దేవతలారా రండి..!
ముక్కోటి దేవతలకు ముక్కంటి ఆహ్వానం
కాళహస్తి కైలాసగిరుల్లో కన్నప్ప సందడి
కనుల పండువగా కన్నప్ప ధ్వజారోహణం
నేడు స్వామివారి ధ్వజారోహణం
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యూయి. మాఘ బహుళ అష్టమి గురువారం సాయంత్రం 4:30 గంటలకు కాళహస్తి కైలాసగిరుల్లో భక్త కన్నప్ప ధ్వజారోహణ కార్యక్రమం కనులపండువగా నిర్వహించారు. కైలాసగిరిపైనున్న భక్త కన్నప్ప ఆలయం నుంచి అర్చకులు ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ పూజలు నిర్వహించారు. బ్రహ్మదేవుడి సారధ్యంలో జరిగే బ్రహ్మోత్సవాలకు దివి నుంచి దేవతలారా దిగిరావాలి.. దీవించాలి అంటూ అర్చకులు సంప్రదాయం ప్రకారం ఆహ్వానించారు. భక్తుడైన కన్నప్పకు ఉత్సవాల్లో ప్రథమపూజను పరమశివుడు వరంగా ఇచ్చారు. ఈ కారణంగా బ్రహ్మోత్సవాల్లో తొలి రోజున భక్త కన్నప్ప కొండపై వేడుకగా ధ్వజారోహణం నిర్వహించారు. దేవుడి ఉత్సవంలోను భక్తునికే తొలి పూజ గౌరవం దక్కింది. సాయంత్రం ముక్కంటీశుని ఆలయంలో స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. తర్వాత శ్రీకాళహస్తీశ్వరస్వామి, జ్ఞానప్రసూనాంబ, భక్తకన్నప్ప ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించారు. మేళాతాళాలు, భక్తుల జయజయధ్వానాల మధ్య ఊరేగింపుగా కైలాసగిరిలోని భక్తకన్నప్ప ఆలయానికి తీసుకెళ్లారు. భక్తకన్నప్ప ధ్వజస్తంభానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం వేదమంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా దర్బతో తయారుచేసిన పవిత్రదారాన్ని,వస్త్రాన్ని ధ్వజానికి అలంకరించారు. తర్వాత సంప్రదాయబద్ధంగా నైవేద్యం సమర్పించారు. దీపారాధన చేయడంతో ధ్వజారోహణం పూర్తయింది. దీంతో శ్రీకాళహస్తీశ్వరుని వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగింది. అనంతరం విద్యుద్దీపాల వెలుగులు,బాణసంచా పేలుళ్ల మధ్య ఉత్సవ మూర్తులను పురవీధుల్లో ఉరేగించారు. భక్తులు కర్పూరహారతులతో స్వాగతం పలికారు. ఆలయ ఈవో బి.రామిరెడ్డి,ఏఈవో శ్రీనివాసులురెడ్డి,ఈఈ రామిరెడ్డి,పీఆర్వో హరిబాబుయాదవ్, శాప్ చైర్మన్ పీఆర్ మోహన్,మున్సిపల్ చైర్మన్ పేట రాధారెడ్డి,వైస్ చైర్మన్ ముత్యాల పార్థసారధి, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్లు శాంతారామ్ జే పవార్, బీజేపీ నాయకులు కండ్రిగ ఉమ,కోలా ఆనంద్,టీడీపీ నాయకుడు డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం,కంఠా ఉదయ్‌కుమార్,వైఎస్సార్సీపీ నాయకుడు తీగల భానుప్రకాష్‌రాయల్,ఉభయదాతలు, చెన్నైకి చెందిన కామవర్తి సాంబయ్య,సుభద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.
నేడు స్వామివారి ధ్వజారోహణం.. దేవరాత్రి
బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు, మాఘబహుళ నవమినాడు శుక్రవారం శ్రీకాళహస్తీశ్వరాలయంలో స్వామివారి ధ్వజారోహణం నిర్వహిస్తారు.మధ్యాహ్నం 1.30 గంటలకు ఆలయంలోని స్వామి వారి సన్నిధికి ఎదురుగా ఉన్న ధ్వజస్తంభం వద్ద శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి ధ్వజారోహణం చేస్తారు. ఉదయం,సాయంత్రం వెండి అంబారీలపై స్వామి, అమ్మవారు ఊరేగుతారు.పాల సముద్రాన్ని చిలికిన సందర్భంగా వచ్చిన హాలాహలాన్ని మింగిన శివుడు మగత నిద్రలోకి జారుకుంటాడు. ఆయనను మేల్కొలపడానికి దేవతలు చేసే ఉత్సవాన్నే ధ్వజారోహణం అంటారు.దీనినే దేవరాత్రి అని కూడా పిలుస్తారు.