ఒంగోలు టౌన్, న్యూస్‌లైన్ : ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డికి మరోసారి సమైక్యాంధ్ర సెగ గట్టిగా తగిలింది. పదవికి రాజీనామా చేయకుండా నాటకాలాడుతూ ప్రజలను, ఉద్యోగులను మభ్యపెడుతున్నాడంటూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక నాయకులు ఎంపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి అండగా నిలవని ఎంపీ మాగుంట వ్యవహార శైలిపై ఇప్పటికే ఉద్యోగులు, ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఒంగోలు వచ్చిన ఎంపీ మాగుంట కు ఉద్యోగుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ర్యాలీగా బయలుదేరి స్థానిక రామ్‌నగర్‌లోని ఎంపీ కార్యాలయాన్ని ముట్టడించారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఎంపీ వెంటనే రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. దీనిపై ఎంపీ మాగుంట స్పందిస్తూ.. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ తాను చాలా రోజుల క్రితమే రాజీనామా చేశానని వివరించే ప్రయత్నం చేశారు. లోక్‌సభ స్పీకర్ తన రాజీనామా ఆమోదించడం లేదని, ఎంపీ కోటా కింద వచ్చే ఏ సౌకర్యాలనూ తాను పొందడం లేదని చెప్పుకొచ్చారు. ఉద్యోగులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన కార్యక్రమంలో జేఏసీ నాయకులు అబ్దుల్‌బషీర్, బండి శ్రీనివాసరావు, రాజ్యలక్ష్మి, కృష్ణారెడ్డి, స్వాము లు, ప్రకాశ్, కేఎల్ నరసింహారావు, మస్తాన్‌వలి, తోటకూర ప్రభాకర్, నరశింహారావు, శ్యామ్, నాగేశ్వరరావు, నహేమియా, జిలానీ, ఏడుకొండలు, శోభన్‌బాబు, రోజ్‌కుమార్, మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు.
కేంద్ర మంత్రులకు పిండ ప్రదానం..
తెలంగాణ బిల్లును కేబినేట్ ముందుకు రానివ్వకుండా అడ్డుకుంటామని చెప్పి సీమాంధ్ర ప్రజలను మోసం చేసిన కేంద్ర మంత్రుల తీరును నిరసిస్తూ.. సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలకు ఒంగోలు నగరంలో శవయాత్ర నిర్వహించారు. స్థానిక ముంగమూరురోడ్డులోని సాగర్ కాల్వ వద్ద కేంద్ర మంత్రులకు పిండ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి జేఏసీ రాష్ట్ర కో కన్వీనర్ రాయపాటి జగదీష్ మాట్లాడుతూ.. సీమాంధ్ర కేంద్ర మంత్రులు ప్రజలను నిలువునా ముంచారని దుయ్యబట్టారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులంతా భౌతికంగా నేడు భూస్థాపితం అయ్యారని ధ్వజమెత్తారు. అసెంబ్లీలో తెలంగాణ బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మరో 20 మంది ఎమ్మెల్యేలను పోగు చేశారని, రాష్ట్రం విడిపోవడానికి బొత్స సత్తిబాబే ప్రధాన కారణమని విమర్శించారు. సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తున్న విద్యుత్ ఉద్యోగులకు విద్యార్థి జేఏసీ అండగా ఉంటుందన్నారు. విద్యుత్ ఉద్యోగులు చేపట్టే నిరసన కార్యక్రమాల్లో పాల్గొంటామని తెలిపారు. పిండ ప్రదానం చేసిన వారిలో నగర కన్వీనర్ చెన్నుబోయిన అశోక్‌యాదవ్, వరప్రసాద్, జగన్నాథం మహేష్, జాన్‌పాల్, మురళి తదితరులు ఉన్నారు.
ఎంపీ మాగుంట రాజీ‘డ్రామా’పై ఉద్యోగుల ఫైర్
Published Wed, Oct 9 2013 6:48 AM | Last Updated on Mon, Oct 8 2018 5:23 PM
Advertisement
Advertisement