయం తో దారుణానికి ఒడిగట్టాడా అనే కోణాలలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement