‘ఉగ్ర’ కలకలం
- మదనపల్లెలో ముగ్గురుఅనుమానితుల అరెస్టు
- రెండు తుపాకులు, పిస్టోల్ స్వాధీనం
- నిందితులు ఉగ్రవాదులా.. కిడ్నాపర్లా?
- గతంలో తీవ్రాది ఖురేషి మకాం
మదనపల్లె, న్యూస్‌లైన్: ప్రశాంత వాతావరణానికి మారుపేరైన మదనపల్లెలో ఉగ్రవాద కలకలం రేగుతోంది. వారంరోజులు గా తిష్టవేసిన అనుమానితులు షబ్బీర్, పుజ్జు, హసన్ లను శుక్రవారం హైదరాబాద్ పోలీసులు పట్టుకోవడంతో పట్టణంలో కలకలం రేగింది. నిందితుల వద్ద తుపాకులు ఉండడంతో వారు ఉగ్రవాదులుగానీ.. దారిదోపిడీలకు పాల్పడే వారుగానీ అయి ఉండవచ్చని అనుమానం వ్యక్తమవుతోంది. పట్టణంలో స్పెషల్‌బ్రాంచి, ఇంటెలిజెన్స్ వంటి నిఘా వర్గాల పోలీసులు పనిచేస్తున్నా వారి వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది.
కరుడుగట్టిన తీవ్రవాది మహ్మద్ ఖురేషి 2009లో మదనపల్లెలోని కురవంకలో ఉన్న ప్రియురాలికోసం వచ్చాడు. సుమారు నెలరోజుల పాటు మదనపల్లెలోనే మకాం వేసినా తీవ్రవాది జాడను నిఘావర్గాలు గుర్తించలేక పోయాయి. అప్పట్లో వన్‌టౌన్‌లో ఉన్న ఎస్‌ఐ మల్లికార్జునగుప్త వ్యభిచార గృహాలను తనిఖీ చేసే క్రమంలో ఖురేషి పట్టుబడ్డాడు. ఖురేషి తీవ్రవాది అని తెలియడంతో మదనపల్లెలో కలకలం రేగింది. మదనపల్లెలో తీవ్రవాది మకాం.. ఇక్కడి నుంచి కార్యకలాపాలకు శ్రీకారం చుడుతున్నాడనే కథనాలు పత్రికల్లో రావడంతో సంచలనం రేగింది.
అప్పట్లో పోలీసులు అప్రమత్తమై నిఘా వర్గాలను బలోపేతం చేశారు. అయితే కాలక్రమంలో ఆ నిఘావర్గాలు పూర్తిగా కనిపించకుండా పోయాయి. తర్వాత ఐదేళ్లకు మదనపల్లెలో జన సంచారం మధ్యే నలుగురు అనుమానిత తీవ్రవాదులు జీవనం చేస్తున్నా నిఘా వర్గాలు పసిగట్టలేకపోయాయి. శుక్రవారం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆపరేషన్ చేసి అనుమానిత తీవ్రవాదులను అరెస్ట్ చేయడంతో మళ్లీ మదనపల్లెలో తీవ్రవాదుల కలకలం రేగింది.
ఇరాని తెగకు చెందిన జాఫర్, షబ్బీర్, పుజ్జు, హసన్ అనే అనుమానిత తీవ్రవాదులు ప్రజల మధ్యనే తిరుగుతుండగా హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. వీరిని పట్టుకునే క్రమంలో పోలీసులపైనే దుండగులు మారణాయుధాలతో తిరుగుబాటు చేసి, పారిపోవడానికి ప్రయత్నించగా స్థానికులు సహకరించి పోలీసులకు పట్టిచ్చారు.
మదనపల్లెలో తీవ్రవాద కార్యకలాపాలు ఊపందుకున్నాయనేందుకు ఈ రెండు సంఘటనలే ఉదాహరణలుగా పలువురు అభిప్రాయపడుతున్నారు. పోలీసు అధికారులు నిఘావర్గాలను పటిష్టంచేసి తీవ్రవాద కార్యకలాపాలకు ఫుల్‌స్టాప్ పెట్టి, ప్రజలకు రక్షణ కల్పించాల్సి ఉంది.