రూపం..అపురూపం..
ముద్దమందారంలాంటి ముఖారవిందం.. అరవిరిసిన కలువల్లాంటి కళ్లకు కాటుక బంధం.. సింధూర శోభితమై మెరిసిపోయే కస్తూరి తిలకం.. నునుసిగ్గుల బుగ్గలకు నల్లటి చంద్రబింబం.. సింగారి చేతులకు సిరిగంధం.. హరివిల్లును తలపించే పెళ్లి పట్టుచీర.. కాళ్లకు పారాణి.. అందానికే అర్థం చెప్పే తెలుగింటి నవవధువుకే సొంతమైన ఆభరణాలివి. పసుపు రాసిన ముఖానికి మరింత వన్నెతెచ్చే వయ్యూరాలివి. ఒకప్పుడు ఇంటి అందానికే పరిమితమైన పెళ్లికూతురు ఇప్పుడు బ్యూటీపార్లర్లకు పరుగులు పెడుతోంది. నలుగురిలోనూ నవ వధువే అందంగా కనిపించాలని బ్యూటీషియన్లు కూడా సరికొత్త మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. నుదుట బాసికం నుంచి కాళ్ల పారాణి వరకు సెలక్టెడ్‌గా చూసుకుంటూ పెళ్లి కూతురును సిద్ధం చేస్తున్నారు. విజయవాడ నగరంతోపాటు జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో ఈ తరహా బ్యూటీస్పాలు పెళ్లి కూతుర్ల పాలిట వరాలుగా మారారుు.
విజయవాడ : పెళ్లి.. ప్రతి ఒక్కరి జీవితంలో ఒకేసారి జరిగే పండుగ. దీనిని వినూత్నంగా, అందంగా జరుపుకోవాలన్న తపన అందరిలోనూ ఉంటుంది. ఇక నవ వధువునైతే అందంగా ముస్తాబుచేసి మురిసిపోవాలని తల్లిదండ్రులు ఆశ పడతారు. పెళ్లిలో వినూత్నంగా కనిపించి అత్తింటి వారి నుంచి నూటికి నూరు మార్కులు కొట్టేయూలని వధువు అనుకుంటుంది.
ఇందుకోసం మరింత అందంగా ముస్తాబవుతుంది. యువతుల ఈ ఆసక్తిని గమనించిన బ్యూటీషియన్లు రకరకాల మేకప్‌లతో బ్యూటీషియన్ సెంటర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. నుదుట బాసికం నుంచి పెళ్లిలో కట్టే చీర వరకు అన్నీ వారే డిజైన్ చేస్తున్నారు. ఇలా.. కొందరిని పెళ్లిరోజు, మరికొందరిని పెళ్లికి వారం రోజుల ముందు నుంచే సిద్ధం చేస్తున్నారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పెళ్లి వేడుక ఏదైనా.. ఆయా మత సాంప్రదాయాల ఆధారంగా నవ వధువులను ముస్తాబు చేసుందుకు బ్యూటీషియన్లు ముందుకొస్తున్నారు. వాటర్ మేకప్, మడ్ మేకప్, స్ప్రే మేకప్ ఇలా వివిధ రకాల మేకప్‌లను అందుబాటులోకి తెస్తున్నారు. పెళ్లిరోజు చీరను కూడా వారే కడుతున్నారు.
రెండు గంటల ముందు నుంచే..
వేడుక ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే పెళ్లి కూతురును ముస్తాబు చేయడం ప్రారంభిస్తారు. తొలుత వధువు పర్మనాలజీ, ముఖ కవలికలను బట్టి ఎలాంటి మేకప్ వేయాలో నిర్ణయిస్తారు. ముఖంపై మచ్చలు ఉంటే కనిపించకుండా కన్సెలర్ మేకప్ వేసి సిరిదిద్దుతారు. కొందరికి నుదుటి భాగం నలుపు రంగులో ఉంటుంది. అలాంటి వాటిని సరిదిద్దేందుకు ఫౌండేషన్ మేకప్ వేస్తారు. అనంతరం కాంపాక్ట్ కోటింగ్ ద్వారా చూడచక్కగా తీర్చిదిద్దుతారు. పెళ్లిలో కట్టే చీరరంగు బట్టి కనురెప్పలపై మేకప్ డిజైన్ చేస్తారు. లిప్‌స్టిక్ కూడా ముఖ కవలికల ఆధారంగానే ఉంటుంది. పెదవులు పెద్దగా ఉన్న వారికి చిన్నవిగా చూపించే లిప్‌స్టిక్ వేస్తారు. ఇలా ప్రతి అంశాలోనూ ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వధువును ముస్తాబు చేస్తారు. ఈ మేకప్ 6 నుంచి 7 గంటలు చెక్కు చెదరదు.
