చకచకా ఏర్పాట్లు | Making the arrangements | Sakshi
Sakshi News home page

చకచకా ఏర్పాట్లు

Published Sat, Feb 1 2014 2:11 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

Making the arrangements

 పులివెందుల/వేంపల్లె, న్యూస్‌లైన్ : వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రతిష్టాత్మకంగా ఫిబ్రవరి 2వ తేదీన ఇడుపులపాయలో నిర్వహించే రెండవ ప్లీనరీకి(ప్రజాప్రస్థానం) ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఇడుపులపాయలో ఒకటవ తేదీన సీజీసీ సమావేశం, అధ్యక్ష పదవికి షెడ్యూల్ విడుదల, ఫిబ్రవరి 2వ తేదీన అధ్యక్ష ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు, తర్వాత ఎన్నికల ఫలితాలు ప్రకటిస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి పరిశీలించారు.
 
 వీరితోపాటు చక్రాయపేట వైఎస్‌ఆర్ సీపీ మండల ఇన్‌ఛార్జి వైఎస్ కొండారెడ్డి, తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. అక్కడే ఉన్న జిల్లా మున్సిపల్ ఎన్నికల పరిశీలకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ఏర్పాట్లపై ఆరా తీశారు. భోజన వసతి, పార్కింగ్, స్టేజీ నిర్మాణం తదితర వాటిపై సమగ్రంగా చర్చించారు.
 
 నేడు వైఎస్ జగన్ రాక :
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఇడుపులపాయకు రానున్నారు. నెల్లూరు జిల్లాలో సమైక్య శంఖారావం యాత్ర ముగిసిన వెంటనే ప్రజాప్రస్థానం ప్లీనరీలో పాల్గొనడానికి వస్తున్నారు. అలాగే వైఎస్ జగన్ సోదరి షర్మిల కూడా శనివారం ఉదయాన్నే ఇడుపులపాయకు చేరుకోనున్నారు.
 
 నాయకులతో సమావేశం :
 పులివెందుల నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలతో  పులివెందుల వైఎస్‌ఆర్ సీపీ నాయకులు వైఎస్ భాస్కర్‌రెడ్డి ప్లీనరీ కార్యక్రమంపై శుక్రవారం సమావేశమయ్యారు. పాసుల జారీ, భోజన వసతి, ఇక్కడికి వచ్చే నాయకుల సంఖ్య తదితర వాటిపై చర్చించారు.
 
 నేడు ఎమ్మెల్యే విజయమ్మ రాక
 వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ గౌరవాధ్యక్షురాలు, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ శనివారం పులివెందులకు రానున్నారు.  హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా పులివెందులకు చేరుకుంటారు.  శనివారం ఉదయం 11గంటల ప్రాంతంలో పులివెందులలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతులకు సంబంధించిన భూ పట్టాలను పంపిణీ చేయనున్నారు.అనంతరం  ఇడుపులపాయకు వెళతారు.
 
 ప్లీనరీని జయప్రదం చేయండి
 ఇడుపులపాయలో ఈనెల 2వ తేదీన నిర్వహించనున్న వైఎస్‌ఆర్‌కాంగ్రెస్‌పార్టీ ప్లీనరీని జయప్రదం చేయాలని  జిల్లా కన్వీనర్ కె.సురేష్‌బాబు ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.  సమావేశాలకు పార్టీలో 27 రకాల హోదాలున్న వారిని ప్రతినిధులుగా ఆహ్వానించారన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 9వేల మంది ప్లీనరీలో పాల్గొననున్నారని తెలిపారు. జిల్లాకు చెందిన నాయకులంతా తప్పనిసరిగా హాజరుకావాలన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement