సాక్షి, మచిలీపట్నం :
తమ డిమాండ్లు పరిష్కరించని పాలకుల తీరుపై కన్నెర్ర చేసిన మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు జిల్లాలో సమ్మెబాట పట్టారు. విధులను బహిష్కరించి కోర్కెల సాధనకు ఆందోళనకు దిగారు. జిల్లాలో విజయవాడ నగరంతో పాటు నాలుగు మున్సిపాలిటీలు, మూడు నగర పంచాయతీల్లో సుమారు నాలుగువేల మంది మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 21 నుంచి విధులను బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. విజయవాడలో 3,400 మంది, గుడివాడ 267, జగ్గయ్యపేట 104, పెడన 80, నూజివీడులో వందమందితో పాటు నందిగామ, తిరువూరు, ఉయ్యూరు నగర పంచాయతీల్లో సుమారు 200 మంది రెండు రోజులుగా సమ్మెలో కొనసాగుతున్నారు. దీంతో ఆయా పట్టణాల్లో పారిశుధ్య పనులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమ్మె మంగళవారం రెండో రోజుకు చేరడంతో పారిశుధ్య నిర్వహణ, మంచినీటి సరఫరాలపై తీవ్ర ప్రభావం పడింది. దీనికితోడు రెండు రోజులుగా కుండపోత వర్షాలు పారిశుధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో పారిశుధ్య సిబ్బంది సమ్మెతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోయింది. జోరువానలు వాటికి తోడయ్యాయి. పేరుకుపోయిన చెత్తకుప్పలు నీటిలో నానుతున్నాయి. మరోవైపు సిల్ట్ తీయక డ్రెయిన్లు వర్షం నీరు లాగనని మొరాయిస్తున్నాయి. దీంతో ఈగలు, దోమలు, పందులు విజృంభిస్తాయని పట్టణ వాసులు ఆందోళన చెందుతున్నారు. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే ప్రమాదముందని పేర్కొంటున్నారు. ఇటీవల సీజనల్ జ్వరాలు, మలేరియా, టైఫాయిడ్ వ్యాపించి జిల్లా వణికిపోతోంది. దీనికితోడు ప్రస్తుత వర్షాలకు పారిశుధ్య నిర్వహణ చూడకపోతే అంటువ్యాధులు ప్రజారోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయని జనం బెంబేలెత్తుతున్నారు.
మచిలీపట్నంలో సమ్మెకు దూరం...
జిల్లాలో సీఐటీయూ అనుబంధ ఏపీ మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ యూనియన్‌లు బలంగా ఉన్న అన్ని పట్టణాల్లోను మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె కొనసాగిస్తున్నారు. జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీలకు చెందిన కార్మికులు ఉండటంతో వారు సమ్మెకు దూరంగా ఉన్నారు. మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలపై ఈ నెల 24న ప్రభుత్వం చర్చలు జరిపే అవకాశం ఉందని, అప్పటికీ పరిస్థితి సానుకూలంగా లేకపోతే ఆందోళనకు వెళ్లాలని ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు భావిస్తున్నారు. దీంతో మచిలీపట్నం మున్సిపాలిటీ పరిధిలో కాంట్రాక్ట్ కార్మికులు రోజువారీ విధులు నిర్వర్తిస్తూ సాయంత్రం సమయంలో రెండు గంటలు నిరసన వ్యక్తం చేసి తమ డిమాండ్లు
ప్రస్తావిస్తున్నారు.
19 డిమాండ్లు...
సమ్మె చేస్తున్న కాంట్రాక్టు కార్మికులు 19 డిమాండ్లు ప్రభుత్వం ముందు పెట్టారు. కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం నెలకు రూ.12,500 ఇవ్వాలని, వారిని పర్మినెంట్ చేసి డీఏ, పీఆర్సీని వర్తింపచేయాలనేవి ప్రధాన డిమాం డ్లుగా ఉన్నాయి. డిమాండ్ల పరిష్కారం కోసం ఆగస్టు 30న కార్మిక శాఖ, డీఎంఏకు మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులకు చెందిన 10 సంఘాలు నోటీసు ఇచ్చాయి. రెండు రోజులుగా సమ్మె కొనసాగిస్తుండటంతో ఈ నెల 24న కార్మిక సంఘాలతో చర్చలు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. తమ సమస్యను పట్టించుకోవాల్సిన మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి తన కుమార్తె వివాహ వేడుకల ఏర్పాట్లలో బిజీగా ఉన్నారని, డీఎంఏ కూడా స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించలేదని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీవీ కృష్ణ ఆరోపించారు. ఈ నెల 24వరకు సమ్మె చేస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని ‘సాక్షి’కి చెప్పారు.
మురికి‘పల్టీలు’..
Published Wed, Oct 23 2013 2:45 AM | Last Updated on Fri, Sep 1 2017 11:52 PM
Advertisement
Advertisement