శి‘రోజా’లు
పెళ్లి సంప్రదాయూన్ని బట్టి బ్యుటీషియన్లు నవ వధువు హెయిర్ స్టైల్ డిజైన్ చేస్తారు. హిందూ సంప్రదాయ పెళ్లయితే పూలజడ, క్రిస్టియన్ పెళ్లి అయితే జుట్టు ముడివేసి ముఖంపైకి వెయిల్, ముస్లిం మ్యారేజ్ అయితే జుట్టు ముడివేసి పూలతో జడలా అల్లడం, ముఖంపైకి పూలు వచ్చేలా చేయడం చేస్తారు. రిసెప్షన్‌కైతే హెయిర్‌ను ఫ్రీగా వదిలేసి డిజైన్ చేస్తారు. కొందరు పెళ్లి వేడుకకు వారం, పదిరోజుల ముందు నుంచే బ్యూటీస్పా సెంటర్లకు వెళ్తున్నారు. టానింగ్, పేషియల్స్, బాడీ పాలీషింగ్ వంటి సిటింగ్‌ల ద్వారా చర్మంలోని మృత కణాలను తొలగించి సౌందర్యవంతంగా తయూరుచేస్తున్నారు. చేతులు నిగనిగ లాడేందుకు మానెక్యూర్, పాదాలు అందంగా కనిపించేందుకు పెడిచ్యూర్, జుట్టు మిలమిలా మెరిసిపోయేందుకు స్పా చేస్తున్నారు.
రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం..
వధువు ముస్తాబు విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. వారి ఇష్టానుసారమే మేకప్ వేస్తాం. ఇటీవల కాలంలో పెళ్లిళ్ల సమయంలోనే కాదు.. పెళ్లి కూతురును చేసేటపుడు కూడా బ్యూటీషియన్లను ఆశ్రయిస్తున్నారు. వారి ఆకాంక్షలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నవ వధువులను తీర్చిదిద్దుతున్నాం. ఈ విషయంలో ముందుగానే బంధువులకు కౌన్సెలింగ్ ఇస్తాం. ఒక్కో వేడుకకు రూ.10వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తాం. పెళ్లి వేడుకల్లో కుటుంబ సభ్యులు డ్యాన్స్ చేసేందుకు ప్రత్యేక శిక్షణ కూడా మేము ఇస్తున్నాం.
- ఉడత ముఖేష్‌కుమార్, వెర్టెక్స్ గ్రూప్, డెరైక్టర్
అందానికే ప్రాధాన్యత
నవ వధువుకు మేకప్ వేసేందుకు ముందుగా ఆమె పర్శనాలటీ, ముఖ కవలికలు వంటివి పరిగణనలోకి తీసుకుంటాం. పెళ్లి పగలా, రాత్రా అనే అంశాన్ని బట్టీ మేకప్ డిజైన్ ఉంటుంది. కనురెప్పల మేకప్‌తో పాటు లిప్‌స్టిక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం. చేతి గోర్లను షేప్ తీసుకురావడంతో పాటు అందంగా కనిపించేలా మెహిందీ వేస్తాం. పాదాలు మరింత అందంగా కనిపించేలా చూస్తాం. ఎంత సమయం పట్టినా.. పెళ్లి వేడుకలో అందంగా కనిపించడమే లక్ష్యంగా కృషి చేస్తుంటాం.
- అను అగర్వాల్, బ్యూటీషియన్