పొగాకు నాణ్యత పెంపునకు కృషి చేయండి | Make the effort to increase the quality of tobacco | Sakshi
Sakshi News home page

పొగాకు నాణ్యత పెంపునకు కృషి చేయండి

Published Sat, Jan 4 2014 12:45 AM | Last Updated on Mon, Oct 8 2018 5:23 PM

విదేశాలకు ఎగుమతి చేసే పొగాకు నాణ్యత విషయంలో రైతులు, వ్యాపారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించారు.

 సాక్షి, గుంటూరు: విదేశాలకు ఎగుమతి చేసే పొగాకు నాణ్యత విషయంలో రైతులు, వ్యాపారులు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం గుంటూరులో జరిగిన భారత పొగాకు బోర్డు పదో వ్యవస్థాపక వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పొగాకు ఉత్పత్తిదారులు, వ్యాపారులు, ఎగుమతిదారులను ఉద్దేశించి ప్రసంగించారు. పొగాకులో సరైన నాణ్యత లేకపోవడం, అన్య పదార్థాలు ఎక్కువగా రావడం వల్ల సిగరెట్ తయారీ కంపెనీలు అధిక మొత్తంలో ఎగుమతులను తిరస్కరిస్తున్నాయన్నారు.

దీన్ని అధిగమించేందుకు అటు రైతులు, ఇటు వ్యాపారులు కూడా సరైన నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఎంపీ కోరారు. సెంట్రల్ టుబాకో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీటీఆర్‌ఐ) , భారత టుబాకో బోర్డు సిఫార్సుల ప్రకారం జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. రైతులు, వ్యాపారుల మధ్య సత్సంబంధాలు ఉన్నపుడే సరైన గిట్టుబాటు ధర సాధ్యమవుతుందన్నారు. అన్ని వేలం కేంద్రాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు బోర్డు చొరవ తీసుకోవాలన్నారు. ఏయేటికాయేడు పొగాకుకు బదులు ప్రత్యామ్నాయ పంటకు వెళ్లాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ రైతులను హెచ్చరిస్తోందనీ, ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో శనగ పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసేలా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. గుంటూరు లోని టుబాకో బోర్డు కార్యాలయాన్ని ఒంగోలుకు మారిస్తే బాగుంటుందన్నారు.

 బోర్డు చైర్మన్ డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ పొగాకు రైతుల సంక్షేమం కోసం బోర్డు పలు బృహత్తర కార్యక్రమాలు, పథకాలను అమలు చేస్తుందన్నారు. ఏదేని కారణాలతో రైతు మరణిస్తే ఇప్పటి వరకు ఇచ్చే రూ.25 వేల ఆర్థిక సాయాన్ని రూ.50 వేలకు, రూ.50 వేల సాయాన్ని రూ. లక్షకు పెంచినట్లు ప్రకటించారు. రైతు సంక్షేమనిధి నుంచి ఈ మొత్తాన్ని మంజూరు చేస్తామన్నారు.
 రైతుల నుంచి వసూలు చేసే పెనాల్టీలను తిరిగి రైతుల కోసమే వినియోగించాలని వర్జీనియా పొగాకు రైతుల సంఘం రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీ డాక్టర్ యలమంచిలి శివాజీ సూచించారు. కాఫీ, రబ్బరు, స్పైసెస్ బోర్డుల మాదిరిగా టుబాకో బోర్డుకు కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రత్యేక నిధుల కేటాయింపు జరపాలన్నారు.

కుటుంబ ప్రయోజన పథకాలను ప్రవేశపెట్టి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు. ఈ సందర్భంగా రైతుల్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. లక్షల్లో బ్యారన్ అద్దెలు చెల్లించి ఏ మేరకు దిగుబడులు సాధిస్తారని ప్రశ్నించారు. బోర్డు సభ్యులు తాడిశెట్టి మురళీ మాట్లాడుతూ, టుబాకో బోర్డు స్వయంగా ఎక్స్‌పోర్టు ధరలు నిర్ణయించాలన్నారు. ఇండియన్ టుబాకో అసోసియేషన్ తాజా, మాజీ అధ్యక్షులు మిట్టపల్లి ఉమామహేశ్వరరావు, బెల్లం కోటయ్య, బోర్డు సభ్యులు గద్దె శేషగిరిరావు, జాస్తి రమేష్‌కుమార్, పి. భద్రారెడ్డి, కేవీ రాయుడు, బీఎన్ జయరాం, రావూరి అయ్యవారయ్య, ఐటీసీ సీఈవో సంజీవ్‌రంగ్రాస్‌లు కూడా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన పలువురు రైతులు, వ్యాపారులు, ఎగుమతిదారులను అవార్డులతో సత్కరించారు. వివిధ వేలం కేంద్రాల్లో సరైన పనితీరు కనబరుస్తున్న కొందరు సూపర్‌వైజర్లను కూడా చైర్మన్ సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement